అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. | A Psychology Story Written By Dr Vishesh On The Identity Formation Of Teenagers | Sakshi
Sakshi News home page

అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..

Published Sun, Sep 29 2024 12:50 AM | Last Updated on Sun, Sep 29 2024 12:50 AM

A Psychology Story Written By Dr Vishesh On The Identity Formation Of Teenagers

టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్‌) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్‌ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్‌–కాన్సెప్ట్‌), స్వీయ గౌరవం (సెల్ఫ్‌–ఎస్టీమ్‌), సామాజిక గుర్తింపు (సోషల్‌ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.

నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్‌మెంటల్‌ సైకాలజిస్ట్‌ ఎరిక్‌ ఎరిక్సన్‌ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.

నేనెవరు?
ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.

ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్‌ కాంపిటీషన్స్‌లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.

నా విలువేంటి? 
ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్‌కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్‌లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్‌ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. 
స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్‌ (2011) పరిశోధనలు తేల్చాయి. 

సామాజిక గుర్తింపు..
వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. 
ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్‌ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్‌ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. 
అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.

తల్లిదండ్రులు చేయాల్సినవి..
– టీన్స్‌లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. 
– భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.
– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. 
– ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.
– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. 
– యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్‌ మోడల్స్‌గా ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement