ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూముల స్వాధీనానికి ప్రభుత్వం.. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ భూములపై దృష్టి సారించింది.
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూముల స్వాధీనానికి ప్రభుత్వం.. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ భూములపై దృష్టి సారించింది. గతంలో ఆ సంస్థకు కేటాయించిన భూమిలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉందనేది ఆరా తీసింది. ఇప్పటి వరకు వేలం ద్వారా ఎన్ని ఎకరాలు విక్రయించారు?, లీజుకి ఇచ్చిందెంత?, ఏ మేరకు లేఅవుట్లు అభివృద్ధి చేశారు?, కబ్జాకు గురైంది ఎంత?, ఏయే భూములపై కోర్టులో వివాదాలున్నాయి? తదితర వివరాలను వెంటనే సమర్పించాలంటూ సచివాలయం నుంచి హెచ్‌ఎండీఏకు ఆదేశాలందాయి. వెంటనే స్పందించిన హెచ్‌ఎండీఏ అధికారులు పక్కాగా లెక్కలు తీశారు.
రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు కంగుతిన్నారు. గతంలోనే కబ్జాకు గురైన అనేక భూములను సర్కార్ అధికారికంగా హెచ్‌ఎండీఏకు అప్పగించినట్లు గుర్తించారు. జవహర్‌నగర్, బుద్వేల్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ భూమి కబ్జాల చెరలో ఉంది. వాటినీ హెచ్‌ఎండీఏకు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండటంతో అధికారులు విస్తుపోయారు. కోకాపేట, మియాపూర్ ప్రాంతాల్లో ఇచ్చిన భూములదీ అదే పరిస్థితి.
వివాదాల సుడిలో...
హెచ్‌ఎండీఏకి మొదట్లో 5,354 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1,408 ఎకరాల 33 కుంటల భూమిని వివిధ అవసరాలకు వినియోగించగా, మరో 1975 ఎకరాల 32 కుంటల భూమి నిరుపయోగంగా ఉన్నట్లు రికా ర్డుల్లో ఉంది. హెచ్‌ఎండీఏకు అత్యధికంగా 1,970 ఎకరాలు జవహర్‌నగర్‌లోనే కేటాయించారు. ఇందులో 593 ఎకరాలు కబ్జా అయ్యాయి. 450 ఎకరాల్లో వ్యవసాయం, మరో 143 ఎకరాల్లో నివాసాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కేటాయించిన 3,384 ఎకరాల్లోనూ 1600 ఎకరాలపై కోర్టుల్లో వివాదాలున్నాయి.
కోకాపేట్‌లో 499, మియాపూర్‌లో 550 ఎకరాలు కోర్టు వివాదంలో చిక్కుకొన్నాయి. వేలం ద్వారా 180 ఎకరాలు విక్రయించగా ఇందులో 110 ఎకరాలపై కోర్టు వివాదం నడుస్తోంది. మరో 161 ఎకరాలు వివిధ సంస్థలకు లీజ్‌కు ఇవ్వగా.. ఇందులో 130 ఎకరాలు భూ వివాదంలో చిక్కుకొన్నాయి. ఇప్పటి వరకూ 2,495 ఎకరాల్లో 25 వెంచర్లను అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ ఆ నిధులతో నగరాభివృద్ధి కోసం వినియోగించింది.
మహేశ్వరం మండలం శ్రీనగర్‌లో హెచ్‌ఎండీఏ సొంతంగా కొనుగోలు చేసిన 190 ఎకరాలు, మూసాపేట ట్రక్‌టెర్మినల్ వద్ద కొనుగోలు చేసిన 35 ఎకరాలు మొత్తం 225 ఎకరాలు మాత్రమే ఇప్పుడు హెచ్‌ఎండీఏ వద్ద వివాద రహిత భూమి ఉంది. దీన్ని మినహాయిస్తే వివాదాల్లో ఉన్న భూమిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకొంటుందో చూడాల్సిందే.