విచిత్రమైన పరిశోధనలో వెల్లడైన వింత విషయాలు
బాధలో ఉన్నప్పుడు అచ్చులతో కూడిన శబ్దాలొస్తాయని తేల్చిన పరిశోధకులు
హాంకాంగ్: పల్లెటూరు మైదానం ఆటలాడేటప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే పిల్లలైనా, పెద్దలైనా ఒకేలా ‘అబ్బా’అనో, ‘ఆ’అనో అరుస్తారు. ఇది తెలుగుభాషలో వచ్చే అక్షరాలేకదా అని అనకండి.
ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోని అక్షరాలను గమనిస్తే మనిషి బాధపడినప్పుడు అసంకల్పితంగా వెలువడే చిట్టిచిట్టి పదాలు, శబ్దాల్లో తొలి అక్షరంగా ఎక్కువగా అచ్చులు ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇంగ్లిష్ను చక్కగా నోరంతా తెరిచి పలికితే చలిదేశాల్లో అదే ఇంగ్లిష్ను సగం నోరు తెరిచి లోపల గొణుకుతున్నట్లు పలుకుతారు.
ఒక్క భాషనే భిన్నంగా పలికే ప్రపంచంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు.. హఠాత్తుగా బాధపడినప్పుడు మాత్రం ఆయా భాషల అచ్చులను మాత్రమే అధికంగా పలకడం చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు.
ఏదైనా భాషలో ఒక పదం ఏమిటో తెలియాలంటే దాని అర్థం తెలిసి ఉండాలి. కానీ ఆశ్చర్యార్థకాలు, కొన్ని పదాలకు అర్థాలతో పనిలేదు. వాటిని వినగానే అవి బాధలో ఉన్నప్పుడు పలికారో సంతోషంతో పలికారో తెలుస్తుంది. బాధలో పలికే పదాల్లో ఎక్కువ అచ్చులు ఉండగా హఠాత్తుగా ఆదుర్తా, సంతోషం కల్గినప్పుడు పలికే పదాల్లో హల్లులు ఎక్కువగా ఉంటున్నాయి. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
131 భాషలను ఒడబోసి
బాధ, సంతోషం, అసహనం, ఆదుర్దా ఇలా హఠాత్తుగా ఏదైనా భిన్న పరిస్థితిని మనిషి ఎదుర్కొన్నపుడు భాషతో సంబంధం లేకుండా రెప్పపాటులో మనిషి గొంతు నుంచి వచ్చే శబ్దాల్లో ఎక్కువగా హల్లులు ఉంటున్నాయా లేదంటే అచ్చులు ఉంటున్నాయా అనేది కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనకారుల బృందం బయల్దేరింది.
ఆఫ్రికా, ఆసియా, ఆ్రస్టేలియా, యూరప్‌లలో అత్యధికంగా మాట్లాడే 131 భాషల్లో జనం బాధపడినప్పుడు, అసహనంగా ఫీల్ అయినప్పుడు, సంతోషపడినప్పుడు అత్యధికంగా వాడే 500కుపైగా ఆశ్చర్యార్థకాలు, పదాలను పరిశోధకులు అధ్యయనం కోసం ఎంపిక చేశారు.
వీటిల్లో సంతోషం, బాధ, ఆదుర్దా ఇలా మూడు భాగాలుగా విడగొట్టి వాటిల్లో ఏ భావానికి ఏ పదం వాడారో, ఆ పదం అచ్చుతో మొదలైందో, హల్లుతో మొదలైందో లెక్కగట్టారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలకు లోనైతే ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఎక్కువగా ఔచ్, వావ్ అనే పదాలనే ఎక్కువగా పలుకుతున్నారు. ఇలా అన్ని ఆశ్చర్యార్థకాలను పట్టికగా వేశారు.
ఏం తేలింది?
భాషతో సంబంధం లేకుండా జనమంతా బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా పలికిన శబ్దాల్లో ఎక్కువగా అచ్చులే ఉన్నాయి. భాషలు వేరుగా ఉన్నాసరే జనం ఏదైనా ఎమోషన్‌కు లోనైనప్పుడు పలికే తొలిపలుకుల ధ్వనులు దాదాపు ఒకేలా ఉంటాయని తేలింది. మానవుడుకాకుండా ఇతర జీవులు.. అంటే పక్షులు, జంతువులు భయపడినప్పుడు, వేదనకు గురైనప్పుడు ఒకేలా శబ్దాలు చేస్తాయనే భావనకు మూలం దాదాపు తెలిసినట్లేనని పరిశోధకులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment