సాకులు చెప్పొద్దు
- పీహెచ్‌సీ సిబ్బందికి కలెక్టర్ మందలింపు
- అచ్యుతాపురం మండలంలో ఆకస్మిక పర్యటన
అచ్యుతాపురం : లక్ష్యాన్ని చేరడానికి సాకులు చెప్పకండి.. ప్రణాళిక బద్ధంగా పనిచేయండని కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని మందలించారు. శనివారం ఆయన ప్రాథమిక వైద్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. గర్భిణులు చనిపోయిన సంఘటనలపై ఆరా తీశారు.
ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయించడం వల్ల ఎనిమిది కేసుల్లో చనిపోయినట్టు వైద్యాధికారి భీమారావు తెలపడంతో కలెక్టర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పడం సరికాదని, వెనుకబడిన గ్రామాలపై దృష్టిసారించి ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మందలించారు. పీహెచ్‌సీలో సౌకర్యాల మెరుగుకు సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్ యువరాజ్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.
కంప్యూటర్‌లో పరిశీలించి ఆధార్ సీడింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. ఆధార్ సీడింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. ఇటీవల రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ చేయడం వల్ల జిల్లాలో 14 టన్నుల బియ్యం మిగిలాయన్నారు. మూడునెలలపాటు వరుసగా రేషన్ పొందకపోతే కార్డును శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నిర్వాసితులకు భరోసా
ఈ సందర్భంగా దుప్పుతూరు నాయకుడు ప్రగడ జూనియర్ నాగేశ్వరరావు నిర్వాసిత గ్రామ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య తన దృష్టికి వచ్చిందని గ్రామానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. పరిశ్రమల్లో పూడిమడక గ్రామస్తులకు ఉపాధి కల్పించడం లేదని మత్య్సకార నాయకులు ఫిర్యాదు చేయగా, అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
బార్క్‌లో పని కల్పించాలని, సెజ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, రాజాన రమేష్‌కుమార్, బైలపూడి రామదాసు ఆయన్ని కోరారు. సమస్యలన్నీ తనదృష్టికి వచ్చాయని, అంచెలంచెలుగా పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ ఎంపీడీఓ ఎస్.మంజులవాణి పాల్గొన్నారు.