పట్టణాలు, నగరాల అభివృద్ధికి పడని అడుగులు.. తెరపైకి రోజుకో కొత్త పథకం..
ఆచరణకు నోచని ‘అర్బన్ తెలంగాణ’మార్గదర్శకాలు
కొత్త మున్సిపాలిటీలు, పట్టణాలకూ ఖరారు కాని ‘మాస్టర్‌ప్లాన్’లు
గత ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేసిన అధికారులు
పెండింగ్‌లో 46 మున్సిపాలిటీలు, 21 పట్టణాల మాస్టర్‌ప్లాన్‌లు
ఏళ్లు గడుస్తున్నా ఆమోదానికి నోచని వైనం
సిద్ధం కాని గ్రేటర్ వరంగల్ – 2041 డీపీఆర్
వరంగల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) ఆధ్వర్యంలో కొత్త, పాత పురపాలక సంఘాలకు కొత్త బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ల అమలు పథకం అటకెక్కింది. గత ప్రభుత్వ హయాంలో నగరాలు, పట్టణాల స్థితిగతులు అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్న డీటీసీపీ ఆదేశాల మేరకు.. మున్సిపాలిటీలలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అన్నీ సిద్ధం చేసినా ఆమోదానికి నోచుకోలేదు. – సాక్షి ప్రతినిధి, వరంగల్
2022లో ప్రణాళికలు
సిద్ధమైనా..2022లో పురపాలకశాఖ ఆదేశాల మేరకు ఆ ఏడాది జూన్ నెలాఖరు వరకు ప్రణాళికలు సిద్ధమైతే.. 2023 నుంచి పలు మున్సిపాలిటీలు, పట్టణాల మాస్టర్‌ప్లాన్‌కు మోక్షం కలుగుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అర్బన్ తెలంగాణ.. అభివృద్ధి నమూనా’పేరిట ‘మాస్టర్‌ప్లాన్–2050’తయారు చేయాలని నిర్ణయించి ఆదేశించినా ఇంకా పట్టాలు ఎక్కడం లేదు.
జనగామ పురపాలిక 1953లో ఏర్పడింది. 1987లో దీని పరిధిలో మాస్టర్‌ప్లాన్ అమలుకు అడుగులు పడగా, 1990లో అమల్లోకి వచి్చంది. డీటీసీపీ ఆదేశాలతో 2015లో కౌన్సిల్ తీర్మానం, ప్రభుత్వ ఆదేశాలతో 2017లో రివైజ్డ్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని కోరుతూ వినతి పంపించారు. సుమారు మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా, మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో కొత్త మాస్టర్‌ప్లాన్ ఆవశ్యంగా మారింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ మూలన పడింది. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏయూడీఏ)ని తెరపైకి తెచ్చినా.. భవిష్యత్ అభివృద్ధి, ప్రయోజనాలకు కీలకమైన మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచడం లేదు. పూర్వ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్ అమలుకు.. లక్సెట్టిపేట్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు జరిగినా పూర్తి దశకు చేరలేదు.
మాస్టర్‌ప్లాన్ అమలైతే ప్రయోజనాలివీ..
మాస్టర్‌ప్లాన్ ఆమోదం పొందితే అందులో దాదాపు 40 విభాగాలు ఉంటాయి. వాణిజ్య, నివాసాలకు ప్రత్యేకంగా జోన్లు కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తాగునీటి పైపులైన్లు, మురుగు, వర్షపు నీటి కాలువలు, రహదారుల వెడల్పు వంటి వాటిని ప్రత్యేకంగా కేటగిరీలుగా విభజిస్తారు. కొత్త ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ఇస్తారు. రహదారుల వెడల్పు ఎంత ఉండాలనేది ఖరారు చేస్తారు.
మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు. ఒకసారి ఆమోదించాక 20 – 40 ఏళ్ల పాటు పట్టణ ప్రణాళిక కార్యాచరణ మొత్తం దానికి అనుగుణంగానే సాగుతుంది. జీఐఎస్ ద్వారా ఇళ్లకు అనుమతులు, రహదారుల వెడల్పు వంటి సమాచారం ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్సు జారీ, పచ్చదనం, మౌలిక సదుపాయాలకు ఇదే ఆధారం.
వరంగల్ ఆర్‌డీడీ పరిధిలో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 46 మున్సిపాలిటీలు, 21 పట్టణాలకు 2023లో కొత్త మాస్టర్‌ప్లాన్ల రూపకల్పన జరిగింది. ఇందులో 17 పట్టణాలకు మాస్టర్‌ప్లాన్‌ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని 21 పట్టణాలకు కొత్తగా ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్ – 2041 ఇటీవలే ప్రభుత్వ ఆమోదానికి నోచుకుంది.
కానీ పూర్తి స్థాయిలో డీపీఆర్ కాలేదు. కాగా మందమర్రి, మంచిర్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, వైరా, కొత్తపల్లి మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు 2012, 2013, 2019లలో ఆమోదం పొందాయి. వైరా ఖమ్మం (సుడా)లో, కొత్తపల్లి కరీంనగర్ (సుడా)లో కలిశాయి. ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్ (సుడా), ఖమ్మం (సుడా) 2018 నుంచి కేంద్ర అమృత్ పథకంలో ఉన్నాయి.
రామగుండం అమృత్ స్కీం మాస్టర్‌ప్లాన్ రివిజన్ కూడా జరిగింది. జనగామ, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్‌నగర్, నిర్మల్, భైంసా, పాల్వంచ, కొత్తగూడెంలలో పాత మాస్టర్‌ప్లాన్‌ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని సత్తుపల్లి, మణుగూరు, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, ఇల్లందు, బెల్లంపల్లి జమ్మికుంట, వర్ధన్నపేట, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, మంధని, సుల్తానాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట్, క్యాతనపెల్లి, చొప్పదండి, రాయకల్, ధర్మపురి, ఖానాపూర్ పట్టణాలు కొత్త మాస్టర్ ప్లాన్‌కు నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment