ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 44ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేయించారు. దాంతో ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు. లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా?
- సుధాకర్, శ్రీకాళహస్తి
ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే... ఎముకలు సరైన పొజిషన్‌లో ఉండి మానడానికి మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని మనం వీలైనంత త్వరగా తమ నార్మల్ దినచర్యలు చేపట్టాలని.
నాటువైద్యం జరిగినా, నకిలీవైద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్ నార్మల్ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకుపోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటు వైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయంచి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది.
కౌన్సెలింగ్ ఫర్ అడాలసెంట్ గాళ్స్ ప్రాబ్లమ్స్
నా కూతురి వయసు 16 ఏళ్లు. ఆమెకు ముఖమంతా వెంట్రుకలు ఉన్నాయి. అంతేకాదు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. ఈ అవాంఛిత రోమాలు, మొటిమల వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. తన గురించి నాకు బెంగగా ఉంది. మాకు సరైన సలహా ఇవ్వండి.
- మహేశ్వరి, బెంగళూరు
మీరు చెప్పిన అంశాలు మీ అమ్మాయి లాంటి కౌమార ప్రాయంలో ఉన్నవారికి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అన్న అంశాన్ని ముందుగా చూడాలి. తర్వాత ఆమె బరువుపెరుగుతోందా, స్వరంలో మార్పులు వస్తున్నాయా, మాడు మీద జుట్టు రాలుతోందా అన్న అంశాలనూ చూడాలి. ఇవన్నీ వెంటనే జరగాల్సిన పనులు. వీటితో పాటు మీ కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉండా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆమె ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాల తీవ్రతనూ, అవి వచ్చిన వ్యవధిని బట్టి ఆమె పరిస్థితిని అంచనా వేయవచ్చు.
సాధారణంగా టీనేజర్లలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారిలో సాధారణంగా మొటిమలు వస్తుంటాయి. అయితే చాలా అరుదుగా కనిపించే ఓవరిస్‌లో నీటి తిత్తులు, అడ్రినల్ గ్రంథుల సమస్యలు కూడా మీరు చెప్పే లక్షణాలను కనబరచవచ్చు. అందుకే మీ అమ్మాయి సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తపరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయించాలి. కొన్ని సందర్భాల్లో కేవలం జీవనశైలి మార్పులు, కౌన్సెలింగ్ వంటి చాలా మామూలు అంశాలతోనే పరిస్థితిని చక్కబరచవచ్చు. కొందరిలో వాక్సింగ్, బ్లీచింగ్ వంటి సాధారణ కాస్మటిక్ చికిత్సలే సరిపోతాయి. ఎలక్ట్రోలైసిస్, లేజర్స్ థెరపీతో కూడా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి హార్మోనల్ చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అమ్మాయికి సాధారణ కౌన్సెలింగే సరిపోతోంది. సరైన పరీక్షలతో అవసరమైన చికిత్సతో పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 27 ఏళ్లు. మూడేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. ప్రస్తుతం నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతకాలం పాటు మేము పిల్లలు వద్దనుకున్నాం. దానికోసం నేను గత మూడేళ్లుగా కాంట్రసెప్టివ్ పిల్స్‌ను వాడుతున్నాను. అయితే నాకు ఇటీవల తలనొప్పి ఎక్కువగా వస్తోంది. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేను ఇటీవల కొన్ని పత్రికల్లో చదివాను. ఈ వార్త చదివినప్పటి నుంచి నాలో ఆందోళన రెట్టింపు అయ్యింది. మా నాన్నగారు కూడా పక్షవాతం కారణంగానే చాలా కాలంగా మంచాన పడ్డారు. దయచేసి దీని గురించి వివరంగా తెలుపగలరు.
- మాధవి, వరంగల్
ఎక్కువకాలం కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం అంత మంచిది కాదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా పని ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది మైగ్రేన్, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షవాతం పురుషుల కంటే స్త్రీలలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం, రుతుస్రావం, కుటుంబపరమైన ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడి వంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయి. దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు సుమారు మూడు సంవత్సరాలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నట్లు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నిర్థారించుకోండి.
జన్యుపరమైన కారణాల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ నాన్నగారికి ఇప్పటికే పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి, విటమిన్ బి12 లోపం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు మధుమేహంగానీ, రక్తపోటు గానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అధిక బరువు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా నడకగానీ, వ్యాయామంగానీ చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి. ఉదయం వేళల్లో కొంత సమయం ఎండలో నడవడానికి ప్రయత్నించండి. సూర్యరశ్మి ద్వారానే డి విటమిన్ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కాపాడుకోవడానికి ప్రయత్నించండి.
కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే పక్షవాతం వస్తుందా..?
Published Fri, Oct 30 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM
Advertisement
Advertisement