వీసా గోల్డెన్‌ చాన్సేనా? | Opinions say it will be difficult to meet Trumps expectations on Gold Card | Sakshi
Sakshi News home page

Golden Visa: వీసా గోల్డెన్‌ చాన్సేనా?

Published Sun, Mar 2 2025 2:52 AM | Last Updated on Sun, Mar 2 2025 3:22 PM

Opinions say it will be difficult to meet Trumps expectations on Gold Card

గత దశాబ్ద కాలంలో ఈబీ–5 వీసా తీసుకున్నభారతీయులు 3,800 మంది

అమెరికా గోల్డ్‌ కార్డ్‌ అందుకునేందుకు మనవాళ్లు సిద్ధమేనా? 

రూ.43.7 కోట్లు చెల్లించే స్తోమత ఎందరికి ఉంటుందనే సందేహాలు 

పన్ను నిబంధనలపై అనిశ్చితితోనూ సమస్యలు 

గోల్డ్‌ కార్డ్‌పై ట్రంప్‌ అంచనాలు నెరవేరడం కష్టమనే అభిప్రాయాలు 

గోల్డ్‌ కార్డ్‌ విధానం అమెరికా రుణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్న ట్రంప్‌

రూ. 43,70,00,000 కోట్లుకోటి గోల్డ్‌ కార్డులు అమ్మితే అమెరికాకు వచ్చే ఆదాయం  

100కు పైనే... గోల్డెన్‌ వీసాలు ఇస్తున్న దేశాలు

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్‌ సర్కార్‌ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్‌ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్‌ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. 

వ్యాపారం పరంగా ఈ ఆఫర్‌ అమెరికన్‌ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్‌ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్‌ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు.  – సాక్షి, బిజినెస్‌ బ్యూరో

ట్రంప్‌ లక్ష్యం అంత సులభమేమీ కాదు..
ఒక కోటి గోల్డ్‌ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్‌ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్‌ స్విస్‌ గ్లోబల్‌ వెల్త్‌ రిపోర్ట్‌ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్‌ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్‌ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. 

ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్‌ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్‌ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్‌ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్‌ నిపుణులే పేర్కొంటున్నారు. 

గోల్డ్‌కార్డ్‌పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. 
» ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్‌ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
» గోల్డ్‌ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్‌ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్‌ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్‌ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్‌ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. 
»  ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్‌ కార్డ్‌ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్‌ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. 
»  కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. 

ముందున్న సవాళ్లు రెండు.. 
ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. 
వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్‌ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. 

కోర్టులలో..
అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. 

భారతీయులు–గోల్డ్‌ కార్డ్‌..
కాన్సులర్‌ ప్రాసెసింగ్‌ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్‌ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్‌ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్‌ న్యాయవాది, అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సభ్యురాలు రవనీత్‌ కౌర్‌ బ్రార్‌ అభిప్రాయపడ్డారు. 

గోల్డ్‌ కార్డ్‌ వీసా అంటే? 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘గోల్డ్‌ కార్డ్‌’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్‌కార్డ్‌కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్‌ కార్డ్‌ కోరుకునేవారు యూఎస్‌ ప్రభుత్వానికి 5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. 

గోల్డ్‌ కార్డ్‌ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్‌ అన్నారు. 

అప్పుల భారం తగ్గించుకునేందుకు.. 
గోల్డ్‌ కార్డ్‌ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్‌ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్‌ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. 

అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్‌ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్‌ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్‌ చెప్పారు. యాపిల్‌ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్‌ కార్డులను స్పాన్సర్‌ చేయవచ్చన్నారు. 

ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. 
ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్‌ కార్డ్‌ రానుంది. యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్‌ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. 

ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్‌ అందుకోవచ్చు. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్‌ కోర్టు అడ్డుకుంది. 

అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్‌ కార్డ్‌ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. 

దశాబ్దంలో 3,800 మంది.. 
హెచ్‌–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్‌ కార్డ్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్‌ వీసాలు, ముఖ్యంగా హెచ్‌–1బీ వీసాల కోసం భారత్‌ నుంచి అత్యధిక డిమాండ్‌ ఉంది. గోల్డ్‌ కార్డ్‌ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. 

అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్‌కార్డ్‌లోకి మారవచ్చని ఇమిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డ్‌ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుందని పేర్కొంటున్నారు. 

ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్‌–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 

100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్‌ వీసాలు 
ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్‌ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఇండెక్స్‌ పేర్కొనడం గమనార్హం. 

మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్‌ టాప్‌–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్‌ బాబూడా, నౌరూ, సెయింట్‌ కిట్స్‌ ఉన్నాయి. 

తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్‌ హెవెన్స్‌) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్‌ రెసిడెన్స్‌ ప్రోగ్రామ్‌ ఇండెక్స్‌ జాబితాలో గ్రీస్‌ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్‌ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్‌ వీసా రెసిడెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫర్‌ చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement