65 నుంచి 25కి ఏజ్ రివర్స్ల్ అంటూ ప్రచారం
ఇజ్రాయెల్ నుంచి టైం మెషీన్ పేరుతో ఘరానా మోసం
ఆక్సిజన్ థెరపీ అంటూ వల, రూ. 35కోట్ల స్కాం
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది.
ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు.
అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment