Engineering sector
-
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో క్షీణత
కోల్‌కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది. ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000 -
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
కాలుష్యరహిత ఉత్పత్తులను కనిపెట్టాలి
దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అంతర్జాతీయ సాంకేతిక సదస్సులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి ఆలోచనా ధోరణి కలగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేవరకద్ర మండలంలోని స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సాంకేతిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాలలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఉత్పత్తులతో ప్రకృతికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే కన్నుతో కెమెరా, చాపతో పడవ, పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టినట్లు చెప్పారు. సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నా రు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు విద్యనభ్యసిం చాలన్నారు. అలాంటి మార్పులలోని కీలకాంశాలను విద్యార్థుల వద్ద బోధకులు ప్రస్తావించడం వల్ల అవి వారిలో నూతనమైన ఆలోచనలను రేకెత్తించడానికి వీలుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి కాలుష్యరహిత ఉత్పత్తులను కనుగొనడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయత్నించాలన్నారు. అలాగే మానవాళికి సమకూర్చే విధంగా వైద్య, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకోవడానికి కావలసిన పరికరాలను కనుగొనే మేధస్సును అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు వెళితే విద్యార్థులకు తప్పక విజయం వరిస్తుందన్నారు. జోర్డాన్ అల్బల్కా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అదనన్ అల్రాబీయా, సింగరేణి బొగ్గు గనుల ఎస్ఈ డాక్టర్ ఉజ్వల్ కుమార్ బెహరా, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎంవీ రమణారావు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్కుమార్రే మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు నిరాశకు గురికావద్దన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న పలు మార్పులను తెలియజేయడంతో పా టు పరిశోధనాపరంగా జరుగుతున్న ఉన్నతిని విద్యార్థులు పరస్పరం అవగాహన పరుచుకోవడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సుల వల్ల వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు పర్యటించి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేయడానికి వీలుంటుందన్నారు. ప్రస్తుత తరుణంలో భారతదేశానికి సాంకేతిక విద్యను పెం పొందించడం ఎంతో అవసరని చెప్పారు. ఇప్పటి ఆర్థికవ్యవస్థను పటిష్ట పరచాలంటే పారిశ్రామిక రంగాన్ని, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేపర్ ప్రజంటేషన్ సీడీని ఆవిష్కరించారు. మొదటిసారిగా కళాశాలకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోయంబత్తూర్ హిందూస్తాన్ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ ఏవీ సెంథిల్‌కుమార్, స్విట్స్ ప్రిన్సిపల్ జి.తిరుపతిరెడ్డి, కళాశాల అధ్యక్షుడు కె.సంపత్‌కుమార్, ఉపాధ్యక్షుడు పి,శ్రీరామ్‌రెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి నర్సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.