రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్‌లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్‌ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు.
రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతోందని నిర్ధారణైంది.
కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్‌లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.
ఎలా ఎదుర్కోవాలి?
బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి.
– మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
– ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్‌నెస్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయండి.
– మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి.
– మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి.
– బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి.
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.
పేరెంట్స్ ఏం చేయాలి?
– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.
– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి.
– బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి.
– కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి.
– తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి.
– బుల్లీయింగ్ గురించి టీచర్స్‌తో, స్కూల్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడండి.
– బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్‌గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.
– కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.
ఎందుకు బెదిరిస్తారు?
ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.
ఎందుకు ఆపరు?
బుల్లీయింగ్‌ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్‌లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.
– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com)
Comments
Please login to add a commentAdd a comment