అమెరికాలోని 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం
2050కల్లా అనూహ్యస్థాయిలో పెరగనున్న సముద్ర మట్టాలు
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది.
ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది.
ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు.
మరిన్ని వరదలు
2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది.
గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది.
అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు.
ముంపు అవకాశమున్న 32 నగరాలు
బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్‌విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్‌మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment