లోహాల్లో పగుళ్లను సూక్ష్మస్థాయిలో పరిశోధించేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన స్పెషలైజ్డ్ ట్రాన్స్‌మిషన్ ఎల్రక్టాన్ మైక్రోస్కోప్ టెక్నిక్ ద్వారా లిథియం ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న సాండియా నేషనల్ లే»ొరేటరీస్ పరిశోధకుడు ర్యాన్ షోల్
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు.
దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు.
‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు...
నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు.
ఆ అద్భుతం జరిగిందిలా...
ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే...
► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం.
► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది!
► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు!
► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు.
► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.
అచ్చం అతను సూత్రీకరించినట్టే...
ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు.
అద్భుతమే, కాకపోతే...
జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు.
కొసమెరుపు
ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం.
లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’
– బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment