హెచ్‌ఎండీఏ ‘మెగా మాస్టర్‌ప్లాన్‌–2050’పై భారీ కసరత్తు | HMDA embarks on massive exercise on Mega Master Plan 2050 | Sakshi
Sakshi News home page

HMDA: సెప్టెంబర్‌ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా

Published Wed, Mar 26 2025 4:44 PM | Last Updated on Wed, Mar 26 2025 4:44 PM

HMDA embarks on massive exercise on Mega Master Plan 2050

వివిధ విభాగాల‌తో హెచ్‌ఎండీఏ కమిషనర్ స‌మావేశం

సాక్షి, సిటీబ్యూరో: రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా పరిధికనుగుణంగా ‘మెగా మాస్టర్‌ప్లాన్‌–2050’పై హెచ్‌ఎండీఏ భారీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాంప్రహెన్సివ్‌ మొబిలిటీప్లాన్‌ (సీఎంపీ) పైన లీ అసోసియేషన్‌ రూపొందించిన ప్రాథమిక నివేదికతో పాటు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా పరిధిలో బ్లూ, గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌పైన సమగ్రంగా చర్చించారు. ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్, అర్బన్‌ఫారెస్ట్, మాస్టర్‌ప్లాన్, ఇరిగేషన్‌ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా (Hyderabad Metropolitan Area) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నీటి వనరులు, అడవుల పరిరక్షణ, ట్రిపుల్‌ ఆర్‌ (RRR) వరకు పచ్చదనం విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి బేసిన్‌లపైన చర్చించారు. 2050 వరకు నగర అవసరాలకు సరిపడా నీటి లభ్యతపైన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అలాగే ఔటర్‌రింగ్‌ రోడ్డు నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (Regional Ring Road) వరకు నివాస జోన్‌లు, ఆర్థిక అభివృద్ధి మండళ్లు, లాజిస్టిక్‌ హబ్‌లు, పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన అధికారులు మాట్లాడారు.

ఇప్పుడు ట్రిపుల్‌ ఆర్‌ వరకు అందుబాటులో ఉన్న అడవులతో పాటు నగరీకరణకు అనుగుణంగా పచ్చదనం విస్తరణ, పార్కుల అభివృద్ధి, తదితర అంశాలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టుతో పాటు, వివిధ మార్గాల్లో  మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2050 నాటికి ఇంకా ఏయే  ప్రాంతాలకు మెట్రో విస్తరణకు అవకాశాలు ఉన్నాయనే అంశంతో పాటు, మెట్రో విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఏరకమైన ప్రజా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలనే  అంశంపైన కూడా సమగ్రమైన చర్చ జరిగింది.

సెప్టెంబర్‌ నాటికి ముసాయిదా... 
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా అభివృద్ధిపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిన నేపథ్యంలో సెప్టెంబర్‌ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌–2050 ముసాయిదాను సిద్ధం చేయాలని హెచ్‌ఎండీఏ (HMDA) భావిస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో సమగ్రమైన మహా ప్రణాళిక అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌ (Master Plan) రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించి త్వరలో అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు.

చ‌ద‌వండి: ఇక RRR వ‌రకు హెచ్‌ఎండీఏ అనుమ‌తులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement