Hyderabad Metropolitan Development Authority
-
అప్రోచ్ ‘వంద’ ఉంటేనే లేఅవుట్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారుల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్ అనుమతుల మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా హెచ్ఎండీఏ లేఅవుట్లకు అనుమతులు మంజూరు కావాలంటే వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాలని తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. గతంలో 2008, 2013లో విడుదల చేసిన జీవో ప్రకారం లేఅవుట్ అనుమతికి 30 ఫీట్ల రోడ్డు ఉంటే సరిపోతుందనే నియమాలను మార్చింది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే అనుమతులు కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకొని ప్రాసెస్‌లో ఉన్నవాటన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ ప్రస్తుత రోడ్డు 100 ఫీట్ల కన్నా తక్కువగా ఉంటే వారి లేఅవుట్ వరకు మిగిలిన రోడ్డును చూపిస్తేనే అనుమతులు ఇస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా రోడ్డు చూపించినా వాటి అభివృద్ధి కోసం అదనపు చార్జీలు చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం మరింత రెట్టింపవుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతికూల ప్రభావం: రియల్ ఎస్టేట్ వ్యాపారులు హెచ్ఎండీఏ తాజాగా తీసుకున్న వంద ఫీట్ల నిర్ణయం రియల్ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కరోనా దెబ్బతో విలవిలలాడుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రోడ్డు ఇంపాక్ట్ ఫీజు కింద అదనపు చార్జీలు వడ్డించడం ఎంతవరకు సమంజసం. గత రెండేళ్ల నుంచి చిన్నచిన్న లోపాలతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి కొత్త నిబంధనలు వర్తింపచేయడం కరెక్ట్ కాదు. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఊహించని దెబ్బ. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఏకంగా రియల్ వ్యాపారాన్ని కుదేలు చేయవద్దు. వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేనివారు ఇప్పుడు ఏం చేయాలి’అని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు ఇలా.. ♦ ప్రస్తుత రోడ్డు వెడల్పు(ఫీట్లు): అదనంగా చెల్లించాల్సిన నగదు ♦ 80 నుంచి 100లోపు ఉంటే: 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 60 నుంచి 80 లోపు ఉంటే : 66 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 30 నుంచి 60లోపు ఉంటే : 100 శాతం డెవలప్మెంట్ చార్జీలు ► 100 ఫ్లాట్ల కన్నా ఎక్కువగా ఉండి నాన్ హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతి కోసం 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలి. ► ఇప్పటికే డ్రాఫ్ట్ లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, అలాగే లేఅవుట్ విత్ హౌసింగ్ (ఓపెన్, గేటెడ్)కు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► అమోదం పొందిన మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లు, అంతకన్నా ఎక్కువగా ఉండి ప్రస్తుత రోడ్డు వెడల్పు ఎంత తక్కువగా ఉన్నా (30 ఫీట్ల వరకు) రోడ్డు ఇంపాక్ట్ ఫీ కింద 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ రోడ్డు ఇంపాక్ట్ ఫీజులను ‘స్పెషల్ ఎస్క్రో అకౌంట్’కింద ఉంచి లేఅవుట్లకు రోడ్ల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ఉపయోగించనుంది. -
అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై రాకపోకలు
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా రాకపోకలు నిషేధించిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై బుధవారం అర్థరాత్రి నుంచి వాహనాలకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్( హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. అయితే ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. (ఎమ్మెల్యేను బలిగొన్న మహమ్మారి) కాగా ఓఆర్ఆర్ టోట్ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఎ సూచించింది. అయితే కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్ఆర్పై కార్లను అనుమతించడం జరగదు. ఓఆర్ఆర్పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణీకులు ఉన్నట్లుగా టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు. (చైనా భయం.. భారత్‌కు వరం ) ‘ఔటర్’పై రైట్ రైట్! -
తెలంగాణపై చంద్రబాబుకు అసూయ
మిర్యాలగూడ : తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అసూయ కలుగుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తే రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉంటాయన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా తెలంగాణను చూసి అసూయ పడడం సరికాదని హితవుపలికారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదని ఎప్పుడో చెప్పాడని.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వారు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. భవనాలు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు కూడా అప్పటివేనని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డ్రెయినేజీ వ్యవస్థ కూడా అప్పటిదే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మిగులు బడ్జెట్‌తోనే ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు చేపట్టిన ఉద్యమంలో వల్ల తెలంగాణ ఏర్పడిందనన్నారు. చంద్రబాబునాయుడు కూడా ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చాడని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, ఎంపీపీ జానయ్య, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మదార్బాబా, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మారనున్న హైదరాబాద్ రూపురేఖలు
మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుంది. మెట్రో రైలు కేవలం ప్రజా రవాణా పరంగానే కాక నగరాభివృద్ధిలోనూ కొత్త మార్పులకు నాంది పలకనుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బడిముబ్బడిగా జరుగుతోన్న అభివృద్ధి నగరం నలుచెరుగులా...అన్ని ప్రాంతాలకూ విస్తరించనుంది. సమతుల అభివృద్ధి సాధ్యంకానుంది. ఇప్పటి వరకు దూరాభార ప్రయాణం, ట్రాఫిక్ సమస్యలు, వాహన కాలుష్యం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఎక్కడ ఉపాధి, పరిశ్రమలు ఉంటే ప్రజలు అక్కడే నివాసాలుంటున్నారు. మెట్రోతో ప్రయాణం సులువుగా మారడంతో ఇకపై ఈ పరిస్థితి మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా...ఇష్టమైన చోటే నివాసం ఉంటూ..ఈజీగా జర్నీ చేయవచ్చని నగరవాసులు భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు ప్రారంభంతో నగరంలో నవశకం ఆరంభం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలుండటంతో అంతా అటే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు పెరగడంతో వారిని దృష్టిలో ఉంచుకొని ఇతరత్రా వ్యాపారాలు, హోటళ్లు తదితరమైనవి పెరిగాయి. ఇలా అన్ని రంగాల్లోనూ కొన్ని చోట్లే అభివృద్ధి కేంద్రీకృతమవుతోంది. మెట్రో రైలు రాకతో ఎక్కడినుంచి ఎక్కడికైనా 45 నిమిషాల్లో చేరుకునే సదుపాయం ఉండటంతో ప్రజలు ఎక్కడ నివాసమున్నప్పటికీ సకాలంలో విధులకు చేరుకోగలుగుతారు. మహా అయితే గంట పట్టొచ్చు. అంతకు మించి సమయం పట్టదు కనుక ఎక్కడ నివాసం ఉన్నప్పటికీ ప్రయాణ ఇబ్బందులుండవు. మెట్రోరైల్లో సుఖవంతమైన ఏసీ ప్రయాణం. కాలుష్యం ఉండదు. గంటల తరబడి జర్నీ తిప్పలు, ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. కాబట్టి సదుపాయవంతంగా నివాసం దొరికితే ఎక్కడ ఉండేందుకైనా ప్రాధాన్యతనిస్తారు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అద్దెలకుండాలనుకున్నా తక్కువ ధరలకు దొరికే ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. జనాభా పెరిగినా.. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ పరిధిలో 67.31 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కోటి దాటినట్లు అంచనా. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఐటీ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలోనివారు, కూలికి ఢోకా ఉండని ప్రాంతాల్లో శ్రామికులు నివాసాలుంటున్నారు. అందువల్లే కార్పొరేటర్ డివిజన్లలోనూ ఒక డివిజన్లో 30 వేల జనాభా ఉంటే మరో డివిజన్లో 70 వేల జనాభా ఉంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. అన్ని ప్రాంతాల్లోనూ నగరం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ.. ప్రస్తుతం మియాపూర్ నుంచి అమీర్‌పేటకు 13 కి.మీ, అమీర్ పేట నుంచి నాగోల్‌కు 17 కి.మీ. వెరసి మొత్తం 30 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరో సంవత్సరంలో..అంటే 2018 డిసెంబర్ నాటికి మూడు కారిడార్లలోనూ మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేటకు, అమీర్‌పేట నుంచి రాయదుర్గం, అలాగే జూబ్లీ బస్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్టేషన్ వరకు వివిధ మార్గాల్లో 66 కి.మీ.ల మేర మెట్రో సదుపాయం కలుగనుంది. తదుపరి దశలో మరో వంద కి.మీ.ల మేర మెట్రో పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్లు కొనుక్కునే వారు అందుబాటు ధరలు, ఇతర సదుపాయాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే తరుణంలో మెట్రో స్టేషన్లకు సమీపంలోని ఇళ్లు, అద్దెల ధరలు భారీగా పెరగనున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు సెకండరీ రవాణాను అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. మెట్రో వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మెట్రో రైలు ప్రయాణం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వాహన కాలుష్యం , ట్రాఫిక్ చిక్కులుండవు. ప్రజలకు మెట్రో సంస్కృతి అలవడుతుంది. అంటే మెట్రో స్టేషన్ల వద్ద మాల్స్‌లో కొనుగోళ్లు తదితరమైనవి. అయితే మెట్రో స్టేషన్ల వద్ద తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించాలి. మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రజలు కూడా మెట్రోరైలును తమదిగా భావించి పరిశుభ్రంగా ఉంచాలి. ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు మెట్రోల్లో ప్రయాణం చేయడం ద్వారా మిగతా వారూ మెట్రోరైల్లోనే ప్రయాణిస్తారు. తద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాలు తగ్గుతాయి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
లక్ష కోట్లతో మిషన్ హైదరాబాద్
-
లక్ష కోట్లతో మిషన్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తరహాలో త్వరలోనే మరో భారీ మిషన్ తలపెట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమవుతున్నారు. రాజధాని నగరం హైదరాబాద్ రూపురేఖలు మార్చేలా భారీ అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశ్వనగరాన్ని తలపించేలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా రూ.లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీటిని అందించే మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్టు ప్రకటించాలని సీఎం యోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టే కార్యక్రమం కావటంతో ‘మిషన్ హైదరాబాద్’ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమం రూపురేఖలు, కార్యాచరణ రూట్‌మ్యాప్‌పై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమాలోచనలు చేశారు. కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టాక ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లోగా ఈ పనులన్నీ పూర్తవుతాయని ముఖ్యమంత్రి ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఇంటింటికీ నల్లా నీటిని అందించకపోతే ఓట్లు అడగబోమని సీఎం చేసిన సవాలుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగాయి. మరోవైపు రూ.25 వేల కోట్ల అంచనాలతో చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఆశించిన ఫలితాలను అందించింది. ఈ కార్యక్రమం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దీంతో అదే స్థాయిలో మిషన్ హైదరాబాద్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. నిర్ణీత గడువులోగా అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరుతూ పంపిన ప్రతిపాదనలన్నీ సీఎం ఇదే కారణంతో పక్కన పెట్టినట్లు సమాచారం. ‘‘ఇప్పుడు చిన్నచిన్న అభివృద్ధి పనులు, ప్రతిపాదనలు వద్దు. భారీ మిషన్ తరహాలో అభివృద్ధి చేద్దాం. వచ్చే రెండేళ్లు హైదరాబాద్ అభివృద్ధిపైనే ఫోకస్ చేద్దాం’’ అని ఇటీవల తనను కలసిన ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్టు తెలిసింది. సమస్యలకు విరుగుడు! విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను సవాలక్ష సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వాన పడితే చాలు రోడ్లన్నీ చెరువులవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. నిజాం కాలం నాటి డ్రైనేజీ పైపులు ఒత్తిడికి లోనై పగిలిపోతున్నాయి. వీటన్నింటికి తోడు పదేపదే పాడయ్యే రోడ్లు.. ఇవన్నీ హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి హోదాకు చేటు తెచ్చి పెడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నగరంలో అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. భారీగా నిధుల సమీకరణ గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రాథమికంగా రూపొందించిన అంచనాల ప్రకారం రూ.83,950 కోట్ల వ్యయంతో ప్రత్యేక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. హైదరాబాద్‌ను సుందర నగరంగా మార్చాలంటే ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తేనే సాధ్యమవుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే ఈ మిషన్‌కు ఏకంగా రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. విదేశీ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణసాయం తీసుకోవటంతోపాటు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమీకరించేందుకు వ్యూహరచన చేశారు. మొత్తం ప్రాజెక్టు అమలుకు నాలుగేళ్ల వ్యవధి పడుతుందని, కొన్ని పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. రోడ్లు, రవాణాపైనే ప్రధాన ఫోకస్ కొత్త మిషన్‌లో భాగంగా ప్రధానంగా రోడ్లు, రవాణాపై దృష్టి సారిస్తారు. ఇప్పటికే మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. నవంబర్‌లో మెట్రో మొదటి దశ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మెట్రో రెండో దశ, ఎంఎంటీఎస్ విస్తరణను కొత్త ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. వీటితోపాటు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్లై ఓవర్, స్కై వేలు, హైదరాబాద్ పరిసర పట్టణాలను కలిపే కౌంటర్ మాగ్నెట్ రోడ్లు, అత్యాధునిక బస్‌బేలు, పార్కింగ్లు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తారు. పర్యాటక ప్రాంతాల వద్ద విదేశీయులను ఆకర్షించేలా ఏర్పాట్లతోపాటు అక్కడ ఉండే స్టాల్స్, తోపుడుబండ్లను కూడా ప్రభుత్వమే డిజైన్ చేసి ఇవ్వనుంది. స్టార్ హోటళ్లు, మాల్స్‌లతోపాటు హుస్సేన్‌సాగర్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు. మిషన్ హైదరాబాద్‌లో భాగంగా పాత, శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కొన్నింటిని పరిరక్షిస్తారు. కొన్నింటి స్థానంలో అదే నమూనాలో కొత్తవి నిర్మిస్తారు. తెలంగాణ సంçస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కల్చరల్ సెంటర్లు, థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. అత్యాధునికంగా కూరగాయలు, నాన్‌వెజ్ మార్కెట్లు, మినీ కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తారు. మిషన్ హైదరాబాద్ ప్రాథమిక అంచనాలివీ..(రూ.కోట్లలో) రోడ్లు, రహదారులు 25,783 ఈస్ట్ వెస్ట్ మూసీ రోడ్ 7,775 హెచ్ఎండీఏ గ్రిడ్ రోడ్లు 6,000 మౌలిక వసతుల కల్పన 13,998 ఫుట్ ఓవర్ బ్రిడ్డిలు 42 మూసీ రివర్ ఫ్రంట్ 2,966 డబుల్ బెడ్రూం ఇళ్లు 7,788 శ్మశాన వాటికలు 25 హుస్సేన్ సాగర్ సుందరీకరణ 141.50 నీటి సరఫరా 12,531 డ్రైనేజీ వ్యవస్థ 6,900 -
స్టేట్ ఫైట్ మాత్రమే..స్ట్రీట్ ఫైట్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం స్టేట్ ఉద్యమమని, స్ట్రీట్ ఫైట్ కాదని తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ...దళితులకు, మైనార్టీలకు అందిస్తున్న కల్యాణలక్ష్మీ పథకాన్ని త్వరలోనే బీసీ సామాజిక వర్గాలకు కూడా వర్తింపు చేస్తామన్నారు. నగర ప్రజలు అన్ని పార్టీలకు మేయర్ అవకాశం కల్పించారని.... కానీ, నగర అభివృద్ధికి ఏ పార్టీ చిత్తశుద్ధితో పని చేయలేదని ఆయన అన్నారు. తమకు అవకాశమిస్తే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తామని కేటీఆర్ తెలిపారు. -
సెటిలర్ల వల్లే హైదరాబాద్ అభివృద్ధి: ఎంపీ రేణుకా
హైదరాబాద్: సెటిలర్ల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో సెటిలర్లను దూషించినందకుగానూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో రేణుకా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్న తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుగా రాజీనామా చేసి తర్వాత ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. రామోజీఫిల్మ్ సిటీని నాగళ్లు, ట్రాక్టర్లతో దున్నిస్తానంటూ.. అయ్యప్పసిటీ భవానాలను కూల్చడం వల్లే సెటిలర్లకు అభద్రతా భావం పెరిగిపోయిందని విమర్శించారు. సెటిలర్లకు అండగా నిలిచేది కాంగ్రెస్సే అని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంటు, 104, 108 వైద్య సేవల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులలో కూడా కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ టెండ్రు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొనసాగుతుందని రేణుకా చౌదరి తెలిపారు. -
'హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే'
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టీడీపీ, బీజేపీనేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ఒక జట్టు, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక జట్టుగా ఆయన పేర్కొన్నారు. బుధవారం రేవంత్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. భారతదేశాన్ని పది నిమిషాల్లో శ్మశానంగా మారుస్తానన్న వారికి ఓటు వెయ్యాలా వద్దా అనేది ఓటర్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినా పరోక్షంగా ఎంఐఎంకే ఓటేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పాత్రేంటో ఆయనకే తెలియదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
'అందరి సమన్వయంతో నగరాభివృద్ధి'
హైదరాబాద్: హైదరాబాద్‌లాంటి మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ బి.జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం పలువురు సీనియర్ అధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు అందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరంలో నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన అన్నారు. కమిషనర్‌ను కలిసినవారిలో ఐఏఎస్ అధికారులు సురేంద్రమోహన్, గౌరవ్‌ఉప్పల్, శివకుమార్ నాయుడు, హరిచందన, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్, శంకరయ్య, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఉన్నారు. -
'తెలంగాణ భవన్లోనైనా మేం సిద్ధమే'
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తమతో చర్చకు సిద్ధమేనా అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ కు కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ స్పందించారు. హైదరాబాద్ అభివృద్దిపై తెలంగాణ భవన్ లోనైనా తాము చర్చకు సిద్ధమే.. మీరు సిద్ధమేనా అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో లక్ష కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ది చేసిందని అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ ను పదిరెట్లు పెంచింది తామేనని చెప్పారు. కేసీఆర్ ఏడాదిన్నర పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని నిలదీశారు. చంద్రబాబుకు బహుమతులు ఇస్తూ సీఎం కేసీఆర్ విందులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసును విస్మరించారని గుర్తుచేశారు. సెటిలర్లను జాగో బాగో అన్న టీఆర్ఎస్ నేతలను హైదరాబాద్ మరిచిపోలేదని అన్నారు. -
చంద్రబాబుకు కవిత సవాల్..
-
చంద్రబాబుకు కవిత సవాల్..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆమె గురువారమిక్కడ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో భూములు అమ్మింది ఎవరో, అభివృద్ధి చేసింది ఎవరో తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్‌ను స్వీకరించాలని ఆమె అన్నారు. మనుషులను చంపటం...ఆ తర్వాత మాలలు వేయటం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, అలాగే అమరవీరుల చావుకు కారణమైన ఆ పార్టీ ... ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ మహానాడు రికార్డింగ్ డ్యాన్స్‌ను తలపిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. తెలుగు యూనివర్శిటీ రెండుగా విడిపోతే సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడతామని ఆమె తెలిపారు. -
హైదరాబాద్ అభివృద్ధికి 3 కమిటీల ఏర్పాటు
హైదరాబాద్ : నగర అభివృద్ధిపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు దృష్టిసారించారు. హైదరాబాద్ అభివృద్ధి నిమిత్తం మూడు కమిటీలను సీఎం కేసీఆర్ మంగళవారం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలసౌద వంటి ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, కొంత మంది అధికారులకు స్థానం కల్పించడం విశేషం. ఈ కమిటీల తీరు, నిర్వహణ అంశంపై జూన్ నెల 8వ తేదీన రాష్ట్ర కేబినెట్ మరోసారి భేటీ అవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. -
సెటిలర్స్ లేరు..
* ఉన్నోళ్లంతా హైదరాబాదీలే: సీఎం కేసీఆర్ * సెటిలర్లు అనే భావనను విడిచిపెట్టండి.. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడండి * ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా * వనస్థలిపురం, ఎల్బీనగర్, కూకట్‌పల్లిలో స్థిరపడిన వారితో సమావేశం నిర్వహిస్తా * ముఖ్యమంత్రిగా అందరి రక్షణ బాధ్యత తనదేనన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం లేదని.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నవారంతా సెటిలర్స్ అన్న భావనను విడిచిపెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా తనదేనని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో కూకట్పల్లి ప్రాంతంలోని పన్నెండు కాలనీలకు చెందిన పలువురు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వారందరినీ ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే. మీరు సెటిలర్స్ కాదు. మీ తాతలు, తండ్రులు వ చ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి. తెలంగాణలో ఇక సెటిలర్స్ ఉండరు..’’ అని ఆయన పేర్కొన్నారు. తాను మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టినా హైదరాబాదీనని చెప్పుకొంటున్నానని.. హైదరాబాద్‌లో పుట్టిన తన మనవడు హైదరాబాదీ అనే చెప్పుకుంటాడని కేసీఆర్ చెప్పారు. ‘‘ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి తేడాలు వచ్చాయి. మీకు చీమకుట్టినా, మీ కాలికి ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తా. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంగా నాదే. హైదరాబాద్‌లో నివసించే ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం..’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తమకు ప్రాంతీయ విభేదం లేదు కాబట్టే ప్రముఖ నిర్మాత రామానాయుడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని చెప్పారు. బాధ్యత అందరిపైనా ఉంది: హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని, అందరి బిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుందని, ఒకటి రెండేళ్లలో హైదరాబాద్‌లో మార్పులు చూస్తారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడడం తనకు నచ్చదని, చెప్పేది వంద శాతం చేసి చూపిస్తానని సీఎం అన్నారు. వనస్థలిపురం, ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో స్థిరపడిన వారితో భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా సమావేశమవుదామని... నాలుగైదు గంటలు హైదరాబాద్ అభివృద్ధి గురించి చ ర్చించుకుందామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నగర కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
టునీషియా తరహాలో హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాలోని టునీషియా దేశంలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సి ఉం దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ ప్రతినిధి డాక్టర్ ఫయీజ్ అల్ అబెదిన్ మంగళవారం సచి వాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ సౌదీ అరేబియా రాజు పంపిన వర్తమానాన్ని ఆయన సీఎంకు అందజేశారు. తెలంగాణ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రమని, ఫయీజ్ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు, సాంకేతిక సాయం, వైద్య రంగం లో సహకారం వంటివి అందిస్తామన్నారు. టునీ షియాలో కొత్తగా నిర్మిస్తున్న నగర నమూనాను యానిమేషన్ ఫిల్మ్ ద్వారా ఆయన సీఎంకి చూపారు. హైదరాబాద్ చుట్టుపక్కల సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలను నిర్మించాలని భావిస్తున్న ట్టు సీఎం ఆయన దృష్టికి తెచ్చారు. టునీషియాలోని కొత్త నగరం తరహాలో అభివృద్ధి.. చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాం బుల్ తరహా విధానాలను అవలంబిస్తామని వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పాల్గొన్నారు. -
కులీకుతూబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా?
హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నివసించే ఆంధ్రులు కూడా తమ బిడ్డలేనని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామన్నారు. మాట్లాడితే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు డప్పు కొట్టుకుంటారని.. అలాయితే కులీకుతూబ్ షా ఏంచేయాలి, ఆత్మహత్య చేసుకోవాలా అని వ్యంగ్యంగా అన్నారు. వర్షం పడితే సీఎం క్యాంపు ఆఫీసు, గవర్నర్ కార్యాలయం, సచివాలయం ముందు మోకాళ్ల లోతు నీళ్లు నిలబడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇదేనా అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. తాము రుణమాఫీ అమలు చేసి చూపించామని, చంద్రబాబు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. -
మనది.. మెట్రోదారి
►సిద్దిపేటకు ఆధునిక ‘సొబగులు’ ►బీఓటీ విధానంతో బస్‌షెల్టర్స్ ► పెట్టుబడి లేని శాశ్వత ఆదాయం ►సొంతగడ్డలో మంత్రి హరీష్ ప్రయోగం ఖర్చు చేయకూడదు..కానీ ప్రయాణికుల సౌకర్యార్థం బస్షెల్టర్లు నిర్మించాలి. అంతేకాదు మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవాలి. ఇలా ఆలోచించిన మున్సిపాలిటీ అధికారులకు వెంటనే హైదరాబాద్ గుర్తుకొచ్చింది. అక్కడి అధునాతన బస్షెల్టర్లు కళ్లముందు కనిపించాయి. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. పైసా ఖర్చుచేయకుండా కళకళలాడే బస్షెల్టర్ల నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఖజానా నింపుకునేందుకు కొత్తదారి వెత్తుకుంటున్నారు.. ఇంతకీ ఏం చేస్తున్నారం టారా... చదవండి మరి సిద్దిపేట జోన్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తరహాలో సిద్దిపేట మున్సిపాలిటి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మహా నగరాలకే పరిమితమైన అధునాతన బస్షెల్టర్ల సౌకర్యాన్ని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రయోగాత్మకంగా సిద్దిపేట పట్టణంలో అమలు పరుస్తున్నారు. ఆ దిశగా బీఓటీ (బిల్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్) విధానంతో పట్టణంలోని 11 ముఖ్య కూడళ్లలో సుందరమైన బస్షెల్టర్లను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సన్నద్ధమైంది. తొలివిడతలో ఐదు చోట్ల సుమారు రూ. 6 లక్షల వ్యయంతో షెల్టర్ల నిర్మాణానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని చోట్ల ఈ బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ఆలోచన వల్ల వాణిజ్య ప్రకటనల పన్ను రూపంలో పెట్టుబడి లేకుండానే మున్సిపాలిటీకి భారీ ఎత్తున ఆదాయం సమకూరడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాలు సమకూరనున్నాయి. మహానగరాల్లో మాదిరిగా... సిద్దిపేట పట్టణం జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందింది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో స్వచ్ఛంద సంస్థలు, ఆర్టీసీ, ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణంలోని ముఖ్య కూడళ్లలో పురాతన పద్ధతుల్లో బస్సు షెల్టర్ల నిర్మాణం జరిగేది. ఇందుకోసం మున్సిపాలిటీ తన సొంత నిధులు ఖర్చు చేసేది. అయితే మున్సిపాలిటీ అధికారులు మహానగరాల్లో మాదిరిగా అత్యంత ఆకర్షణీయంగా, అధునాతనంగా కొత్త పద్ధతుల్లో నిర్మిస్తున్న బస్సు షెల్టర్లను సిద్దిపేటలో నిర్మించాలని భావించారు. ఈ కొత్తరకం బస్ షెల్టర్ల వల్ల మహానగరాల్లో మాదిరే ఇక్కడ కూడా ప్రముఖ యాడ్ ఏజన్సీలు టెండర్లలో బస్షెల్టర్లను కైవసం చేసుకొని తమ వ్యాపార ప్రకటనల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయాన్ని అందిస్తాయని భావిస్తున్నారు. బీఓటీ విధానం ద్వారా షెల్టర్లు లక్ష పైచిలుకు జనాభా కలిగిన సిద్దిపేటకు నిత్యం మెదక్, నిజమాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి లక్ష జనాభా రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రయాణీకుల కోసం వేచి ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తూ, ప్రయాణికులకు నీడ కల్పించే లక్ష్యంతో మంత్రి హరీష్‌రావు పట్టణంలో మెట్రో తరహాలో బస్ షెల్టర్ల నిర్మాణానికి నాంధి పలికారు. మంత్రి సూచనల మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంబంధిత నిర్మాణ ప్రక్రియల ప్రణాళికలు, ప్రతిపాదనలను రూపొందించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యాడ్ ఏజెన్సీ టెండర్ల ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా కొనసాగే బీఓటీ పద్ధతిలో పట్టణంలో 11 చోట్ల బస్ షెల్టర్ల నిర్మాణానికి హక్కులను కైవసం చేసుకుంది. ప్రతి షెల్టర్‌కు రూ. 5 నుంచి రూ. 5.5 లక్షల మధ్య పెట్టుబడి పెట్టి 10 నుంచి 15 సంవత్సరాల పాటు మున్సిపల్ స్థలాన్ని ప్రముఖ యాడ్ ఏజెన్సీ లీజ్‌కు తీసుకోనుంది. దీని ద్వారా ప్రతి ఏటా మున్సిపాలిటీకి ప్రకటనల పన్ను రూపంలో ఒక్కో షెల్టర్‌కు రూ. 60 వేల చొప్పున ఆదాయం సమకూరుతుంది. బీఓటీ విధానంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి లక్షలాది ఆదాయం సమకూరడమే కాకుండా 15 సంవత్సరాల నిర్ణీత గడువు అనంతరం సంబంధిత బస్‌షెల్టర్లపై మున్సిపాలిటీకేపూర్తి హక్కులు రానున్నాయి. దీంతో పెట్టుబడి లేకుండానే దశాబ్ధ కాలం తర్వాత రూ. 60 లక్షల విలువైన నిర్మాణాలు మున్సిపాలిటీ సొంతం అవుతాయి. తొలి విడతలో ఐదుచోట్ల నిర్మాణం గత పక్షం రోజులుగా సిద్దిపేటలోని 11 ప్రధాన కూడళ్లను గుర్తించిన మున్సిపల్ అధికారులు, తొలి విడతలో ఐదు చోట్ల నిర్మాణాలకు ప్రముఖ యాడ్ కంపెనీకి అధికారాలు అప్పగించారు. ఈ క్రమంలోనే ముస్తాబాద్ చౌరస్తాలో రెండు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెండు, హౌసింగ్ బోర్డు వద్ద రెండు, ఎంపీడీఓ చౌరస్తా, నర్సాపూర్ చౌరస్తా, వేములవాడ కమాన్, కోటిలింగాలగుడి వద్ద గల ఒక్కొక్క బస్ షెల్టర్లు నిర్మించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కూడా ధ్రువీకరించారు. -
ఎన్ని ఎకరాలున్నాయ్?
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూముల స్వాధీనానికి ప్రభుత్వం.. ప్రస్తుతం హెచ్ఎండీఏ భూములపై దృష్టి సారించింది. గతంలో ఆ సంస్థకు కేటాయించిన భూమిలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉందనేది ఆరా తీసింది. ఇప్పటి వరకు వేలం ద్వారా ఎన్ని ఎకరాలు విక్రయించారు?, లీజుకి ఇచ్చిందెంత?, ఏ మేరకు లేఅవుట్లు అభివృద్ధి చేశారు?, కబ్జాకు గురైంది ఎంత?, ఏయే భూములపై కోర్టులో వివాదాలున్నాయి? తదితర వివరాలను వెంటనే సమర్పించాలంటూ సచివాలయం నుంచి హెచ్ఎండీఏకు ఆదేశాలందాయి. వెంటనే స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు పక్కాగా లెక్కలు తీశారు. రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు కంగుతిన్నారు. గతంలోనే కబ్జాకు గురైన అనేక భూములను సర్కార్ అధికారికంగా హెచ్ఎండీఏకు అప్పగించినట్లు గుర్తించారు. జవహర్‌నగర్, బుద్వేల్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ భూమి కబ్జాల చెరలో ఉంది. వాటినీ హెచ్ఎండీఏకు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండటంతో అధికారులు విస్తుపోయారు. కోకాపేట, మియాపూర్ ప్రాంతాల్లో ఇచ్చిన భూములదీ అదే పరిస్థితి. వివాదాల సుడిలో... హెచ్ఎండీఏకి మొదట్లో 5,354 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1,408 ఎకరాల 33 కుంటల భూమిని వివిధ అవసరాలకు వినియోగించగా, మరో 1975 ఎకరాల 32 కుంటల భూమి నిరుపయోగంగా ఉన్నట్లు రికా ర్డుల్లో ఉంది. హెచ్ఎండీఏకు అత్యధికంగా 1,970 ఎకరాలు జవహర్‌నగర్‌లోనే కేటాయించారు. ఇందులో 593 ఎకరాలు కబ్జా అయ్యాయి. 450 ఎకరాల్లో వ్యవసాయం, మరో 143 ఎకరాల్లో నివాసాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కేటాయించిన 3,384 ఎకరాల్లోనూ 1600 ఎకరాలపై కోర్టుల్లో వివాదాలున్నాయి. కోకాపేట్లో 499, మియాపూర్‌లో 550 ఎకరాలు కోర్టు వివాదంలో చిక్కుకొన్నాయి. వేలం ద్వారా 180 ఎకరాలు విక్రయించగా ఇందులో 110 ఎకరాలపై కోర్టు వివాదం నడుస్తోంది. మరో 161 ఎకరాలు వివిధ సంస్థలకు లీజ్‌కు ఇవ్వగా.. ఇందులో 130 ఎకరాలు భూ వివాదంలో చిక్కుకొన్నాయి. ఇప్పటి వరకూ 2,495 ఎకరాల్లో 25 వెంచర్లను అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ ఆ నిధులతో నగరాభివృద్ధి కోసం వినియోగించింది. మహేశ్వరం మండలం శ్రీనగర్‌లో హెచ్ఎండీఏ సొంతంగా కొనుగోలు చేసిన 190 ఎకరాలు, మూసాపేట ట్రక్‌టెర్మినల్ వద్ద కొనుగోలు చేసిన 35 ఎకరాలు మొత్తం 225 ఎకరాలు మాత్రమే ఇప్పుడు హెచ్ఎండీఏ వద్ద వివాద రహిత భూమి ఉంది. దీన్ని మినహాయిస్తే వివాదాల్లో ఉన్న భూమిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకొంటుందో చూడాల్సిందే. -
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొంది. అప్పుల ఊబి నుంచి సంస్థను బయటపడేస్తే చాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏదోవిధంగా నిధులు సమకూర్చుకుంటామని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ని ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తమ సర్కా రు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారుల్లో ఆరాటం మొదలైంది. నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏలో కొత్త ఆశలు రేకెత్తాయి. నూతన ప్రాజెక్టులకు నిధుల విషయంలో ప్రభుత్వ సాయం ఇతోధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలు త సంస్థను అప్పుల నుంచి బయటపడేయాలని అభ్యర్థిస్తున్నారు. కోకాపేటలో ప్రభుత్వ భూములు వేలం ద్వారా అమ్మిపెట్టినందుకు రూ. 700కోట్లు ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి రావడం సంస్థను ఆర్థికంగా కుంగదీసింది. ఇప్పటికే రూ.280కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏ మిగతా రూ.420కోట్లు బకాయి పడింది. ఇదిలా ఉండగా నిధుల్లేక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్, ఔటర్‌పై లాజిస్టిక్ పార్కులు, నగరంలో పలు ఫ్లైఓవర్లు, రేడియల్ రోడ్లు, తదితర ప్రాజెక్టులను అధికారులు నిలిపేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటికీ 33.3కి .మీ. అసంపూర్తిగా మిగిలిపోయిం ది. మహా నగరాభివృద్ధిపై ఓ విజన్‌తో ఉన్న కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోకపోతే ఆ సంస్థ భవితవ్యమే ప్రశ్నార్థకం కాగలదు. పీకల్లోతు అప్పుల్లో... సొంత భూములు విక్రయించడం ద్వారా సమకూరిన నిధులతో పాటు వివిధ బ్యాంకుల నుంచి రుణ ంగా తెచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించి హెచ్ఎండీఏ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ.1100కోట్ల రుణాల తాలూకు నెలకు రూ.8కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. నెలవారీ ఆదాయం మొత్తం వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతాలకు మినహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి లేదు. స్థలాల విక్రయాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని అధికారులు ప్రయత్నించినా అది సాధ్యమయ్యేలా లేదు. జలవనరుల సంరక్షణ, అభివృద్ధికి హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అమలుకు నిధుల కరువు. రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి నలువైపులా రైల్ టెర్మినళ్లు, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్ల అభివృద్ధి, నగర ట్రాఫిక్‌పై అధ్యయనానికి హెచ్ఎండీఏ నడుంబిగించినా నిధుల కొరత వెనక్కి లాగుతోంది. ఫలితంగా తన అభివృద్ధి ప్రణాళికను అమలులోకి తీసుకురాలేక సతమతమవుతోంది. నగరాభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఎండీఏకు మాత్రం ఇంతవరకు సొంతభవనం లేదు. నిర్మించుకోవాలన్న ప్రయత్నమూ బెడిసికొట్టడంతో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలను కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఆదుకుంటే తప్ప హెచ్ఎండీఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే సూచనలు కన్పించట్లేదు. -
ఆప్షన్..టెన్షన్
- ఉద్యోగుల ఆప్షన్లపై హెచ్ఎండీఏలో స్తబ్ధత - స్థానిక సంస్థ కావడంతో ఇప్పటికీ రాని స్పష్టత - డిప్యూటేషన్ సిబ్బందితోనే గందరగోళం సాక్షి,సిటీబ్యూరో : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ఉద్యోగుల ఆప్షన్లపై అయోమయం నెలకొంది. ఇది పూర్తిగా స్థానికసంస్థ కనుక దీనికి ఆప్షన్లు వర్తిస్తాయా...? లేదా..? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టతరాలేదు. హెచ్ఎండీఏలో సీమాంధ్రకు చెందిన సుమారు 50మంది ఉద్యోగులున్నారని, వారందరినీ ఇక్కడి నుంచి పంపించాలని తెలంగాణ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో దీనిపై పెద్దచర్చ నడుస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1975 అక్టోబర్ 2న హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీని పరిధిని మరింత విస్తరిస్తూ 2008 ఆగస్టు 24న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)గా ఉన్నతీకరించింది. ఈ సంస్థలో 350వరకు సొంత ఉద్యోగులుండగా, మరో 93 మంది వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చారు. హెచ్ఎండీఏకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 50మంది సీమాంధ్రకు చెందినవారుండగా, డిప్యూటేషన్‌పై వచ్చిన 93మందిలో ఎంతమంది తెలంగాణేతరులున్నది అస్పష్టంగా ఉంది. వీరి వివరాలేవీ హెచ్ఎండీఏ వద్ద లేకపోవడంతో అసలు సీమాంధ్రులు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్నది లెక్క తేలకుండా ఉంది. హెచ్ఎండీఏ, దాని పరిధిలోని ఔటర్‌రింగ్‌రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హెచ్సీఐపీ, హెచ్‌జీసీఎల్‌లో డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వాస్తవానికి 610 జీవో నిబంధనలకు లోబడి 2009లో 11మంది జూనియర్ ప్లానింగ్ అధికారు(జేపీవో)లను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యారు. వీరిలో ముగ్గురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాగా, 8 మంది తెలంగాణకు చెందినవారే. సీమాంధ్రకు చె ందిన ముగ్గురిలో ఒకరు గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఇక ఇద్దరు మాత్రమే స్థానికేతరులున్నట్లు లెక్కతేలింది. 610 జీవో ప్రకారం నియమితులైన వీరికి ఇప్పుడు ఆప్షన్లు ఉంటాయా ? ఉండవా..? అన్నది స్పష్టత లేకుండా ఉంది. గతంలో హుడాలో నియమితులైన సీమాంధ్ర ఉద్యోగుల్లో కూడా కొందరు పదవీవిరమణకు దగ్గరగా ఉన్నారు. హెచ్ఎండీఏ పూర్తిగా లోకల్‌బాడీ కిందకు వస్తుండడంతో ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవన్నది ఓ వాదన. అయితే జీహెచ్ఎంసీ,జలమండలి వంటి విభాగాల్లో ఆప్షన్లు అమలు చేస్తే అవి ఇక్కడ వర్తిస్తాయని మరోవైపూ వినిపిస్తోంది. అయితే లోకల్బాడీలలో స్టేట్‌కేడర్ పోస్టులకు మాత్రమే ఆప్షన్లు వర్తిస్థాయని, కిందిస్థాయి పోస్టులకు ఆప్షన్లు వర్తించవని అధికారవర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భవితవ్యం ప్రశ్నార్థకం : విభజన నేపథ్యంలో హెచ్ఎండీఏలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ ఉద్యోగజీవితం హుడాలోనే మొదలైందనీ..మాతృసంస్థలోనే పదవీవిరమణ చేస్తాం తప్ప మరో విభాగానికి వెళ్లే ప్రశ్నేలేదని స్పష్టంచేస్తున్నారు. ఇదిలావుంటే సీమాంధ్ర ప్రాంతం వారిని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లోని అర్బన్ డెవలప్మెంట్ అథార్టీలకు పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పడే.. హైదరాబాద్ అభివృద్ధి: విజయమ్మ
హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం: విజయమ్మ సాక్షి, విజయవాడ: ‘‘హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా తన సృష్టేనని టీడీపీ అధినేత చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆయన నిక్కర్లు వేసుకున్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలో ఐదో స్థానంలో ఉంది. 1956 సంవత్సరంలోనే హైదరాబాద్.. అభివృద్ధి చెం దిన ప్రాంతాల జాబితాలో ఉంది. రాష్ట్రంలో ఐటీ రంగం చంద్రబాబు రాక ముందు మూడో స్థానంలో ఉండగా, ఆయన వచ్చాక ఐదో స్థానానికి పడిపోయింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు చంద్రబాబు హయాంలో తొమ్మిది శాతం ఉంటే దివంగత వైఎస్సార్ హయాంలో 14శాతానికి పెరిగాయి. బాబు హయాంలో రాష్ట్రంలో 50వేల మందికి సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు వస్తే దివంగత వైఎస్సార్ హయాంలో 2.5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. మరి చంద్రబాబు నాయుడు తాను చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమం లో భాగంగా సోమవారం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని 22గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. -
నగర ప్రజా రవాణా వ్యవస్థకు నగిషీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజా రవాణా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టడీ(సీటీఎస్) ప్లాన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం(ఐటీఎస్) మాస్టర్ప్లాన్లను అమలు చేయనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. 2041 నాటికి మెట్రోపాలిటన్ ప్రాంతంలో జనాభా 1.90 కోట్లకు చేరే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని.. మెట్రో, బీఆర్టీఎస్, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ల వంటివి ఏమేరకు అభివృద్ధి చేయాలన్నది ఇందులో ఉన్నాయన్నారు. సమగ్ర రవాణా వ్యవస్థపై లీ అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ప్రణాళికను, ఐటీఎస్ మాస్టర్ప్లాన్లను తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో బుధవారం ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా నీరభ్‌కుమార్ మాట్లాడుతూ జనవరి 10 వరకు ఈ ప్రదర్శన ఉం టుందన్నారు. www.hmdagov.in, www.ctshm2011.comవెబ్సైట్ లలోనూ దీన్ని చూడవచ్చన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే వ్యక్తిగతంగా లేదాcts2041@ hmda.gov.in ఇ-మెయిల్ ద్వారాకూడా పంపవచ్చన్నారు. రానున్న 30 ఏళ్లలో రవాణా ప్రణాళిక అమలుకు రూ.1.25 లక్షల కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. -
బల్దియా పంచాయితీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనం రోజు కోమలుపు తిరుగుతోంది. పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా జిల్లాలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పాలకవర్గం కూడా తాజా విలీన ప్రక్రియను తప్పుపడుతూ తీర్మానం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. కౌన్సిల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 35 శివారు పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన సమావేశంలో తేల్చిచెప్పిన కౌన్సిల్.. ఈ పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని రూలింగ్ ఇచ్చింది. శివారు ప్రాంతాల విలీనంపై మొదట్నుంచి పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2007లో ఎంసీహెచ్‌ను మహానగర పాలక సంస్థగా మారుస్తూ శివార్లలోని పది పురపాలక సంఘాలను విలీనం చేశారు. అప్పట్లో ఈ విలీన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయకపోవడంలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న గ్రేటర్‌కు కొత్త ప్రాంతాలు గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో 35 శివారు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆగ్రహాన్ని తెప్పించింది. పంచాయతీల విలీనం కుదరదని గతంలో కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాలకవర్గం.. విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టవద్దని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగరాభివృద్ధిని పర్యవేక్షించే యంత్రాంగం.. కౌన్సిల్ కనుసన్నల్లో పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకూడదని కౌన్సిల్ తేల్చిచెప్పడం అధికారులను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక.. కౌన్సిల్ తీర్మానానికి విరుద్ధంగా ముందుకు సాగలేక సంకటస్థితిని ఎదుర్కొంటోంది. విలీన గ్రామాలకు కొత్తచిక్కు.. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో కొత్త పనులు చేపట్టలేదు. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు మరింత దిగజారాయి. నల్లా బిల్లులు సహా చిన్న పనులకు సైతం కొర్రీలు పెట్టడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు పాలకవర్గాలు లేకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. అంతలోనే 35 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలు గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడంతో 15 పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నిక లు జరుగుతాయనుకుంటున్న తరుణంలో వీటిని గ్రేటర్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విలీనమైన 35పంచాయతీల అభివృద్ధి బాధ్యత తమది కాదని కౌన్సిల్ తెగేసి చెప్పడంతో కొత్త చిక్కు వచ్చింది. అటు పంచాయతీరాజ్.. ఇటు పురపాలక శాఖలు పట్టించుకోకపోతే మా గ్రామాల సంగతేంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్లో పంచాయతీల విలీనంలో ప్రభుత్వ నిర్ణయంపై బుధవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశముంది. నార్సింగ్ జంక్షన్లో ఆందోళన.. తెలుగుదేశం పార్టీ ఈ నెల 19 నుంచి జిల్లా పరిషత్ ఆవరణలో తలపెట్టిన నిరసన దీక్షలకు ప్రభుత్వం అనుమతించలేదు. హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, ఆందోళనలపై నిషేధం కొనసాగుతున్న దృష్ట్యా.. వేదికను మార్చుకోవాలని సూచించింది. దీంతో రాజేంద్రనగర్ మండలం నార్సింగ్ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. నిరవధిక దీక్షలో తనతోపాటు ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. -
పడకేసిన పాలన
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో గ్రేటర్లో పలు ప్రభుత్వ విభాగాల్లో నిస్తేజం ఆవహించింది. రోజువారీగా జరిగే విధులకు ఆటంకం కలగనప్పటికీ.. పలు కీలక నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. ప్రజాప్రయోజనార్థం తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన ఫైళ్లు, కొత్త పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పలు సర్కారు కార్యాలయాల్లో శాఖాధిపతులు, ముఖ్య అధికారుల హాజరు తగ్గింది. హోరెత్తిన పోటాపోటీ నిరసనలు.. ఎన్జీఓల సమ్మె.. అధికారులు, సిబ్బంది బదిలీలు.. డిప్యుటేషన్లు.. నిధులు, వనరుల పంపిణీ.. తదితర అంశాలపై పలు కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల్లో పాలనా పరిస్థితులిలా ఉన్నాయి. మొక్కుబడిగా ‘మహా’ పాలన మహానగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల బదిలీలేచర్చనీయాంశంగా మారాయి. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు, విస్తరణ, గృహనిర్మాణం, ప్రజారోగ్యం, దోమల నివారణ, టౌన్‌ప్లానింగ్ తదితర ప్రజాప్రాధాన్యమున్న విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి. పలు అంశాలపై అధికారులు మొక్కుబడిగానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటకెక్కిన జలమండలి పనులు జలమండలిలో ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయాయి. పదోన్నతుల అంశంపై తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రోజువారీ పాలన, రెవెన్యూ ఆదాయంపై నామమాత్రంగా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు విభాగం పనులపై సమీక్షించే నాథుడే కరువయ్యారు. కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం, మూసీ ప్రక్షాళన రెండోదశ, జేఎన్ఎన్యూఆర్ఎం మాస్టర్ ప్లాన్ పనుల పురోగతిపై సమీక్షలు అటకెక్కాయి. రవాణా ఆదాయానికి బ్రేకులు గ్రేటర్ పరిధిలోని తొమ్మిది ఆర్టీఏ కార్యాల యాల పరిధిలో ట్రావెల్స్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు తదితర వాహనాలపై విస్తృత తనిఖీలు అటకెక్కాయి. జరిమానాల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గింది. నూతన లెసైన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. పలు కా ర్యాలయాల్లో సిబ్బంది హాజరు బాగా తగ్గింది. అమ్మహస్తానికి స్పందన కరువు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి జనం నుంచి స్పందన కరువైంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ పథకానికి ఆదరణ తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. హెచ్ఎండీఏలో స్తబ్దత హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో స్తబ్దత నెలకొంది. విభజన ప్రభావం రియల్ రంగంపై తీవ్రంగా ఉండడంతో కొత్త లేఅవుట్ అనుమతుల కోసం రియల్ వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. హెచ్ఎండీఏలో కీలక విభాగాల్లో అధికారుల హాజరు కూడా నామమాత్రం గానే ఉంది. ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు డెరైక్టర్ మినహా ఇతర అధికారులు సమావేశాలున్నాయంటూ ఆఫీసు వేళల్లోనే బయటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాల కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని.. కొంత మొత్తంలో డబ్బులు చెల్లించినవారు మిగతా మొత్తాన్ని చెల్లించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన తరవాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతోనే ఎవరూ ముం దుకు రావడం లేదు. భూ వినియోగమార్పిడి, భూ వినియోగ పత్రాల కోసం ఎవరూ హెచ్ఎండీఏ గడప తొక్కడం లేదు. ‘రెవెన్యూ’లో నిరసనలు జిల్లా రెవెన్యూ విభాగంలోనూ విభజన అంశంపై వాడీవేడిగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణకు మద్దతుగా పెద్దపెట్టున నినదించారు. మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు నిల్ సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం నగరంలో సామాన్యుల బతుకును భారంగా మార్చిం ది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రవాణా నిలిచిపోవడంతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు భగభగ మండుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.80, ఉల్లి రూ.70లకు చేరాయి. దాంతో పేద, సామాన్య వర్గాల ప్రజలు వాటిని కొని, తినలేని పరిస్థితి ఏర్పడింది. వీటి ప్రభావం మిగతా కూరగాయలపై కూడా పడింది. ఇప్పుడ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.30కి పైగా ధర పలుకుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూరగాయల కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన మార్కెటింగ్ శాఖ.. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణం. ఇదే అదనుగా భావించి వ్యాపారులు రెట్టింపు రేట్లతో వినియోగదారుడి జేబును పిండుకొంటున్నారు. ఎంజీబీఎస్ వెలవెల సీమాంధ్రలో ఏపీఎన్జీవోల సమ్మె నేపథ్యంలో మంగళవారం సీమాంధ్రకు వెళ్లాల్సిన సుమారు 1200 ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్‌లో సీమాంధ్ర ఫ్లాట్ఫారాలన్నీ ఖాళీగా కనిపించాయి. రోజువారీగా ఇక్కడి నుంచి ప్రయాణాలు సాగించే సుమారు 70 వేల మంది ప్రయాణికుల్లో కొందరు ప్రయాణాలను వాయిదా వేసుకోగా.. మరి కొందరు ప్రత్యామ్నాయ రవాణా సాధనాలను ఆశ్రయించారు. - న్యూస్‌లైన్, అఫ్జల్‌గంజ్ రైల్వేస్టేషన్లు కిటకిట బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో మంగళవారం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్లాట్ ఫామ్‌లు, వెయిటింగ్ రూమ్‌లు, జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి కనిపించారు. వివిధ రైళ్లలో రోజువారీగా వెళ్లే ప్రయాణికుల సంఖ్య కన్నా అదనంగా 30వేల మంది నగరం నుంచి తరలి వెళ్లినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నర్సాపూర్ ప్రాంతాలకు రిజర్వేషన్ వెయింటింగ్ లిస్ట్ సైతం చాంతాడంత పెరిగింది. - న్యూస్‌లైన్, సికింద్రాబాద్