ఓలాకు బజాజ్‌ గట్టి దెబ్బ | Bajaj Auto Beats Ola Electric Becomes India's No 1 Electric Two Wheeler Brand | Sakshi
Sakshi News home page

విర్రవీగిన ఓలాను అలా.. దెబ్బకొట్టిన బజాజ్‌

Published Thu, Jan 2 2025 5:00 PM | Last Updated on Thu, Jan 2 2025 5:54 PM

Bajaj Auto Beats Ola Electric Becomes India's No 1 Electric Two Wheeler Brand

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్‌గా అవతరించింది. వాహన్ పోర్టల్‌లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.

మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్‌లో కంపెనీ మార్కెట్‌ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్‌ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్‌గా తన స్థానాన్ని నిలుపుకొం​ది.

బజాజ్ విజయానికి కారణాలు
బజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్‌లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్‌ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం  ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.

తీవ్ర పోటీ
ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్‌లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్‌ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్‌లను అందించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఐ-క్యూబ్‌ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్‌లెట్‌లతో సహా దాదాపు 4,000 స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్‌ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్‌లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.

ఓలాకు సవాళ్లు
ఒకప్పుడు ఈవీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్‌1 (Ola S1) స్కూటర్  స్వాపింగ్‌ బ్యాటరీ వెర్షన్‌ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్‌వర్క్‌ను 800 నుండి 4,000 స్టోర్‌లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement