జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ | master plan for the development of district | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

Published Wed, Sep 17 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

విశాఖ రూరల్ : జిల్లా సమగ్రాభివృద్ధి బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. భవిష్యత్తులో జిల్లా ఆర్థికాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు తోడ్పడే అంశాలపై విశ్వవిద్యాలయాల నిపుణులు దృష్టి సారించి సమగ్ర ప్రణాళిక రూపొందిం చాలని కోరారు. రాష్ట్ర  విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే ఉందని, జిల్లాలో ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు, వాటి అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మేధావులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు.
 
ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహనరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో గ్రీన్, బ్లూ, వైట్ రివెల్యూషన్ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వాటి అభివృద్ధికి పుష్కలంగా వనరులున్నాయని తెలిపారు. గీతం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు.  అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ విశాఖ నుంచి అరకుకు అద్దాల రైలు వేయాలని సూచించారు. ఆంధ్రా సిమ్లాగా పేరొందిన లంబసింగిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలిపారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని చెప్పారు.
 
మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులు లేవని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా సగటు జాతీయోత్పత్తిని పెంచుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఊటీ మారిదిగా అరకును డీనోటిఫై చేయాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోర్టు కనీసం నియమాలు పాటించడం లేదని, సంస్థ విస్తరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుకు వెళతామని తెలిపారు.
 
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం జరగకుండా వారం రోజుల్లో సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేసేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాయకరావుపేట ఎమ్మెల్యేల వంగలపూడి అనిత అన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్లరమేష్‌బాబు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ అప్రెంటిస్ సీట్ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈలోగా ప్రాథమిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తే ఆయన దృష్టికి వెళ్లవచ్చని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఏజేసీ నరిసింహారావు పాల్గొన్నారు.
 
గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళిక
వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి నుంచే రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్  సూచించారు. వ్యవసాయాధికారులతో జిల్లాలో ఖరీఫ్ 2014కు సంబంధించిన గ్రామ స్థాయి వ్యవసాయ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యమైన పంటల్లో ఉత్పాదకతను పెంచి వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని చెప్పారు. వ్యవసాయ పనులను గ్రామీణ ఉపాధిహామీ పథకాలతో అనుసంధానం చేయాలని, పంటలు కోసిన తర్వాత వచ్చే నష్టాలను నివారించాలన్నారు. వ్యవసాయ శాఖద్వారా అమలవుతున్న  పథకాలన్నింటినీ ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరాచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement