న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది.
త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.
అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది.
కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.
అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment