
మరాఠీలో బదులు ఇంగ్లీషులో మాట్లాడినందుకు మహిళలని కూడా చూడకుండా ఇద్దరిపై కొందరు వ్యక్తులు అమానవీయ దాడికి పాల్పడ్డ సంఘటన డోంబివిలీలోని విష్ణునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల మేరకు..మంగళవారం డోంబివిలీలో ఇద్దరు మహిళలు తొమ్మిదినెలలపాపతో సహా ఓ స్కూటీపై తాము నివసించే హౌసింగ్ సొసైటీ ఆవరణలోకి ప్రవేశిస్తుండగా ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్న యువకుడిని తప్పుకోమంటూ ‘ఎక్స్‌క్యూజ్‌మీ’అని అడిగారు.
దీనికి కోపోద్రిక్తుడైన ఆ యువకుడు అతను మరాఠీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ పైపైకి దూసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా మహిళల్లో ఒకరి చేయిని మెలితిప్పాడు. అదే సమయంలో అతని కుటుంబానికి చెందిన మరికొంతమంది వారిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేవలం ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకే ఇంతలా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని బాధిత మహిళలు వాపోయారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ పవార్ తెలిపారు.