"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!"
అదోరకమైన శాడిజం..
జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి.
- నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు.
- మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు.
- ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు.
బలమైన కోటను నిర్మించుకోవాలి..
పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
- మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి.
- ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు.
- ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి.
- ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి.
- మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్‌లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి.
- ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి.
ట్రోల్స్ 2 రకాలు..
ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్‌లైన్ యుద్ధాలుగా మారవచ్చు.
ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి..
ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం.
- మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు
- వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు.
- చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు.
— సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com)
Comments
Please login to add a commentAdd a comment