హైదరాబాద్ లేకుండానైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేది
హైదరాబాద్: నగర పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని, ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ప్రధానంగా హైదరాబాద్పైనే చర్చజరిగిందని, తెలంగాణకు హైదరాబాద్ నగరాన్ని దక్కించుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు.
హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర నాయకులు అంగీకరించినా తాను అస్సలే ఒప్పుకోలేదని, హైదరాబాద్ లేని తెలంగాణ పన్నెండేళ్లకిందటే వచ్చేదని అన్నారు. చావు మీదకు తెచ్చుకొని హైదరాబాద్ దక్కించుకున్నామని సీఎం చెప్పారు. ఇలాంటి హైదరాబాద్ లో భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండాలని, అందుకోసం స్పష్టమైన విధానాలు రూపొందించుకోవాలని తెలిపారు. మరోపక్క, జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తసేకరణకు ఉపయోగించే ఆటో ట్రాలీ డిజైన్లకు కేసీఆర్ ఆమోదం చెప్పారు. ఇంటింటికీ సరఫరా చేసే బ్లూ, గ్రీన్ ప్లాస్టిక్ చెత్తబుట్టలను పరిశీలించారు.