పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్‌మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.
హింసాత్మక ప్రవర్తన..
పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పిల్లల్లో హింసకు కారణాలు..
పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు..
1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.
2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..
3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..
4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..
5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..
6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..
7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..
8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్..
9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..
నిరోధించడమిలా..
హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..
1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.
2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి.
3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి.
4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి.
5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి.
6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.
కోపం సాధారణ భావోద్వేగం..
కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు.
హెచ్చరిక సంకేతాలు..
1. తరచుగా అదుపులేని కోపం
2. సులువుగా నిరాశ చెందడం
3. చాలా సున్నితంగా ఉండటం
4. తరచు చిరాకు పడటం
5. ఇంపల్సివ్‌గా వ్యవహరించడం
6. తరచుగా బెడ్‌ను పాడుచేయడం
సైకాలజిస్ట్ విశేష్
(psy.vishesh@gmail.com)
ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
Comments
Please login to add a commentAdd a comment