ఆప్షన్..టెన్షన్
- ఉద్యోగుల ఆప్షన్లపై హెచ్‌ఎండీఏలో స్తబ్ధత
- స్థానిక సంస్థ కావడంతో ఇప్పటికీ రాని స్పష్టత
- డిప్యూటేషన్ సిబ్బందితోనే గందరగోళం
సాక్షి,సిటీబ్యూరో : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో ఉద్యోగుల ఆప్షన్లపై అయోమయం నెలకొంది. ఇది పూర్తిగా స్థానికసంస్థ కనుక దీనికి ఆప్షన్లు వర్తిస్తాయా...? లేదా..? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టతరాలేదు. హెచ్‌ఎండీఏలో సీమాంధ్రకు చెందిన సుమారు 50మంది ఉద్యోగులున్నారని, వారందరినీ ఇక్కడి నుంచి పంపించాలని తెలంగాణ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో దీనిపై పెద్దచర్చ నడుస్తోంది.
హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1975 అక్టోబర్ 2న హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీని పరిధిని మరింత విస్తరిస్తూ 2008 ఆగస్టు 24న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)గా ఉన్నతీకరించింది. ఈ సంస్థలో 350వరకు సొంత ఉద్యోగులుండగా, మరో 93 మంది వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చారు.
హెచ్‌ఎండీఏకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 50మంది సీమాంధ్రకు చెందినవారుండగా, డిప్యూటేషన్‌పై వచ్చిన 93మందిలో ఎంతమంది తెలంగాణేతరులున్నది అస్పష్టంగా ఉంది. వీరి వివరాలేవీ హెచ్‌ఎండీఏ వద్ద లేకపోవడంతో అసలు సీమాంధ్రులు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్నది లెక్క తేలకుండా ఉంది. హెచ్‌ఎండీఏ, దాని పరిధిలోని ఔటర్‌రింగ్‌రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హెచ్‌సీఐపీ, హెచ్‌జీసీఎల్‌లో డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగుల విషయంలోనే గందరగోళం నెలకొంది.
వాస్తవానికి 610 జీవో నిబంధనలకు లోబడి 2009లో 11మంది జూనియర్ ప్లానింగ్ అధికారు(జేపీవో)లను డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యారు. వీరిలో ముగ్గురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాగా, 8 మంది తెలంగాణకు చెందినవారే. సీమాంధ్రకు చె ందిన ముగ్గురిలో ఒకరు గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఇక ఇద్దరు మాత్రమే స్థానికేతరులున్నట్లు లెక్కతేలింది. 610 జీవో ప్రకారం నియమితులైన వీరికి ఇప్పుడు ఆప్షన్లు ఉంటాయా ? ఉండవా..? అన్నది స్పష్టత లేకుండా ఉంది.
గతంలో హుడాలో నియమితులైన సీమాంధ్ర ఉద్యోగుల్లో కూడా కొందరు పదవీవిరమణకు దగ్గరగా ఉన్నారు. హెచ్‌ఎండీఏ పూర్తిగా లోకల్‌బాడీ కిందకు వస్తుండడంతో ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవన్నది ఓ వాదన. అయితే జీహెచ్‌ఎంసీ,జలమండలి వంటి విభాగాల్లో ఆప్షన్లు అమలు చేస్తే అవి ఇక్కడ వర్తిస్తాయని మరోవైపూ వినిపిస్తోంది. అయితే లోకల్‌బాడీలలో స్టేట్‌కేడర్ పోస్టులకు మాత్రమే ఆప్షన్లు వర్తిస్థాయని, కిందిస్థాయి పోస్టులకు ఆప్షన్లు వర్తించవని అధికారవర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భవితవ్యం ప్రశ్నార్థకం : విభజన నేపథ్యంలో హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ ఉద్యోగజీవితం హుడాలోనే మొదలైందనీ..మాతృసంస్థలోనే పదవీవిరమణ చేస్తాం తప్ప మరో విభాగానికి వెళ్లే ప్రశ్నేలేదని స్పష్టంచేస్తున్నారు. ఇదిలావుంటే సీమాంధ్ర ప్రాంతం వారిని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లోని అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీలకు పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.