deputation staff
-
సీట్లకు అతుక్కుపోతారు
సాక్షి, హైదరాబాద్: అధికారి, సిబ్బంది హోదా ఆధారంగా డిప్యూటేషన్‌పై నిర్ణీత సమయం ఇతర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. పోలీస్ శాఖలోనూ ఇదే రీతిలో కొన్ని డిప్యూటేషన్ విభాగాలున్నాయి. కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు వరకు ఆయా విభాగాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తుంటారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై ర్యాంకు వరకు మూడేళ్లు, ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు రెండేళ్ల పాటు డిప్యూటేషన్‌పై పనిచేయాలని నిబంధనలున్నాయి. కానీ ఐదేళ్లు, ఆరేళ్లు కొందరైతే ఏకంగా ఏడేళ్ల పాటు డిప్యూటేషన్ విభాగంలోనే తిష్టవేస్తున్నారు. గడువు పూర్తి అయిన అధికారులు, సిబ్బందిని పంపించాల్సి ఉన్నా నిబంధనలు బేఖాతరు చేస్తూ కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా వీటిలో..: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), నేర పరిశోధన విభాగం (సీఐడీ), ఇంటెలిజెన్స్ (ఎస్ఐబీ, కౌంటర్‌సెల్, పొలిటికల్ ఇంటెలిజెన్స్), విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వాటర్ బోర్డు, ట్రాన్స్‌కో, హెచ్ఎండీఏ, ఆర్టీసీ.. ఇలా ప్రధానమైన విభాగాల్లో 800 మందికి పైగా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, మరో 260 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఏళ్ల పాటు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటే అక్కడ విధులు నిర్వర్తించాల్సిన వీరంతా లాబీయింగ్‌తో ఐదారేళ్ల నుంచి ఈ విభాగాల్లోనే పాతుకుపోయారు. ఈ విభాగాల్లో కొత్త వారికి అవకాశం రాకుండా చేస్తున్నారు. సీఐడీ, ఏసీబీ, ట్రాన్స్‌కో, వాటర్ బోర్డులోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. వీరిది మరో రకం బాధ.. డిప్యూటేషన్‌పై వెళ్లి ఏళ్ల పాటు ఉన్న మరికొందరి పరిస్థితి వేరేలా ఉంది. ఇతర విభాగాలకు వెళ్లేందుకు వీరు ఎంత ప్రయత్నించినా అధికారులు రిలీవ్ చేయకపోవడం విచిత్రం. సబ్ఇన్స్పెక్టర్గా డిప్యూటేషన్‌పై వెళ్లి ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందినా కూడా అక్కడే కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి రాజకీయ పరపతితో పోస్టింగ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, అందుకు తగ్గట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పోస్టింగ్స్ అవసరం లేదని, ఇదే డిప్యూటేషన్‌లో కొనసాగడమే మంచిదని కొందరు ఇన్స్పెక్టర్లు భావిస్తున్నారు. మూలుగుతున్న వేలాది ఫైళ్లు.. జిల్లాలు, కమిషనరేట్లలో డిప్యూటేషన్ ఆఫర్ వచ్చి రిలీవ్ అయ్యేందుకు వేల మంది సిబ్బంది ఎదురు చూస్తున్నారు. రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలో వందలాది సిబ్బందికి సంబంధించి రిలీవింగ్ ఫైళ్లు వెయిటింగ్లో ఉన్నాయి. డిప్యూటేషన్‌కు ఆఫర్ వచ్చినా వాళ్లను రిలీవ్ చేయడంతో పాటు ఏళ్లుగా డిప్యూటేషన్ విభాగాల్లో తిష్టవేసిన సిబ్బంది, అధికారులను మాతృ సంస్థల్లోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. కమిషనరేట్ల పరిధిలో ఇంటెలిజెన్స్, ఏసీబీ, సీఐడీతో పాటు ఇతర విభాగాలకు రిలీవింగ్ ఆదేశాలివ్వాలని కాళ్లరిగేలా తిరిగినా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యాశాఖలో డెప్యుటేషన్ల గోల..!
సాక్షి, మచిలీపట్నం: ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం జిల్లా విద్యాశాఖలో కుదిపేస్తోంది. పాఠశాలల్లో అవసరం అనే పేరుతో కొంతమంది ఉపాధ్యాయులకు డెప్యుటేషన్ పేరిట ఇస్తున్న వర్క్ ఆర్డర్లు ఎవరికోసమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి పదోన్నతుల్లో భాగంగా కొత్తగా ఉపాధ్యాయులు వచ్చి చేరినప్పటకీ, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని ఇంకా అదే చోట కొనసాగిస్తుండటం విద్యాశాఖ పనితీరును ఎత్తిచూపిస్తోంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై, విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నప్పటకీ, జిల్లా విద్యాశాఖలో ఇంకా పాత విధానాలే అమలు అవుతున్నాయి. నూతన ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ నియామకాలు, పదోన్నతుల పర్వానికి పచ్చజెండా ఊపారు. ఇదే క్రమంలో జిల్లా విద్యాశాఖలో ఎస్జీటీల నంచి స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందారు. దీంతో జిల్లాలో సుమారుగా 330 సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్ పోస్టులు ఖాళీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. డీఈఓ పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సర్దుబాట్లు చేయాలనే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా వచ్చిన ఆదేశాలతో డీఈఓ కార్యాలయ అధికారులు అడ్డదారులకు తెరతీసినట్లుగా విమర్శలొస్తున్నాయి. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు.. విద్యార్థులు లేరనే సాకుతో టీడీపీ ప్రభుత్వం 2017లో చేపట్టిన రేషనలైజేషన్‌లో భాగంగా కొన్ని పాఠశాలలు పడగా, 53 మంది ఉపాధ్యాయులను పోస్టింగ్‌లు లేకుండా గాల్లో(డీఈఓ పూల్‌లో) ఉంచారు. అయితే జిల్లాలో ఖాళీ స్థానాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వగా, కొంతమందిని అవసరాల పేరుతో మరో పాఠశాలల్లో విధులు నిర్వహించేలా సర్దుబాటు చేశారు. వేతనాలు పొందేందుకు ఇదే వారికి సమస్యగా మారింది. డ్యూటీ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలనే దానిపై స్పష్టత లేకపోవటంతో చాలా మందికి సకాలంలో వేతనాలు రాని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలను మూసి వేసేందుకు శ్రద్ధ చూపిన అప్పటి టీడీపీ ప్రభుత్వం వీరికి శాశ్వత పోస్టుల్లో నియమించేందకు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవటంతో శాశ్వత పోస్టింగ్ కోసమని వీరికి రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పలేదు. ఇవేం సర్దుబాట్లు.. పదోన్నతులు ఇచ్చి ఇరువై రోజులకు పైగానే అవుతుంది. కానీ చాలా చోట్ల డెప్యుటేషన్లపై గతంలో పనిచేసిన వారు ఇంకా కొనసాగుతున్నారు. గతంలో సర్దుబాట్లు పేరుతో విద్యాశాఖాధికారులు చేసిన డెప్యూటేషన్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ తాజాగా అడ్డగోలు డెప్యుటేషన్లకు తెరతీస్తున్నట్లుగా తెలిసింది. అవసరం అనే సాకును చూపి డీఈఓను సైతం మాయజేసి, ఇక్కడి కొంతమంది సిబ్బంది చేస్తున్న పనులు పాలనకు మచ్చతెచ్చిపెడుతుంది. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెంలో పీఈటీ ఉండగా, ఇటీవల ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు ఉపాధ్యాయుడు వచ్చారు. కానీ ఇక్కడ ఇంకా అదే స్థానంలో సీఆర్పీని కొనసాగిస్తున్నారు . గూడూరు మండలం మళ్లవోలులో పీడీ, పీఈటీ ఉన్నారు. ఇక్కడ వలంటీర్ ఉన్నారు. పెనుమలూరు మండలం యనమలకుదరు బీసీ కాలనీ స్కూల్లో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఒక్క పోస్టులో ఏడాది కాలంగా ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులు డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. రామవరప్పాడు మెయిన్ పాఠశాలలో ఎనిమిది పోస్టులకు గాను, ప్రస్తుతం ఏడుగురు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి పాఠశాల నిర్వహణకు ఇబ్బందేమీ లేకపోయినా ఓ ఉపాధ్యాయురాలిని డెప్యూటేషన్‌పై నియమించారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి బంధువు కావటం గమనార్హం. కలిదిండి మండలం భాస్కరరావు పేట జెడ్పీహెచ్ఎస్ నుంచి ఫిజికల్ సైన్సు బోధన కోసమని కాటూరుకు డిప్యుటేషన్‌పై నియమించారు. ఇటీవల పదోన్నతుల్లో కాటూరు పోస్టు భర్తీ అయింది. కానీ గతంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అదే చోట ఇంకా కొనసాగిస్తున్నారు. డీఈఓ పూల్‌లో ఉన్న వారికి న్యాయం చేయాలి డీఈఓ పూల్‌లో ఉన్న వారిని శాశ్వత పోస్టుల్లో వెంటనే నియమించాలి. అవసరం లేని చోట సర్దుబాటు పేరుతో ఇచ్చిన డెప్యుటేషన్లను రద్దు చేయాలి. ఉపాధ్యాయులు ఎక్కడ అవసరమనేది పక్కాగా గుర్తించి సర్దుబాట్లు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యాశాఖాధికారులు దానిపై దృష్టి పెట్టాలి. –ఎస్పీ మనోహర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సబ్జెక్టు టీచర్లను బోధనకే ఉపయోగించాలి సబ్జెక్టు టీచర్లను కార్యాలయ పనుల కోసమని డెప్యుటేషన్లను వేయటం సరైంది కాదు. విద్యార్థులకు మేలు చేసే పనులకు సంఘం మద్దతు తెలుపుతాం. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నాం. –మిర్జా హుస్సేన్, వైఎస్సార్ టీఎఫ్ ,రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వివరాలను పరిశీలిస్తున్నాం పాఠశాలల వారీగా ఖాళీలు, డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను తెప్పించుకుంటున్నాం. వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని జిల్లాలోని డెప్యూటీ డీఈఓ, ఎంఈవోలందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవసరం మేరకే డిప్యుటేషన్లు వేస్తున్నాం. డీఈఓ పూల్‌లో ఉన్న వారందరికీ శాశ్వత పోస్టులను కేటాయించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది. –ఎంవీ రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి -
ఆప్షన్..టెన్షన్
- ఉద్యోగుల ఆప్షన్లపై హెచ్ఎండీఏలో స్తబ్ధత - స్థానిక సంస్థ కావడంతో ఇప్పటికీ రాని స్పష్టత - డిప్యూటేషన్ సిబ్బందితోనే గందరగోళం సాక్షి,సిటీబ్యూరో : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ఉద్యోగుల ఆప్షన్లపై అయోమయం నెలకొంది. ఇది పూర్తిగా స్థానికసంస్థ కనుక దీనికి ఆప్షన్లు వర్తిస్తాయా...? లేదా..? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టతరాలేదు. హెచ్ఎండీఏలో సీమాంధ్రకు చెందిన సుమారు 50మంది ఉద్యోగులున్నారని, వారందరినీ ఇక్కడి నుంచి పంపించాలని తెలంగాణ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో దీనిపై పెద్దచర్చ నడుస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1975 అక్టోబర్ 2న హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీని పరిధిని మరింత విస్తరిస్తూ 2008 ఆగస్టు 24న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)గా ఉన్నతీకరించింది. ఈ సంస్థలో 350వరకు సొంత ఉద్యోగులుండగా, మరో 93 మంది వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చారు. హెచ్ఎండీఏకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 50మంది సీమాంధ్రకు చెందినవారుండగా, డిప్యూటేషన్‌పై వచ్చిన 93మందిలో ఎంతమంది తెలంగాణేతరులున్నది అస్పష్టంగా ఉంది. వీరి వివరాలేవీ హెచ్ఎండీఏ వద్ద లేకపోవడంతో అసలు సీమాంధ్రులు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్నది లెక్క తేలకుండా ఉంది. హెచ్ఎండీఏ, దాని పరిధిలోని ఔటర్‌రింగ్‌రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హెచ్సీఐపీ, హెచ్‌జీసీఎల్‌లో డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వాస్తవానికి 610 జీవో నిబంధనలకు లోబడి 2009లో 11మంది జూనియర్ ప్లానింగ్ అధికారు(జేపీవో)లను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యారు. వీరిలో ముగ్గురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాగా, 8 మంది తెలంగాణకు చెందినవారే. సీమాంధ్రకు చె ందిన ముగ్గురిలో ఒకరు గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఇక ఇద్దరు మాత్రమే స్థానికేతరులున్నట్లు లెక్కతేలింది. 610 జీవో ప్రకారం నియమితులైన వీరికి ఇప్పుడు ఆప్షన్లు ఉంటాయా ? ఉండవా..? అన్నది స్పష్టత లేకుండా ఉంది. గతంలో హుడాలో నియమితులైన సీమాంధ్ర ఉద్యోగుల్లో కూడా కొందరు పదవీవిరమణకు దగ్గరగా ఉన్నారు. హెచ్ఎండీఏ పూర్తిగా లోకల్‌బాడీ కిందకు వస్తుండడంతో ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవన్నది ఓ వాదన. అయితే జీహెచ్ఎంసీ,జలమండలి వంటి విభాగాల్లో ఆప్షన్లు అమలు చేస్తే అవి ఇక్కడ వర్తిస్తాయని మరోవైపూ వినిపిస్తోంది. అయితే లోకల్బాడీలలో స్టేట్‌కేడర్ పోస్టులకు మాత్రమే ఆప్షన్లు వర్తిస్థాయని, కిందిస్థాయి పోస్టులకు ఆప్షన్లు వర్తించవని అధికారవర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భవితవ్యం ప్రశ్నార్థకం : విభజన నేపథ్యంలో హెచ్ఎండీఏలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ ఉద్యోగజీవితం హుడాలోనే మొదలైందనీ..మాతృసంస్థలోనే పదవీవిరమణ చేస్తాం తప్ప మరో విభాగానికి వెళ్లే ప్రశ్నేలేదని స్పష్టంచేస్తున్నారు. ఇదిలావుంటే సీమాంధ్ర ప్రాంతం వారిని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లోని అర్బన్ డెవలప్మెంట్ అథార్టీలకు పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.