బజాజ్‌కు ‘డిస్కవర్‌’ జోష్‌! | 2018 Bajaj Discover 110 and 125 launched | Sakshi
Sakshi News home page

బజాజ్‌కు ‘డిస్కవర్‌’ జోష్‌!

Published Sat, Jan 13 2018 1:23 AM | Last Updated on Sat, Jan 13 2018 1:23 AM

2018 Bajaj Discover 110 and 125 launched - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటోకు ఈ ఏడాది ‘డిస్కవర్‌’ బ్రాండ్‌ పూర్తిస్థాయి జోష్‌ ఇస్తోంది. ప్రీమియం ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో కొత్త ఫీచర్లతో డిస్కవర్‌ 110, డిస్కవర్‌ 125 మోడళ్లను కంపెనీ నూతనంగా ఆవిష్కరించింది. వీటి రాకతో ఈ ఏడాది మోటార్‌ సైకిల్స్‌ రంగంలో బజాజ్‌ వాటా ప్రస్తుతమున్న 18% నుంచి 25 %కి చేరుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రీమియం బైక్స్‌లో ఉండే డబుల్‌ ఎల్‌ఈడీ డే రన్నింగ్‌ లైట్స్, డిజిటల్‌ స్పీడోమీటర్‌ వంటి ఫీచర్లను వీటికి జోడించినట్లు కంపెనీ బైక్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ ఎరిక్‌ వాస్‌ తెలిపారు. డిస్కవర్‌ శ్రేణి బైక్‌లు నెలకు 10,000 విక్రయిస్తున్నామని, నూతన మోడళ్లతో ఇది 70,000–80,000 స్థాయికి చేరుతుందని చెప్పారాయన. డిస్కవర్‌ 110, 125 మోడళ్లను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా సౌత్‌ హెడ్‌ అశ్విన్‌ జైకాంత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హెడ్‌ హనుమంత్‌ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

బైక్‌ కోసమైతే వెచ్చిస్తారు...: దేశంలో బైక్‌ కోసం ఖర్చుకు కస్టమర్లు వెనుకాడరని ఎరిక్‌ వాస్‌ అన్నారు. ‘‘భారత్‌లో ప్రీమియం స్కూటర్లంటూ ఏవీ లేవు. బైక్‌లకైతే లక్షలు వెచ్చిస్తారు. అదే స్కూటర్‌కు ఒక లక్ష ఖర్చు చేసేందుకైనా ఆలోచిస్తారు. మహిళలు సైతం ఇపుడు ప్రీమియం బైక్‌లపై దూసుకెళ్తున్నారు. పలు నగరాల్లో బైక్‌ క్లబ్‌లలో యాక్టివ్‌గా ఉన్నారు. బైక్‌తో ఎమోషనల్‌ టచ్‌ ఉంటుంది.

నడపడంలో సౌలభ్యం ఉన్నా స్కూటర్‌పై దూర ప్రయాణాలు చేయలేం. కొన్ని పరిమితులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌లదే హవా’’ అని వాస్‌ వివరించారు. బజాజ్‌   దేశీయంగా నెలకు 1.8 లక్షల బెక్‌లను విక్రయిస్తోంది. ఇదే స్థాయిలో 50 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కాగా, ఈ ఏడాది డామినార్, అవెంజర్, పల్సర్, ‘వి’ శ్రేణిలో నూతన వేరియంట్లను కంపెనీ ఆవిష్కరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement