psycolagy
-
మజిల్స్ రిలాక్సయితే మనసూ రిలాక్సవుతుంది! ఎలా అంటే..?
ప్రపంచం పరుగెడుతోంది. ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటిని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR). అమెరికన్ వైద్యుడు ఎడ్మండ్ జాకబ్సన్ 1920లో అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఆయన పేరు మీదే దీన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR) అంటున్నారు.శరీరం, మనసు వేర్వేరు కాదని, రెండూ ఒకటిదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయనే ఆలోచనపై ఈ టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సులువైన, శక్తిమంతమైన టెక్నిక్. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. మన శరీరంలోని కండరాల (మజిల్స్)ను నిర్దిష్ట క్రమంలో టెన్షన్ చేయడం, రిలాక్స్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను సాధించడమే జేపీఎమ్మార్ (PMR). ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులున్న వారికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్, పరీక్షలు లేదా మెడికల్ టెస్టుల సమయంలో కలిగే ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.ఎలాంటి అంతరాయం కలగని ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్సింగ్ చైర్ లేదా మంచం మీద పడుకోవాలి.వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. మన కదలికలకు ఇబ్బంది కలిగించే వస్తువులను తీసేయాలి.నిండుగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇది శరీరాన్ని, మనసును విశ్రాంతికి సిద్ధం చేస్తుంది.పాదాల నుంచి తల దాకా ప్రతిభాగంలోని కండరాలను ఐదు నుంచి పది సెకన్ల వరకు వీలైనంత గట్టిగా పట్టి ఉంచాలి. తర్వాత నిదానంగా సడలించాలి.దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా నిండుగా ఊపిరి తీసుకోవాలి. కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి.అన్ని కండరాల సమూహాలను సడలించిన తర్వాత, పూర్తి విశ్రాంతిని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలి. మెల్లగా.. నిండుగా ఊపిరి తీసుకోవడం ద్వారా ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది.కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి, శరీరాన్ని సున్నితంగా కదిలించడం మొదలపెట్టాలి. మైకంగా ఉంటే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.మంచి ఫలితాలు పొందడానికి ఈ ఎక్సర్సైజ్ ను క్రమం తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి.టెన్షన్, రిలాక్సేషన్ సమయాల్లో శరీరం, మనసు ఎలా స్పందిస్తున్నాయో గమనించాలి.అవసరాన్ని బట్టి, సౌకర్యానికి అనుగుణంగా కండరాలకు ఒత్తిడిని, విశ్రాంతినిచ్చే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. JPMR ప్రాక్టీస్ చేయడమిలా..– కాలి వేళ్లను గట్టిగా ముడుచుకుని, ఆపై వాటిని రిలాక్స్ చేయాలి.– కాలి వేళ్లను తల వైపు లాగుతూ కండరాలను బిగించి, తర్వాత నిదానంగా సడలించాలి.– మీ తొడ కండరాలను బిగించి, ఆపై సడలించాలి.– కడుపు కండరాలను బిగించి, నిదానంగా సడలించాలి.– నిండుగా ఊపిరి తీసుకుని.. అలాగే పట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– వీపును కొద్దిగా వంచి, ఆపై నిదానంగా యథాస్థితికి రావాలి.– పిడికిలిని గట్టిగా బిగించి, ఆపై వదలాలి.– మోచేతులను వంచి, కండరాలను బిగించి, ఆ తర్వాత సడలించాలి.– భుజాలను చెవుల వైపు లేపి.. ఆపై వదలాలి.– తలను సున్నితంగా వెనక్కి నొక్కాలి. గడ్డాన్ని ఛాతీ మీదకు లాగాలి. ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– కనుబొమలను పైకి లేపడం ద్వారా నుదిటిని బిగించి, ఆపై వదిలేయాలి.– కళ్లు గట్టిగా మూసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– దవడను బిగించి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– పెదాలను గట్టిగా ఒత్తి పట్టి, ఆపై వదిలేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ఇవి చదవండి: ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో.. -
ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.మెదడులో మార్పులే కారణం... సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.చికిత్స తప్పనిసరి అవసరం..అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్ -
ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో.. మీ ఓవర్ థింకింగ్‌కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్‌ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్‌కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్‌కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్‌లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్‌ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
ప్రమాదం అంచున మనదేశం
మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్ హెల్త్ మంత్’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా క్షేమంగా ఉండటం. బాలెన్స్డ్ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి. దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, క్లినికల్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అపోహలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీరూ, మీ సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంటే, ‘నేను బైపోలార్’ అని కాకుండా ‘నాకు బైపోలార్ డిజార్డర్’ ఉంది అని చెప్పండి. మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి. మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి. మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. మానసిక రుగ్మత లక్షణాలు నిరంతర ప్రతికూల ఆలోచనలు మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏకాగ్రత లోపం ఎనర్జీ లెవెల్స్‌లో తీవ్ర మార్పులు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం ఆత్మహత్యల రాజధానిగా దేశం మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల కొరత దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. - సైకాలజిస్ట్ విశేష్ -
Psychic Day 2021: హిప్నాటిజానికి మూలం ఏమిటో తెలుసా?
మైమరచిపోయేలా చేయడం.. మంత్ర ముగ్ధులను చేయడం.. మెల్లగా వశం చేసుకుని చెప్పినట్టు చేసేలా చేయడం.. ఇదంతా హిప్నాటిజం. మరి ఈనాటి ఈ హిప్నాటిజానికి మూలం ఏమిటో తెలుసా?.. 18వ శతాబ్దం నాటి మెస్మరైజేషన్.. తన అంతరాత్మకు అనంతమైన శక్తి ఉందని.. ఆ ‘సైకిక్ పవర్’తో వ్యాధులన్నీ నయం చేస్తానని జనాన్ని నమ్మించిన ఓ వ్యక్తి లీలలే. అతడు తెలియక చేసినా.. చివరికి అదంతా సైన్స్ అని తేలడం, రెండు కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపడం విశేషం. ఈ ఆదివారం (ఆగస్టు 1) ‘సైకిక్ డే’ సందర్భంగా ఆ కథేంటో తెలుసుకుందామా? అది 1770వ సంవత్సరం.. ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలం.. అనారోగ్యానికి గురైన వారి రక్తాన్ని జలగలతో పీల్పించడం, రోగం తగ్గుతుందంటూ గాయాల నుంచి రక్తం మరింతగా కారిపోయేలా చేయడం జరుగుతున్న కాలం.. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తే భయంతో తిరస్కరిస్తున్న కాలం. మంత్రతంత్రాలను విపరీతంగా నమ్మే ఆ సమయంలో ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఏ రోగాన్నైనా తగ్గించగలనంటూ జనాన్ని ఆకర్షించాడు. ఆయనే ఫ్రాంజ్ ఆంటోన్ మెస్మర్. ఆయన పేరులోని మెస్మర్ నుంచే మెస్మరైజేషన్ అనే పదం పుట్టింది. ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ పేరుతో.. ఆస్ట్రియాకు చెందిన మెస్మర్.. జనాన్ని మాయ చేయడానికి తనదైన ఓ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దానికి ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ అని పేరుపెట్టాడు. భూమితోపాటు సూర్యచంద్రులు, ఇతర గ్రహాల అయస్కాంత, గురుత్వాకర్షణ శక్తులు మనుషుల శరీరంపై ప్రభావం చూపిస్తాయన్నాడు. మన శరీరం ఒక శక్తివంతమైన అయస్కాంతం అని, అందులోని జీవశక్తి ‘మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్’ అని చెప్పాడు. వీటి పనితీరును గ్రహాల శక్తులు దెబ్బతీయడం వల్లే ఏవేవో రోగాలు వస్తాయని ప్రకటించాడు. తనకున్న సైకిక్ శక్తులను ఉపయోగించి కేవలం తన చేతులతో ఏ రోగాన్నైనా తగ్గిస్తానని ప్రచారం చేశాడు.ఈ మాటలు జనంపై విపరీతంగా ప్రభావం చూపాయి. ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాధారణ ప్రజలే కాదు.. ఫ్రాన్స్ మహారాణి మేరీ ఆంటోనెట్టే కూడా మెస్మర్ వైద్యం మాయలో పడ్డారు. ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి.. శారీరక, మానసిక సమస్యలతో బాధపడే చాలా మంది మెస్మర్ ప్రచారాన్ని నమ్మి చికిత్స కోసం వచ్చేవారు.‘గ్రహాల శక్తులు, యానిమల్ మ్యాగ్నెటిజం’ వంటి అంశాలు మానసిక సమస్యలున్న వారిని ఆకర్షించాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, డిప్రెషన్, ఏదో ఒక విషయంగా తీవ్రంగా భయపడటం వంటి ఇబ్బందులు ఉన్నవారు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ► మెస్మర్ వారిలో కొందరికి ఒంటరిగా.. మరికొందరికి గ్రూపులుగా ‘రోగాలు నయం చేసే ప్రక్రియలు’ నిర్వహించేవాడు. పెద్ద బాత్టబ్లలో నీళ్లు నింపిపెట్టి.. అవి అయస్కాంత నీళ్లుగా చెప్తూ వాటిలో కూర్చోబెట్టేవాడు. తన చేతులను వారి ముందు తిప్పుతూ ఏదో శక్తులను ప్రయోగిస్తున్నట్టు చేసేవాడు. ఆ సమయంలో పేషెంట్లు మైమరపు (ట్రాన్స్)లోకి వెళ్లేవారు. తిరిగి లేవగానే తమలో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఉత్సాహపడేవారు. ‘నమ్మకమే చికిత్స’ అని తేలింది అప్పుడే ఓవైపు మెస్మర్‌కు జనంలో విపరీతంగా ఆదరణ పెరగడం, మరోవైపు ఆయన చికిత్స విధానాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టడంతో అప్పటి ఫ్రాన్స్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మెస్మర్ వైద్య ప్రక్రియలు, పద్ధతులపై విచారణ చేయించాలని నిర్ణయించింది. 1784లో ప్రఖ్యాత శాస్త్రవేత్త, రాజకీయ నేత బెంజమిన్ ఫ్రాంక్లిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి బాధ్యత అప్పగించింది. శాస్త్రవేత్తలు ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ అంతా ఉత్త కల్పనే అని తేల్చారు. ► చిత్రమేమిటంటే.. మెస్మర్ దగ్గరికి వెళ్లినవారిలో చాలా మందికి వ్యాధులు తగ్గుముఖం పడుతుండేవి. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి బయటపడేవారు. మరి ఇదెలా సాధ్యమైందన్న దానిపై శాస్త్రవేత్తలు గట్టిగా పరిశోధన చేశారు. అప్పుడే ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అదే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్. ఏమిటీ ‘ప్లాసిబో’ ఎఫెక్ట్ ఏదైనా రోగం/మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి ఏదైనా మందు, చికిత్సతో నయమవుతుందని పూర్తి విశ్వాసం కలిగించగలిగితే.. వారిలో ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. నిజానికి వారికి ఎలాంటి మందు ఇవ్వకున్నా, చికిత్స చేయకున్నా సరే.. ఉత్తుత్తి మందులు, చికిత్సతోనే కొంతవరకు కోలుకుంటారు. బాధితులు తమకు నయమైపోతుందన్న నమ్మకంతో ఆందోళనలను వదిలేసి, ఉత్సాహంగా ఉండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. దీనినే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. కొందరు వైద్యుల దగ్గరికి వెళ్తే తమకు త్వరగా వ్యాధులు తగ్గిపోతాయని జనం నమ్ముతుంటారు. అందరు వైద్యులు ఇచ్చేది దాదాపు ఒకే రకమైన మందులు అయినా కూడా.. వారి దగ్గరికి వెళ్లినవారు త్వరగా కోలుకుంటుంటారు. దీనికి ప్లాసిబో ఎఫెక్ట్ కారణమని చెప్పొచ్చు. హిప్నాటిజానికి బీజం పడింది అప్పుడే.. ► మెస్మర్‌కు శక్తులేమీ లేవని, అదంతా కల్పితమని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఆయన ఫ్రాన్స్ వదిలి వెళ్లిపోయాడు. సాధారణ జీవనం గడిపి.. 1815లో చనిపోయాడు. ఆయన పేరుతో ‘మెస్మరిజం (మాయచేయడం, మంత్రముగ్ధులను చేయడం)’ పదం పుట్టి చిరస్థాయిగా నిలిచిపోయింది. ► మెస్మర్ విధానాలు కల్పితమే అయినా అందులోని నిగూఢమైన సైన్స్ సంగతులు బయటికొచ్చాయి. ప్లాసిబో ఎఫెక్ట్‌ను గుర్తించడానికి, హిప్నాటిజం పుట్టుకకు కారణమయ్యాయి. ► 1841లో ప్రఖ్యాత స్కాటిష్ వైద్యుడు జేమ్స్ బ్రెయిడ్ ‘హిప్నాటిజం’ ప్రక్రియను ప్రతిపాదించాడు. మెస్మర్ ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే.. మనుషుల్లో నమ్మకం కలిగించడం, వారిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి మానసిక సమస్యలకు చికిత్స చేయడం వంటివి హిప్నాటిజం ద్వారా సాధ్యమని చెప్పాడు. మొత్తంగా ఓ మోసగాడి లీలలు.. వైద్యంలో రెండు కీలక ప్రక్రియలకు మూలంగా నిలవడం విశేషం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ కమిటీ ఎంపిక
1 నుంచి విద్యార్థులకు అవగాహన సదస్సులు విజయవాడ(గాంధీనగర్): ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అమరావతి శాఖ నూతన కమిటీ ఎంపికైంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యూష సుబ్బారావు ప్రకటించారు. అమరావతి శాఖ నూతన అధ్యక్షుడుగా బీ రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా జేæ కాశీవిశ్వేశ్వరరావు ఎంపికైనట్లు తెలిపారు, వీరితోపాటు ఉపాధ్యక్షులుగా కే విద్యాసాగర్, డీ అవంతి, కే సుభాష్, సహాయ కార్యదర్శులుగా ఎల్ వెంకటేశ్వర్లు, ఎన్ సతీష్, జీ సురేష్, కోశాధికారిగా ఎస్కే బాబీ, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎంపికచేసినట్లు చెప్పారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి స్ఫూర్తి పేరుతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.