ముంబై: చాలా వరకు స్టార్టప్‌లది ఆరంభ శూరత్వమేనని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్‌ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్‌ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.
ఓ టీవీ చానెల్ నిర్వహించిన గ్లోబల్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్‌స్టార్ట్‌లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్‌కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్‌షిప్‌ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్‌లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్‌ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.
ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్‌లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్‌లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్ బజాజ్ ఈ విధంగా బదులిచ్చారు. బైక్‌లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment