N.Yuvraj
-
బాధితులందరికీ నష్టపరిహారం
విశాఖ రూరల్ : తుపాను నష్టం అంచనా వేగంగా సాగుతోందని, ప్రతీ బాధితునికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. జెడ్పీసాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల నష్టాలకు సంబంధించి ఏజెన్సీలో 6 మండ లాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అంచనాలు పూర్తయ్యాయని, శనివారం అన్ని మండల, గ్రామ కార్యాలయాల్లో జాబితాను ఉంచుతామని, ఎవరి పేరైనా లేకపోతే రెండు రోజుల్లో సంబంధిత తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇతర ప్రాంతాల నుంచి బృందాలను రప్పించి అంచనాలు సిద్ధం చేస్తామన్నారు. 50 శాతం కన్నా తక్కువ నష్టం జరిగినా చెట్టును పరిగణలోకి తీసుకొని అంచనాలు రూపొందిస్తామన్నారు. ఆదర్శంగా జెడ్పీ సమావేశాలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించేందుకు ఇది చక్కని వేదిక అని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశాలను మొక్కుబడిగా కాకుండా ఇతర జిల్లాకు విశాఖ జెడ్పీ మోడల్‌గా తీసుకొనే స్థాయిలో పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారంపై దృషి సారించాలని పిలుపునిచ్చారు. తుపాను నష్టం అంచనాలు జరుగుతున్నాయని, క్షేత్ర స్థాయిలో నష్టాలు సభ్యులకు తెలుస్తుందని, అంచనా బృందాలకు సహకరించి ప్రతీ ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. రీచ్‌ల ఆదాయం స్థానిక సంస్థలకే దక్కాలి అజెండాలోకి వెళ్లే ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. రీచ్‌ల నుంచి వచ్చే ఆదాయం శతశాతం స్థానిక సంస్థలకు చెందాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కోరారు. అరకు ఎంపీ కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీలో ఇసుక రీచ్‌లు ఇంకా గుర్తించలేదని, ప్రత్యేక ఇసుక పాలసీని చేయకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఏజెన్సీలో వారం రోజుల్లో ఇసుక రీచ్‌లు గుర్తిస్తామని డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ తుపాను పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరగా సభ్యులు అందుకు అంగీకారం తెలిపారు. ఒక్కో అంశంపై పది నిమిషాలే అజెండాను ప్రారంభించిన తరువాత ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై చర్చించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి పీహెచ్సీ కంటే ధారణంగా ఉందని, పూర్తి స్థాయిలో వైద్యులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, దోబీలు లేరని పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చే కేసులను కేజీహెచ్‌కు పంపిస్తున్నారని, 108 అంబులెన్సుకు ఫోన్ చేస్తే రాడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుందని, ఆస్పత్రి అంబులెన్సుకు డీజిల్ లేదని తెలిపారు. వైద్యులతో పాటు టెక్నీషియన్స్‌కు ఏడు నెలలుగా జీతాలు లేవని, ప్రతీ నెలా సక్రమంగా వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో వైద్యులపై దాడులు జరగకుండా పోలీసులను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీలో అనేక వ్యాధులతో పాటు కళ్లకలకలు ఎక్కువగా ఉన్నాయని ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌కు సూచించారు. అనంతరం విద్యుత్, హౌసింగ్, వ్యవసాయం అంశాలపై పదేసి నిమిషాలు చర్చించారు. ప్రతీ అంశంపైనా కేవలం ఎమ్మెల్యేలే మాట్లాడుతూ జెడ్పీటీసీలకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల టీడీపీ జెడ్పీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల్లో జెడ్పీటీసీలకు కూర్చీ లేదని, ఆ సౌకర్యం కల్పించాలని పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు కోరారు. -
జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
విశాఖ రూరల్ : జిల్లా సమగ్రాభివృద్ధి బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. భవిష్యత్తులో జిల్లా ఆర్థికాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు తోడ్పడే అంశాలపై విశ్వవిద్యాలయాల నిపుణులు దృష్టి సారించి సమగ్ర ప్రణాళిక రూపొందిం చాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే ఉందని, జిల్లాలో ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు, వాటి అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మేధావులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహనరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో గ్రీన్, బ్లూ, వైట్ రివెల్యూషన్ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వాటి అభివృద్ధికి పుష్కలంగా వనరులున్నాయని తెలిపారు. గీతం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ విశాఖ నుంచి అరకుకు అద్దాల రైలు వేయాలని సూచించారు. ఆంధ్రా సిమ్లాగా పేరొందిన లంబసింగిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలిపారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులు లేవని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా సగటు జాతీయోత్పత్తిని పెంచుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఊటీ మారిదిగా అరకును డీనోటిఫై చేయాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోర్టు కనీసం నియమాలు పాటించడం లేదని, సంస్థ విస్తరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుకు వెళతామని తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం జరగకుండా వారం రోజుల్లో సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేసేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాయకరావుపేట ఎమ్మెల్యేల వంగలపూడి అనిత అన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్లరమేష్‌బాబు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ అప్రెంటిస్ సీట్ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈలోగా ప్రాథమిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తే ఆయన దృష్టికి వెళ్లవచ్చని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఏజేసీ నరిసింహారావు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళిక వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి నుంచే రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సూచించారు. వ్యవసాయాధికారులతో జిల్లాలో ఖరీఫ్ 2014కు సంబంధించిన గ్రామ స్థాయి వ్యవసాయ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యమైన పంటల్లో ఉత్పాదకతను పెంచి వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని చెప్పారు. వ్యవసాయ పనులను గ్రామీణ ఉపాధిహామీ పథకాలతో అనుసంధానం చేయాలని, పంటలు కోసిన తర్వాత వచ్చే నష్టాలను నివారించాలన్నారు. వ్యవసాయ శాఖద్వారా అమలవుతున్న పథకాలన్నింటినీ ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరాచేయాలన్నారు. -
పాఠశాలల్లోనే ఆధార్ నమోదు
డెంగ్యూ, చికున్‌గున్యాలను అరికట్టండి సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ యువరాజ్ విశాఖ రూరల్ : విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సూచించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వివిధ అంశాలపై సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులను ఆధార్ నమోదు కోసం మండల కేంద్రాలకు తరలిస్తే ఇబ్బందులు పడతారని, ఆధార్ కిట్లు, సిబ్బందిని పాఠశాలలకే పంపించాలని ఆదేశించారు. మైదాన ప్రాంతంలో ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఏజెన్సీలో సాధారణ ప్రజలకు ముందు నమోదు చేసి, ఆ తర్వాత పాఠశాలల్లో చేపట్టాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని అరికట్టేందుకు మండలాభివృద్ధి అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో డీఆర్ డిపోల పునర్వ్యవస్థీకరణ, ఆర్ఓఎఫ్ఆర్ పనులపై తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద జిల్లాలో విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ల లో 250 చెరువులను గుర్తించామని వాటిని అభివృద్ధి చేయడానికి, మొక్కలు నాటడానికి నివేదికలు ఈ నెల 20లోగా తమకు చేరాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకునే క్రమంలో అవి ఏ ప్రాంతంలో ఉండాలో సర్వే నంబర్లతో నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లకు చెప్పారు. ఈ నెల 17న పంచాయతీరాజ్ మంత్రి సమీ క్ష ఉందని, ఇందులో ఈ అంశం చర్చకు వస్తుందన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ముఖ్యమంత్రి ట్రాన్సిట్ హాల్ట్ కోసం విశాఖలో కొద్ది సేపు ఆగవచ్చని, సీఎం గత పర్యటనలో వచ్చిన అర్జీలపై సమీక్షించే అవకాశం ఉన్నందున వాటిపై తీసుకున్న చర్యలను నివేదించాలన్నారు. ఏజేసీ నరసింహారావు, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
సాకులు చెప్పొద్దు
పీహెచ్సీ సిబ్బందికి కలెక్టర్ మందలింపు అచ్యుతాపురం మండలంలో ఆకస్మిక పర్యటన అచ్యుతాపురం : లక్ష్యాన్ని చేరడానికి సాకులు చెప్పకండి.. ప్రణాళిక బద్ధంగా పనిచేయండని కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని మందలించారు. శనివారం ఆయన ప్రాథమిక వైద్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. గర్భిణులు చనిపోయిన సంఘటనలపై ఆరా తీశారు. ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించడం వల్ల ఎనిమిది కేసుల్లో చనిపోయినట్టు వైద్యాధికారి భీమారావు తెలపడంతో కలెక్టర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పడం సరికాదని, వెనుకబడిన గ్రామాలపై దృష్టిసారించి ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మందలించారు. పీహెచ్సీలో సౌకర్యాల మెరుగుకు సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్ యువరాజ్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కంప్యూటర్లో పరిశీలించి ఆధార్ సీడింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. ఆధార్ సీడింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. ఇటీవల రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ చేయడం వల్ల జిల్లాలో 14 టన్నుల బియ్యం మిగిలాయన్నారు. మూడునెలలపాటు వరుసగా రేషన్ పొందకపోతే కార్డును శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు భరోసా ఈ సందర్భంగా దుప్పుతూరు నాయకుడు ప్రగడ జూనియర్ నాగేశ్వరరావు నిర్వాసిత గ్రామ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య తన దృష్టికి వచ్చిందని గ్రామానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. పరిశ్రమల్లో పూడిమడక గ్రామస్తులకు ఉపాధి కల్పించడం లేదని మత్య్సకార నాయకులు ఫిర్యాదు చేయగా, అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బార్క్‌లో పని కల్పించాలని, సెజ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, రాజాన రమేష్‌కుమార్, బైలపూడి రామదాసు ఆయన్ని కోరారు. సమస్యలన్నీ తనదృష్టికి వచ్చాయని, అంచెలంచెలుగా పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ ఎంపీడీఓ ఎస్.మంజులవాణి పాల్గొన్నారు.