![Bajaj Auto to ride into e rickshaw segment by end of ongoing fiscal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/bajaj.jpg.webp?itok=tbLP2UaO)
బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (మార్చి) ఈ–రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ విభాగంలో గణనీయమైన వాటాపై దృష్టి సారించింది. ప్రస్తుత త్రైమాసికం చివరికి అనుమతులు రావచ్చని, నెలవారీ రూ.45,000 యూనిట్ల విక్రయ అంచనాతో ఉన్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.
‘‘ఆధునిక ‘ఈ–రిక్’ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ విభాగంలో ఇది కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అటు యజమానులు, ఇటు ప్రయాణికులకు సంతోషాన్నిచ్చే విధంగా ఉత్పత్తి ఉంటుంది’’అని రాకేశ్ శర్మ వివరించారు. ఆటో విభాగం స్థాయిలోనే ఈ–రిక్ విభాగం కూడాఉంటుందని చెప్పారు.
కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ గురించి మాట్లాడుతూ.. బజాజ్ ఆటో కొత్తగా ప్రవేశపెట్టిన అధిక రేంజ్, అధునాతన డిస్‌ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, అత్యుత్తమ బూట్ స్పేస్ అందించే బజాజ్ చేతక్ 35 సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు రాకేశ్ శర్మ పేర్కొన్నారు.
"ఇప్పటికే ప్రవేశపెట్టిన రెండు వేరియంట్‌లు ఈ ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా కోసం బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త సిరీస్ కూడా దిగువ శ్రేణిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది" అని రాకేశ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment