excuses
-
నాకు కోపం వచ్చిందటే క్షమించరాని తప్పు చేసారని అర్థం అందుకే...
-
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
పెళ్లికి యువతరం చెప్తున్న సాకులు ఇవే!
న్యూఢిల్లీ: జీవితంలో ప్రతిఒక్కరూ తమకు తెలిసి చేసుకునే అతిపెద్ద పండుగ పెళ్లి. అటువంటి పండుగను సంవత్సరాల తరబడి నేటి యువతరం ఎందుకు దూరంగా నెట్టేస్తుందో తెలుసా? భారతదేశంలోని అతిపెద్ద ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ సంస్థ భారత్ మ్యాట్రిమోనియల్ నిర్వహించిన ఓ సర్వేలో భారత యువతరం పెళ్లిని వాయిదా వేయడానికి చెప్తున్న సాకులు చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు. సర్వేలో కొంతమంది యువతీ, యువకులను సంస్థ నిపుణులు 10 రకాల ఆలోచనాత్మక ప్రశ్నలను సంధించారు. వాటిలో కొన్నింటికి వచ్చిన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి. అబ్బాయిలేమంటున్నారంటే.. వయసు తక్కువని పెళ్లిని వాయిదా వేయడం కరెక్టా? అని సంస్థ ప్రశ్నిస్తే.. పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మానసికంగా అందుకు సిద్ధంకావాలని అందుకు సమయం పడుతుందని చక్కగా సమాధానం ఇచ్చేశారు. 'నా స్నేహితులందరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నాకు పెళ్లేంటీ. నాకు ఇంకా అంత స్థిరత్వం రాలేదు. నేను తగినంత డబ్బు సేవ్ చేయలేదు. నాకు ప్రతి వారం షాపింగ్ చేయాలంటే చిరాకు. వంట వండటం నేర్చుకోవడానికి నాకు సమయం కావాలి' లాంటి సిల్లీ సమాధానాలు కూడా ఇచ్చారు. అమ్మాయిలేమంటున్నారంటే.. అమ్మాయిలు పెళ్లిని తప్పించుకునేందుకు చెప్పిన సాకులు అదరహో అనిపించాయి. 'ఇంకొన్ని సంవత్సరాలు నేను అమ్మా, నాన్నలతో కలిసి ఉండాలి. అత్త, కోడళ్ల డ్రామాలోకి నేను అంత తొందరగా వెళ్లాలనుకోవడం లేదు. నేను మంచి కోడలిని కాలేనేమో అనిపిస్తుంది. ఇంటిపనులు అప్పుడే చేయాలని లేదు. ముందు నన్ను నా రాకుమారుడిని వెతుక్కొనివ్వండి' లాంటి సమాధానాలతో వారికి వారే సాటి అనిపించారు. ప్రస్తుతం దీనిపై ఇంకా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ కార్యక్రమం ద్వారా యువతీ, యువకులను వివాహానికి సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని హ్యాపీ మ్యారేజెస్ హెడ్ అన్నారు. యువతీ, యువకులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని అంశాలను గుర్తించామని చెప్పారు. పెళ్లి చేసుకునే ముందు అందరూ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారని తెలిపారు. పెళ్లికి వయసుతో సంబంధం లేదని మెచ్యురిటీ ఉంటే చాలని భావిస్తున్నట్లు వివరించారు. వివాహానికి ముందు ఆర్ధికంగా కూడా సెటివ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారని అది నిజమని అన్నారు. -
సింగిల్ లెగ్ సాకులు
సోల్ / సాకులు లోకులు పలు కాకులని పెద్దలు అన్నారు గానీ, లోకంలో పలు సాకులు ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. అయినా నష్టమేమీ లేదు. చాకులాంటి తెలివైన మహానుభావులు కొందరు ఈ రహస్య సత్యాన్ని గుర్తించారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి... ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ అనే నీతిశతకంలోని అంతరార్థం ఇదేనని వారు గ్రహించారు. ఆత్మరక్షణ కోసం కొన్ని, అవసరార్థం ఇంకొన్ని, అనవసరాల నుంచి తప్పించుకోవడం కోసం మరికొన్ని... టోకున సాకులు చెప్పే విద్యలో ఆరితేరిన వీరులుగా, అసహాయ శూరులుగా... మొత్తానికి ఈ పాడు లోకంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూ వస్తున్నారు. ఇలాంటి పెద్దమనుషుల్లో కొందరు రాజకీయాల్లో సహజంగానే రాణిస్తున్నారు. లోకంలో ముక్కుసూటిగా పోయే అసమర్థులు, అప్రయోజకులు తప్ప వేరెవరూ సాకుల కోసం వెదుక్కోరనేది జగమెరిగిన లౌక్యసిద్ధాంతుల నిశ్చితాభిప్రాయం. అయితే, కొందరు అమాయకులు ఈ అభిప్రాయంతో విభేదిస్తారు. సాకులు చెప్పడాన్ని అవలక్షణంగా పరిగణిస్తారు. అయినదానికీ కానిదానికీ చెప్పే సాకులను ‘కుంటి’సాకులుగానూ అభివర్ణించి, తమ అక్కసును వెళ్లగక్కుతారు. సాకులు సాహిత్యావలోకనం తెలుగు సాహిత్యంలో సాకులు చెప్పే పాత్రలు చాలానే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడి వంటి వికటకవి కూడా రాయలవారి సమక్షంలో అడపాదడపా సాకులు చెప్పి, వినోదాన్ని పంచిన దాఖలాలూ ఉన్నాయి. అయితే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వారితో ఎడాపెడా టోకున సాకులు చెప్పడంలో ‘కన్యాశుల్కం’లోని గిరీశాన్ని మించిన జాదూగాడు తెలుగు సాహిత్యంలోనే లేడు. పరీక్ష తప్పి ముఖం వేలాడేసుకు వచ్చిన తన ప్రియశిష్యుడు వెంకటేశం మీదే సాకులు సంధిస్తాడు. ‘మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టలు కాల్చడం ఒక్కటే. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ, ఒక మారయినా, ఒక ముక్క చెప్పిన పాపాన పోయినారూ?’ అని వెంకటేశం నిష్టూరమాడితే, గిరీశం తడుముకోకుండా సాకులు చెబుతాడు. ‘ఇలాటి మాటంటే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్... ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ?... మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్! చుట్ట నేర్పినందుకు థాంకు చెయ్యక, తప్పుపట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదే స్టీముయంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు...’ అంటూ ఏకబిగిన చుట్ట మహిమ గురించి సాకులు చెప్పుకొస్తాడు. వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు వంటి అపరదుర్వాసుడిని సైతం ఇలాంటి సాకులతోనే బుట్టలో పడేసుకుంటాడు. వినేవాళ్లకు చీకాకులు వినేవాళ్లను వెర్రిమాలోకాలుగా ఎంచే ధీమంతులే అలవోకగా సాకులు చెప్పగలరు. మొదట్లో హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు టీచర్లకు సాకులు చెప్పడం మొదలుపెడతారు. మొదట్లో వాళ్లు కాస్త భయంభయంగా సాకులు చెబుతారు. రాత్రి జ్వరం వచ్చిందనో, కడుపు నొప్పిగా ఉందనో పిల్లలు అమాయకపు మొహాలతో చెప్పే సాకులు వినే టీచర్లు కాస్త మానవత్వంతో ఆలోచించి, పోన్లే పాపం అని క్షమించేస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా జరగొచ్చు. పదే పదే పిల్లలు చెప్పే సాకులు వింటుంటే ఎంతటి సహనవంతులైన టీచర్లకైనా కోపం వేసవితాపంలా పెరుగుతుంది. అలాంటప్పుడు వారు దండోపాయాన్నే తరుణోపాయంగా ఎంచుకుంటారు. మొండిఘటాలైన పిల్లలు టీచర్ల దండనను కూడా తప్పించుకునే తరుణోపాయాలను తక్షణమే ఆలోచించగలరు. మొదట్లో తేలికపాటి సాకులు చెప్పేవారు కాస్తా దెబ్బలు తప్పవనే పరిస్థితి ఎదురైనప్పుడు మరింత పెద్దపెద్ద సాకులు చెప్పి, ఆ ఆపదనూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. స్కూళ్లలో సాకులు చెప్పే పిల్లలు కాలేజీకి చేరేలోగానే చాలా ఢక్కామొక్కీలు తిని ఉంటారు. సాకులు చెప్పే విద్యలోనూ కొంచెం రాటుదేలి ఉంటారు. కాలేజీ నుంచి బయటపడి ఉద్యోగపర్వంలో కాలుపెట్టే నాటికి పూర్తిగా ఆరితేరిన సాకువీరులుగా తయారవుతారు. పని ఎగ్గొట్టడానికి ఆఫీసుల్లో బాసులకు సాకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ పురోగతి అక్కడితోనే ఆగిపోదు. ఎదుటివాళ్ల బలహీనతలను పసిగట్టి, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెప్పడంలో నిరంతర సాధన కొనసాగుతూనే ఉంటుంది. పెళ్లిళ్లయి కుటుంబరావులుగా మారిన తర్వాత కూడా బలాదూర్ మందుపార్టీల్లో మునిగితేలి, ఆలస్యంగా కొంపలకు చేరినప్పుడు ఇల్లాళ్లకూ రకరకాల సాకులు చెబుతారు. సాకువీరుల్లోనూ కొందరు మరీ ముదుర్లుంటారు. అదృష్టం బాగుంటే ఇలాంటి వాళ్లు రాజకీయ పార్టీల్లో సలహాదారులుగా సెటిలైపోతారు. ఎవరు చెబుతారంటే..? జీవితాన్ని కులాసాగా ధిలాసాగా చీకూచింతా లేకుండా నిష్పూచీగా గడిపేయాలనుకునే నిక్షేపరాయుళ్లే ఎక్కువగా సాకులు చెబుతారట! కించిత్ కష్టమైనా వీరి ఒంటికి పడదు. ఇష్టంలేని పనులను తప్పించుకోవాలనుకునే వాళ్లు కూడా సాకులు చెబుతారట! అయిష్టమైన పనులు అనివార్యమైతే ఎటూ తప్పదు. ఈలోగా వాటిని సాధ్యమైనంత నివారించుకునేందుకు శాయశక్తులా చేసే ప్రయత్నంలో భాగంగానే చాలామంది సాకులు చెబుతారట! కొద్ది మంది అమాయకులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో సుఖాలకు దగ్గరగా, కష్టాలకు దూరంగా ఉండాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏ మేరకు బలంగా ఉంటే, ఆ మేరకు సాకులు చెప్పడంలో ప్రావీణ్యం అబ్బుతుంది. ఇవన్నీ ఏ కాలజ్ఞానం చెప్పిన విశేషాలో కావు, ఆధునిక మానసిక శాస్త్రం చెబుతున్న కారణాలు. -
సాకులు చెప్పొద్దు
పీహెచ్సీ సిబ్బందికి కలెక్టర్ మందలింపు అచ్యుతాపురం మండలంలో ఆకస్మిక పర్యటన అచ్యుతాపురం : లక్ష్యాన్ని చేరడానికి సాకులు చెప్పకండి.. ప్రణాళిక బద్ధంగా పనిచేయండని కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని మందలించారు. శనివారం ఆయన ప్రాథమిక వైద్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. గర్భిణులు చనిపోయిన సంఘటనలపై ఆరా తీశారు. ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించడం వల్ల ఎనిమిది కేసుల్లో చనిపోయినట్టు వైద్యాధికారి భీమారావు తెలపడంతో కలెక్టర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పడం సరికాదని, వెనుకబడిన గ్రామాలపై దృష్టిసారించి ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మందలించారు. పీహెచ్సీలో సౌకర్యాల మెరుగుకు సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్ యువరాజ్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కంప్యూటర్లో పరిశీలించి ఆధార్ సీడింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. ఆధార్ సీడింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. ఇటీవల రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ చేయడం వల్ల జిల్లాలో 14 టన్నుల బియ్యం మిగిలాయన్నారు. మూడునెలలపాటు వరుసగా రేషన్ పొందకపోతే కార్డును శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు భరోసా ఈ సందర్భంగా దుప్పుతూరు నాయకుడు ప్రగడ జూనియర్ నాగేశ్వరరావు నిర్వాసిత గ్రామ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య తన దృష్టికి వచ్చిందని గ్రామానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. పరిశ్రమల్లో పూడిమడక గ్రామస్తులకు ఉపాధి కల్పించడం లేదని మత్య్సకార నాయకులు ఫిర్యాదు చేయగా, అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బార్క్‌లో పని కల్పించాలని, సెజ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, రాజాన రమేష్‌కుమార్, బైలపూడి రామదాసు ఆయన్ని కోరారు. సమస్యలన్నీ తనదృష్టికి వచ్చాయని, అంచెలంచెలుగా పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ ఎంపీడీఓ ఎస్.మంజులవాణి పాల్గొన్నారు.