Fractures
-
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
జోషిమఠ్ బాటలో...
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ వయసులో ఎముకలు విరిగితే అంతే..
కాన్బెర్రా : యాభై ఏళ్లు పైబడిన తర్వాత ఎముకలు విరగటం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. 50ల తర్వాత ఎముకలు విరిగిన వారు 10సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని వెల్లడైంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘‘గర్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రేలియా’’ జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగుచూశాయి. వయసు పైబడిన వారిలో.. నడుము ఎముకలు విరగటం వల్ల 10సంవత్సరాలు, శరీరంలోని మిగిలిన ఎముకలు విరగటం ద్వారా 5సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. 2001లో డెన్మార్క్‌లోని 50ఏళ్లు పైబడిన వారు ఎముకలు విరగటం మూలంగా పది సంవత్సరాలు తొందరగా చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదం మగవారిలో 33శాతం ఉంటుందని, ఆడవారిలో 20 ఉంటుందని వెల్లడించింది. పరిశోధకుడు జాక్వెలిన్ సెంటర్ మాట్లాడుతూ.. ఎముకలు విరగటం అన్నది ఆరోగ్య సమస్యలు రావటానికి ప్రధాన కారణమని, నయం కావటానికి ఎక్కువ సమయం పట్టటమే కాకుండా తొందరగా మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఎముకలు విరగటానికి గల కారణాలను అన్వేషించి దానికి అనుగుణంగా చికిత్స చేసే విధానాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు. -
వయసు 61.. ఫ్రాక్చర్లు 34!
మెట్ల మీద నుంచి దిగుతూ ఇటీవల కమల్‌హాసన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. లెక్కల్లో చెప్పాలంటే ఇది 34వ ఫ్రాక్చర్. కమల్ వయసు 61. సో.. ఆయనకైన గాయాల లెక్క వయసులో సగానికి పైనే. ఎక్కువగా షూటింగుల్లోనే కమల్ ప్రమాదాల బారిన పడ్డారు. దాదాపు 20 ఏళ్ల క్రితం అయిన ఫ్రాక్చర్‌తో పోల్చితే ఇప్పుడైన ఫ్రాక్చర్ చాలా చిన్నదట. అప్పట్లో ‘కలైజ్ఞన్’ అనే సినిమా కోసం యాక్షన్ తీస్తున్నప్పుడు కమల్‌కి పెద్ద ప్రమాదమే జరిగింది. వేగంగా కారు ఢీ కొనడంతో పైకి ఎగిరి, ఆ కారు మీద పడి, ఆ తర్వాత కిందపడ్డారట కమల్. దవడ ఎముక స్థానం మారడంతో పాటు, ముక్కుకి గాయం అయింది. అలాగే మూడు ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి. వెన్నెముకకు బలంగా దెబ్బ తగలింది. దాంతో ఇక జీవితంలో నడవలేనని కమల్ అనుకున్నారట. అదృష్టవశాత్తు అలా జరగలేదు. హిందీ చిత్రం ‘ముంబయ్ ఎక్స్‌ప్రెస్’ అప్పుడు జరిగినది కూడా పెద్ద ప్రమాదమే. ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని కూర్చోబెట్టుకుని మోటార్ సైకిల్ నడిపే సీన్ తీస్తున్నప్పుడు హఠాత్తుగా వాహనం తలకిందులైందట. ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఏం కాకూడదనుకుని బండి భారాన్ని మోయడంతో పాటు, ఆ చిన్నారిని సేఫ్‌గా పట్టుకున్నారట కమల్. అప్పుడు కూడా కమల్‌కి బాగా దెబ్బలు తగిలాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ చేసిన రిస్కులు చాలానే ఉన్నాయి. ఆయన ఇలా రిస్కులు తీసుకోవడానికి ఓ కారణం హాలీవుడ్ నటుడు స్టీవ్ మెక్ క్వీన్. ‘‘మనకు మంచి దేహ దారుఢ్యం ఉన్నప్పుడు డూప్ ఎందుకు? ఏ రిస్క్ అయినా మనమే చేయాలి’’ అన్నది స్టీవ్ పాలసీ. దాన్నే ఫాలో అవుతున్నానని కమల్ పేర్కొన్నారు. ‘‘విజయాలు, ప్రమాదాలు నాకు కొత్త కాదు. ఇప్పుడు జారి పడిన సంఘటనను తేలికగా తీసుకుంటున్నా. నా చుట్టూ మంచి వైద్యులు ఉన్నారు. వాళ్ల సహాయం, నా చిన్ని కుటుంబం ప్రేమ, అభిమానుల మమకారం వల్ల త్వరగానే కోలుకుంటా’’ అని కమల్ తెలిపారు. -
కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే పక్షవాతం వస్తుందా..?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేయించారు. దాంతో ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు. లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా? - సుధాకర్, శ్రీకాళహస్తి ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే... ఎముకలు సరైన పొజిషన్లో ఉండి మానడానికి మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని మనం వీలైనంత త్వరగా తమ నార్మల్ దినచర్యలు చేపట్టాలని. నాటువైద్యం జరిగినా, నకిలీవైద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్ నార్మల్ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకుపోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటు వైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయంచి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది. కౌన్సెలింగ్ ఫర్ అడాలసెంట్ గాళ్స్ ప్రాబ్లమ్స్ నా కూతురి వయసు 16 ఏళ్లు. ఆమెకు ముఖమంతా వెంట్రుకలు ఉన్నాయి. అంతేకాదు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. ఈ అవాంఛిత రోమాలు, మొటిమల వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. తన గురించి నాకు బెంగగా ఉంది. మాకు సరైన సలహా ఇవ్వండి. - మహేశ్వరి, బెంగళూరు మీరు చెప్పిన అంశాలు మీ అమ్మాయి లాంటి కౌమార ప్రాయంలో ఉన్నవారికి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అన్న అంశాన్ని ముందుగా చూడాలి. తర్వాత ఆమె బరువుపెరుగుతోందా, స్వరంలో మార్పులు వస్తున్నాయా, మాడు మీద జుట్టు రాలుతోందా అన్న అంశాలనూ చూడాలి. ఇవన్నీ వెంటనే జరగాల్సిన పనులు. వీటితో పాటు మీ కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉండా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆమె ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాల తీవ్రతనూ, అవి వచ్చిన వ్యవధిని బట్టి ఆమె పరిస్థితిని అంచనా వేయవచ్చు. సాధారణంగా టీనేజర్లలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారిలో సాధారణంగా మొటిమలు వస్తుంటాయి. అయితే చాలా అరుదుగా కనిపించే ఓవరిస్లో నీటి తిత్తులు, అడ్రినల్ గ్రంథుల సమస్యలు కూడా మీరు చెప్పే లక్షణాలను కనబరచవచ్చు. అందుకే మీ అమ్మాయి సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తపరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయించాలి. కొన్ని సందర్భాల్లో కేవలం జీవనశైలి మార్పులు, కౌన్సెలింగ్ వంటి చాలా మామూలు అంశాలతోనే పరిస్థితిని చక్కబరచవచ్చు. కొందరిలో వాక్సింగ్, బ్లీచింగ్ వంటి సాధారణ కాస్మటిక్ చికిత్సలే సరిపోతాయి. ఎలక్ట్రోలైసిస్, లేజర్స్ థెరపీతో కూడా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి హార్మోనల్ చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అమ్మాయికి సాధారణ కౌన్సెలింగే సరిపోతోంది. సరైన పరీక్షలతో అవసరమైన చికిత్సతో పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. మూడేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. ప్రస్తుతం నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతకాలం పాటు మేము పిల్లలు వద్దనుకున్నాం. దానికోసం నేను గత మూడేళ్లుగా కాంట్రసెప్టివ్ పిల్స్‌ను వాడుతున్నాను. అయితే నాకు ఇటీవల తలనొప్పి ఎక్కువగా వస్తోంది. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేను ఇటీవల కొన్ని పత్రికల్లో చదివాను. ఈ వార్త చదివినప్పటి నుంచి నాలో ఆందోళన రెట్టింపు అయ్యింది. మా నాన్నగారు కూడా పక్షవాతం కారణంగానే చాలా కాలంగా మంచాన పడ్డారు. దయచేసి దీని గురించి వివరంగా తెలుపగలరు. - మాధవి, వరంగల్ ఎక్కువకాలం కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం అంత మంచిది కాదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా పని ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది మైగ్రేన్, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షవాతం పురుషుల కంటే స్త్రీలలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం, రుతుస్రావం, కుటుంబపరమైన ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడి వంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయి. దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు సుమారు మూడు సంవత్సరాలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నట్లు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నిర్థారించుకోండి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ నాన్నగారికి ఇప్పటికే పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి, విటమిన్ బి12 లోపం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు మధుమేహంగానీ, రక్తపోటు గానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అధిక బరువు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా నడకగానీ, వ్యాయామంగానీ చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి. ఉదయం వేళల్లో కొంత సమయం ఎండలో నడవడానికి ప్రయత్నించండి. సూర్యరశ్మి ద్వారానే డి విటమిన్ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కాపాడుకోవడానికి ప్రయత్నించండి. -
ఆర్థరైటిస్ కౌన్సెలింగ్
ఆర్థరైటిస్ రోగుల వ్యాయామానికి ‘స్మార్ట్’ పద్ధతి! నా వయసు 65 ఏళ్లు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. అయినా వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్లు చెప్పారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ కదా! మరి అలాంటప్పుడు మేం ఎక్సర్సైజ్ చేయడం ఎలాగో సూచించండి. - తాయారమ్మ, తుని ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమ ఎముకలు మరింత కాలం బలంగా ఉండాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే ఇంగ్లిష్ మొదటి అక్షరాలతో రూపొందిన ‘స్మార్ట్’ అనే విధానం పాటిస్తే వారి వ్యాయామ ప్రక్రియ తేలికవుతుంది. సూచనలు గుర్తుంచుకోవడం సులభమవుతుంది. స్మార్ట్లోని ఎస్, ఎమ్, ఏ, ఆర్, టీ... అంటే... ఎస్ అంటే స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమకు అనువైన తేలికపాటి వ్యాయామాన్ని చాలా మెల్లగా ప్రారంభించాలి. ఉదాహరణకు రోజూ 3-5 నిమిషాలపాటు రోజుకు రెండుసార్లు తేలికపాటి వ్యాయామం చేయాలి. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడం సురక్షితం అన్నమాట. ఎమ్ అంటే మాడిఫై యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్, ట్రై టు స్టే యాక్టివ్: ఆర్థరైటిస్ లక్షణాలు అంటే ప్రధానంగా కీళ్లలో నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇలా ఆర్థరైటిస్ లక్షణాలు తీవ్రమైనప్పుడు మన వ్యాయామ కార్యకలాపాలను లక్షణాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అంటే మనం వ్యాయామం చేసే వ్యవధి, ఎన్నిసార్లు, ఎంత తీవ్రంగా చేస్తామనే అంశాలను మార్చుకుంటూ ఉండాలి. ఇలా మార్పు చేసుకోవడం అన్నది లక్షణాలను తీవ్రతరం కాకుండా చూస్తుంది. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: అంటే మనం చేసే వ్యాయామాలు మన కీళ్ల ఆరోగ్యానికి మేలు చేసేవై ఉండాలి. ఉదాహరణకు నడక, సైక్లింగ్, నీళ్లలో చేసే తేలికపాటి వ్యాయామాలు. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల మన కీళ్లపై పడే శరీర బరువు తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్ : ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుగా ఉండటం వల్ల అవి విరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యాయామం చేయడానికి సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీరు మీ లోకల్ పార్క్‌లో నడుస్తుంటే అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ పడిపోయేందుకు అవకాశం ఉండకూడదు. రాత్రివేళ వాకింగ్ చేస్తుంటే తగినంత లైట్ (వెలుగు) ఉండాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : మీరు వ్యాయామాలు ప్రారంభించడానికి ముందుగా మంచి వ్యాయామ నిపుణుడినీ లేదా డాక్టర్‌ను అందునా ప్రత్యేకంగా జీవనశైలి నిపుణులతో మాట్లాడాలి. వారు మీకు అనువైన వ్యాయామ పద్ధతులను సూచిస్తారు. దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారికి అనువైన మార్గాలనూ, ఏదైనా అంగవైకల్యం ఉన్నవారు చేయాల్సిన వ్యాయామ రీతులను వారు సూచిస్తారు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్