సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్‌మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్‌మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు.
రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్‌ఎఫ్‌పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్‌బీలు), 21 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.
ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్‌ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment