
35 ఏళ్లుగా న్యూరాలజీ విభాగంలో సేవలందిస్తున్న డా. శిరీష్ వలసంగకర్
బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్‌గా ప్రజల్లో ప్రసిద్ధి
ఆత్మహత్యకు ముందు కూడా పేషెంట్లకు వైద్యం
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్‌తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్‌ను రామ్‌వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.
శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పలువురు సంతాపం
డాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్‌లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్‌కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు.
చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి