Telangana: అర్నెల్లు ముందుగానే! | Hyderabad: Cm Kcr Master Plan For Coming Elections 2024 | Sakshi
Sakshi News home page

Telangana: అర్నెల్లు ముందుగానే!

Published Thu, Feb 3 2022 1:45 AM | Last Updated on Thu, Feb 3 2022 8:21 AM

Hyderabad: Cm Kcr Master Plan For Coming Elections 2024 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభకు ముందస్తు ఎన్ని కలు ఉండబోవని కుండబద్దలు కొట్టిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహా నికి మాత్రం  ఇప్పటినుంచే పదును పెడుతున్నా రు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 6 నెలల ముందే ప్రకటించా లని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు అసెం బ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.

ముందస్తు వ్యూహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొం దడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీలో అసమ్మతి తమకు కలిసి వస్తుందనే విపక్షాల ఆశలను వమ్ము చేయాలనే పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ ఎస్‌కు ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలను గెలుస్తామని రెండ్రోజుల క్రితం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

కొత్త ముఖాలకు ప్రాధాన్యత?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించిన కేసీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నుంచి 30 మంది కొత్తవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యేల వారసు లతో పాటు కొన్ని కొత్త ముఖాలకు ప్రత్యేకించి యువతకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం దక్కించుకున్న ఎర్రోల్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్‌ వంటి కొందరు యువనేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు ముఖ్య నేతలు తమ వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. 

యంత్రాంగంలో జోష్‌ లక్ష్యంగా..
ఉమ్మడి జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగం సమన్వయం, సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు తదితర బాధ్యతలను పార్టీ జిల్లా అ«ధ్యక్షుల చేతిలో పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇటీవల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన 33 మందిలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో ఎక్కువ మంది యువకులే కావడం గమనార్హం.

అసెంబ్లీ లోపలా బయటా విపక్షాలపై దూకుడును ప్రదర్శిస్తున్న వీరిని ప్రోత్సహించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో ఉత్సాహాన్ని నింపాలని అధినేత భావిస్తున్నారు. బాల్క సుమన్, ఎ.జీవన్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, మెతుకు ఆనంద్‌ వంటి వారికి ఈ కోణంలోనే అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అప్పగించారు. క్షేత్ర స్థాయిలో విపక్షాల ఎత్తుగడలను ఎదుర్కొనేలా కేసీఆర్‌ ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

మెదక్‌ నుంచే జాతీయ రాజకీయాల్లోకి?
 వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ పార్టీ క్రియాశీల పాత్ర పోషించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లతో తన ఆలోచనలను పంచుకున్న కేసీఆర్‌.. రెండు మూడురోజుల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకునే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మెదక్‌ ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో మెదక్‌ ఎంపీగా, గజ్వేల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్‌.. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండడం గమనార్హం.  

►అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే వారిపై వచ్చే వ్యతిరేకతను సరి దిద్దే చాన్స్‌ ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అదే సమయంలో టికెట్‌ ఆశించి భంగపడిన వారు వేసే అడుగులకు అనుగుణంగా ప్రతివ్యూహం ఖరారు చేసేందుకు కావాల్సినంత సమయం ఉంటుందనేది అధినేత ఆలోచన అని చెబుతున్నారు. 

►జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాతో పాటు వివిధ వేదికలు, సదస్సులను ఉపయోగించుకోనున్నారు. టీఎంసీ, ఆప్, ఎంఐఎం తరహాలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement