Discover
-
రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్ని చూసి అబ్బురపడ్డారు. అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్‌గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్‌గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. ఇక ఈ కంప్యూటర్ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్నిర్మించిన ఈ త్రీడీ మోడల్ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
ఇంటికి మరమ్మతు చేస్తుండగా.. బాత్ టబ్ కింద ‘మరో ప్రపంచం’
ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడో లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ వస్తువులతో మనకు ఆనాడు ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇటువంటి ఘటనే ఒక జంటకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌కు చెందిన హేలీ గిల్మార్టిన్, ఆమె భర్త ట్రెవర్లు లేక్ హురాన్ సమీపంలో ఉంటున్నారు. వారు తమ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఇంటిలోని ఒక బాత్ టబ్‌ను తొలగించాలని భావించారు. పనివారి చేత వారు ఆ బాత్ టబ్‌ను తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు.ఆ బాత్‌టబ్ కింద కొంతవరకూ నీటితో నిండిన ఒక గది కనిపించింది. ఇది వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ భార్యాభర్తలు సాహసం చేసి, ఆ గదిలోనికి ఎలాగోలా వెళ్లారు. నీటితో నిండిన ఆ గదిలో ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లారు. అది ఒక సరస్సుకు దారి తీసున్నదని తెలిసి వారు అవాక్కయ్యారు. దీనిని పూర్వకాలంలో స్మగ్లింగ్‌కు వినియోగించేవారేమోనని వారు భావిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలాంటి సొరంగాలు ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా ఆ జంట ఆ బాత్ టబ్‌ను తొలగించి, ఆ ప్లేస్‌ను గేమ్ రూమ్‌గా మార్చాలనుకున్నారట. -
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి?
కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్‌లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!. దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఎంతో సాయం చేస్తోంది. ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్డార్విన్ ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది. కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది. మానవ పిండం తొలి దశలో తోకలా ఉండి ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్‌టీ అనే కామన్ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్గా పేర్కొన్నారు. ఈ టీబీఎక్స్టీని జన్యుమ్యుటేషన్ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్‌ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్‌లో బయటపడింది. అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్‌లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్-కోవ్-2, కోవిడ్-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్‌లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్‌లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్‌కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ -
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!
బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్ఎక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్వుడ్ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు. పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్ తెలిపారు. ఇది కూడా చదవండి: టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం! -
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం
న్యూయార్క్: పురావస్తు శాస్త్రవేత్తలు జార్జియాలో 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతాన్ని కనుగొన్నారు. టిబిలిసికి నైరుతి దిశలో సుమారు 100 కి.మీ దూరంలో ఒరోజ్‌మని గ్రామం వద్ద జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. ఈ దంతాన్ని ఒక విద్యార్థి గుర్తించాడు. ఒరోజ్‌మని గ్రామం దమనిసికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో 1.8 మిలియన్ ఏళ్ల క్రితం మానవ పుర్రెలను 1990ల చివరిలోనూ, 2000ల ప్రారంభంలో కనుగ్నొన్నారు. ఈ సందర్భంగా జార్జియన్ నేషనల్ మ్యూజియంలోని పురావస్తు శాస్త్రవేత్త జార్జి కోపలియాని మాట్లాడుతూ....ఆ విద్యార్థి తవ్వకాలు జరపడానికి మ్యూజియం నుంచి వచ్చిన బృందానికి నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ఆ సమయంలోనే పురాతన దంతాన్ని కనుగ్నొట్లు పేర్కొన్నారు. తాము ఈ దంతం విషయమై పాలియోంటాలజిస్ట్ని సంప్రదించామని, అతను కూడా దీన్ని 'హోమిన్ టూత్గా' నిర్ధారించాడని చెప్పారు. 2019 నుంచి తమ బృందం మళ్లీ ఒరోజ్‌మని వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించిదని జార్జికోపలియాన్ చెప్పారు. కానీ కోవిడ్-19 కారణంగా ఆ తవ్వకాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. తమ బృందం గతేడాది నుంచి ఈ తవ్వకాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది. అప్పటి నుంచి తమ బృందం చరిత్ర పూర్వంకు ముందు రాతి పనిముట్లు, అంతరించిపోయిన జాతుల అవశేషాలను కనుగొందని వెల్లడించారు. అంతేకాదు ఈ దంతం ఆధారంగా ఈ ప్రాంతంలో సంచరించే హోమినిన్ల జనాభా గురించి అధ్యయనం చేయగలగడమే కాకుండా తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. (చదవండి: వింత ఘటన ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఆకృతి) -
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
ప్రాణవాయువుతో పనిలేని జీవి
భూమి మీద జీవించే ప్రతి జీవికి ప్రాణవాయువు అవసరం. అదే లేకుంటే ఏ జీవి ప్రాణాలతో జీవించలేదు. కానీ, ఓ జీవి మాత్రం ఆక్సిజన్ లేకుండానే జీవించగలదు. పేరు ‘హెన్నెగుయా సాల్మినికోలా’. ఇదొక టాడ్‌పోల్ లాంటి పరాన్నజీవి. అంటే నీటిలో జీవించే ఓ అక్వాటిక్ లార్వా. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించినపుడు ఈ పరాన్నజీవికి మైటోకాండ్రియల్ జన్యువులు లేనట్లు గుర్తించారు. ఈ జన్యువు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో, ఈ పరాన్నజీవికి ఆక్సిజన్ అవసరం ఉండదు. అమీబా, శిలీంధ్రాలు వంటి ఏకకణ జీవులు కూడా వాయురహిత వాతావరణంలో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికి, వాటికి కొంతైనా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కానీ, వీటికి ఆ కొంత ఆక్సిజన్ కూడా అవసరంలేదట. అయితే, మరి దేనిని ఉపయోగించి ఈ పరాన్నజీవి శక్తిని ఉత్పత్తి చేస్తోందో ఇంకా కనుగొనలేదు. త్వరలోనే గుర్తిస్తామని పరిశోధకులు చెప్తున్నారు. ఏదిఏమైనా.. ప్రాణవాయువు లేకుండా ప్రాణాలతో జీవించగల జీవి ఇప్పటి వరకు ఇది ఒక్కటే! (క్లిక్: సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!) -
కొత్త మొక్కను కనుగొన్న ఎస్వీయూ శాస్త్రవేత్తలు
యూనివర్సిటీ క్యాంపస్(చిత్తూరు జిల్లా) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, యుగంధర్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కేటగిరీ–ఈ శాస్త్రవేత్త డాక్టర్ లాల్జీ సింగ్ ‘క్రోటాలేరియా లామెల్లిఫారి్మస్’ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాస కోన, పూడి ప్రాంతాల్లో ఈ మొక్కను గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలల్లో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తేలింది. శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ మొక్క గడ్డిలో కలిసిపోయి పగటి పూట సరిగా కనిపించదన్నారు. 10 సెం.మీ ఎత్తు పెరుగుతుందని తెలిపారు. పుత్తూరు సమీపంలోని దుర్గం ప్రాంతంలోనూ ఈ మొక్కలున్నట్టు తాజాగా గుర్తించామన్నారు. దీని ఇతర లక్షణాలపై భవిష్యత్ పరిశోధనలు చేస్తామని శివరామకృష్ణ, యుగంధర్ తెలిపారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
బజాజ్‌కు ‘డిస్కవర్’ జోష్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటోకు ఈ ఏడాది ‘డిస్కవర్’ బ్రాండ్ పూర్తిస్థాయి జోష్ ఇస్తోంది. ప్రీమియం ఎగ్జిక్యూటివ్ విభాగంలో కొత్త ఫీచర్లతో డిస్కవర్ 110, డిస్కవర్ 125 మోడళ్లను కంపెనీ నూతనంగా ఆవిష్కరించింది. వీటి రాకతో ఈ ఏడాది మోటార్ సైకిల్స్ రంగంలో బజాజ్ వాటా ప్రస్తుతమున్న 18% నుంచి 25 %కి చేరుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రీమియం బైక్స్‌లో ఉండే డబుల్ ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లను వీటికి జోడించినట్లు కంపెనీ బైక్స్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. డిస్కవర్ శ్రేణి బైక్‌లు నెలకు 10,000 విక్రయిస్తున్నామని, నూతన మోడళ్లతో ఇది 70,000–80,000 స్థాయికి చేరుతుందని చెప్పారాయన. డిస్కవర్ 110, 125 మోడళ్లను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా సౌత్ హెడ్ అశ్విన్ జైకాంత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హెడ్ హనుమంత్ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బైక్ కోసమైతే వెచ్చిస్తారు...: దేశంలో బైక్ కోసం ఖర్చుకు కస్టమర్లు వెనుకాడరని ఎరిక్ వాస్ అన్నారు. ‘‘భారత్‌లో ప్రీమియం స్కూటర్లంటూ ఏవీ లేవు. బైక్‌లకైతే లక్షలు వెచ్చిస్తారు. అదే స్కూటర్‌కు ఒక లక్ష ఖర్చు చేసేందుకైనా ఆలోచిస్తారు. మహిళలు సైతం ఇపుడు ప్రీమియం బైక్‌లపై దూసుకెళ్తున్నారు. పలు నగరాల్లో బైక్ క్లబ్‌లలో యాక్టివ్‌గా ఉన్నారు. బైక్‌తో ఎమోషనల్ టచ్ ఉంటుంది. నడపడంలో సౌలభ్యం ఉన్నా స్కూటర్‌పై దూర ప్రయాణాలు చేయలేం. కొన్ని పరిమితులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌లదే హవా’’ అని వాస్ వివరించారు. బజాజ్ దేశీయంగా నెలకు 1.8 లక్షల బెక్‌లను విక్రయిస్తోంది. ఇదే స్థాయిలో 50 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కాగా, ఈ ఏడాది డామినార్, అవెంజర్, పల్సర్, ‘వి’ శ్రేణిలో నూతన వేరియంట్లను కంపెనీ ఆవిష్కరించింది. -
ప్లాస్టిక్‌ను తినేసే బాక్టీరియా గుర్తింపు!
వాషింగ్టన్: పాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడం తలకుమించిన భారంగా పరిణమించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు తీపికబురు అందించారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధన బృందం ఇడియోనెల్లా సాకైన్సిస్ అనే బాక్టీరియాను కనుగొన్నారు. కేవలం రెండు ఎంజైమ్‌ల సహాయంతో ఈ బాక్టీరియా పాలీఇథిలిన్ టెరిప్తలేట్(పీఈటీ)ను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని వారు గుర్తించారు. పీఈటీని బాటిల్స్, వస్త్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక్క 2013లోనే ప్రపంచవ్యాప్తంగా 56 మిలియన్ టన్నుల పీఈటీ ఉత్పత్తి జరిగిందంటే పర్యావరణానికి ఇదెంత హానికారో తెలుస్తుంది. ఈ బ్యాక్టీరియా గుర్తింపుతో ప్లాస్టిక్‌ను నిర్వీర్యం చేసే సూక్ష్మ జీవులను గుర్తించడం కోసం ఐదేళ్లుగా చేస్తున్న కృషి విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే శిలింద్రాలను గతంలోనే పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ తరహా బాక్టీరియాను గుర్తించడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారని సైన్స్ జర్నల్‌లో వెల్లడించారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ బాక్టీరియా సమర్థవంతంగా పీఈపీని నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తిచారు. ప్లాస్టిక్ డీకంపోజింగ్ ఎంజైమ్‌ల తయారీ కోసం ఇడియోనెల్లా సాకైన్సిస్ డీఎన్ఏపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. -
నీలిరంగు సోయగం
వాషింగ్టన్: నింగిలోని నీలిరంగు అందంతో.. చిత్రంగా మెరిసిపోతున్న మేఘమాలతో.. గోధుమ వర్ణపు ఎడారుల సొబగులతో కళ్లు జిగేలుమనిపిస్తున్న భూమాత సోయగమిది. ‘డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ (డిస్కవర్)’ ఉపగ్రహానికి అమర్చిన కెమెరాతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ చిత్రరాజాన్ని చిత్రించింది. భూమిపై వెలుతురు ఉండగా ఒకవైపు అర్ధభాగం మొత్తాన్ని తీసిన మొట్టమొదటి చిత్రం ఇదేకావడం విశేషం. ఈ నెల 6వ తేదీన భూమికి 16లక్షల కిలోమీటర్ల దూరం నుంచి డిస్కవర్ దీన్ని చిత్రించింది. అత్యధిక రెజల్యూషన్‌తో తీసిన ఈ చిత్రంలో సముద్రాలు, ఎడారులు, నదులతో పాటు చిత్రమైన ఆకృతుల్లో మేఘాలు కనువిందు చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ‘‘మనకున్నది ఒకే భూమి. దానిని మనం రక్షించుకోవాలని ఈ చిత్రం గుర్తుచేస్తోంది..’’ అని ట్విటర్లో ట్వీట్ చేశారు.