పాఠశాలల్లోనే ఆధార్ నమోదు
- డెంగ్యూ, చికున్‌గున్యాలను అరికట్టండి
- సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ యువరాజ్
విశాఖ రూరల్ : విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సూచించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వివిధ అంశాలపై సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులను ఆధార్ నమోదు కోసం మండల కేంద్రాలకు తరలిస్తే ఇబ్బందులు పడతారని, ఆధార్ కిట్లు, సిబ్బందిని పాఠశాలలకే పంపించాలని ఆదేశించారు. మైదాన ప్రాంతంలో ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.
ఏజెన్సీలో సాధారణ ప్రజలకు ముందు నమోదు చేసి, ఆ తర్వాత పాఠశాలల్లో చేపట్టాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని అరికట్టేందుకు మండలాభివృద్ధి అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో డీఆర్ డిపోల పునర్‌వ్యవస్థీకరణ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పనులపై తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద జిల్లాలో విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ల లో 250 చెరువులను గుర్తించామని వాటిని అభివృద్ధి చేయడానికి, మొక్కలు నాటడానికి నివేదికలు ఈ నెల 20లోగా తమకు చేరాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకునే క్రమంలో అవి ఏ ప్రాంతంలో ఉండాలో సర్వే నంబర్లతో నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లకు చెప్పారు.
ఈ నెల 17న పంచాయతీరాజ్ మంత్రి సమీ క్ష ఉందని, ఇందులో ఈ అంశం చర్చకు వస్తుందన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ముఖ్యమంత్రి ట్రాన్సిట్ హాల్ట్ కోసం విశాఖలో కొద్ది సేపు ఆగవచ్చని, సీఎం గత పర్యటనలో వచ్చిన అర్జీలపై సమీక్షించే అవకాశం ఉన్నందున వాటిపై తీసుకున్న చర్యలను నివేదించాలన్నారు. ఏజేసీ నరసింహారావు, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.