చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్‌ చైల్డ్‌ హీలింగ్‌! | Dr Psycology Vishesh Suggestions On Inner Child Healing | Sakshi
Sakshi News home page

చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్‌ చైల్డ్‌ హీలింగ్‌!

Published Sun, Aug 25 2024 9:31 AM | Last Updated on Sun, Aug 25 2024 9:31 AM

Dr Psycology Vishesh Suggestions On Inner Child Healing

బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్‌ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్‌ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.

ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.

ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్‌ చైల్డ్‌ వర్క్‌ లేదా ఇన్నర్‌ చైల్డ్‌ హీలింగ్‌ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్‌ ఫ్రీడమ్‌తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్‌ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.

ఇన్నర్‌ చైల్డ్‌ను గుర్తించడం
మీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.

ఇన్నర్‌ చైల్డ్‌తో కనెక్ట్‌ అవ్వడం
విజువలైజేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు, డైరీ రాయం, డైలాగ్‌ టెక్నిక్స్‌ ద్వారా మీ ఇన్నర్‌చైల్డ్‌తో కనెక్ట్‌ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా  ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్‌ చైల్డ్‌కు ఒక లేఖ రాయవచ్చు.

ఇన్నర్‌ చైల్డ్‌ హీలింగ్‌ ఇలా...
ఇన్నర్‌ చైల్డ్‌ చెప్పేది వినడం 
మీరు మీ ఇన్నర్‌ చైల్డ్‌తో కనెక్ట్‌ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్‌ చైల్డ్‌ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్‌ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.

హీలింగ్‌ అండ్‌ రీపేరెంటింగ్‌  
మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్‌ చైల్డ్‌ హీలింగ్‌ లక్ష్యం. ‘రీపేరెంటింగ్‌’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్‌ చైల్డ్‌కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్‌ చైల్డ్‌కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.

ఇన్నర్‌ చైల్డ్ని ఇంటిగ్రేట్‌ చేయడం..
మీ ఇన్నర్‌ చైల్డ్‌ను అడల్ట్‌ సెల్ఫ్‌తో ఇంటిగ్రేట్‌ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్‌ చైల్డ్‌  మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్‌ కంపాషన్‌ను, ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. – సైకాలజిస్ట్‌ విశేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement