సీట్లకు అతుక్కుపోతారు | Staff In The Deputation Department | Sakshi
Sakshi News home page

సీట్లకు అతుక్కుపోతారు

Published Fri, Nov 26 2021 4:45 AM | Last Updated on Fri, Nov 26 2021 4:45 AM

Staff In The Deputation Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారి, సిబ్బంది హోదా ఆధారంగా డిప్యూటేషన్‌పై నిర్ణీత సమయం ఇతర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. పోలీస్‌ శాఖలోనూ ఇదే రీతిలో కొన్ని డిప్యూటేషన్‌ విభాగాలున్నాయి. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు వరకు ఆయా విభాగాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తుంటారు. కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై ర్యాంకు వరకు మూడేళ్లు, ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారులు రెండేళ్ల పాటు డిప్యూటేషన్‌పై పనిచేయాలని నిబంధనలున్నాయి.

కానీ ఐదేళ్లు, ఆరేళ్లు కొందరైతే ఏకంగా ఏడేళ్ల పాటు డిప్యూటేషన్‌ విభాగంలోనే తిష్టవేస్తున్నారు. గడువు పూర్తి అయిన అధికారులు, సిబ్బందిని పంపించాల్సి ఉన్నా నిబంధనలు బేఖాతరు చేస్తూ కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. 

ప్రధానంగా వీటిలో..: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), నేర పరిశోధన విభాగం (సీఐడీ), ఇంటెలిజెన్స్‌ (ఎస్‌ఐబీ, కౌంటర్‌సెల్, పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, వాటర్‌ బోర్డు, ట్రాన్స్‌కో, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ.. ఇలా ప్రధానమైన విభాగాల్లో 800 మందికి పైగా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, మరో 260 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఏళ్ల పాటు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు.

నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటే అక్కడ విధులు నిర్వర్తించాల్సిన వీరంతా లాబీయింగ్‌తో ఐదారేళ్ల నుంచి ఈ విభాగాల్లోనే పాతుకుపోయారు. ఈ విభాగాల్లో కొత్త వారికి అవకాశం రాకుండా చేస్తున్నారు. సీఐడీ, ఏసీబీ, ట్రాన్స్‌కో, వాటర్‌ బోర్డులోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. 

వీరిది మరో రకం బాధ.. 
డిప్యూటేషన్‌పై వెళ్లి ఏళ్ల పాటు ఉన్న మరికొందరి పరిస్థితి వేరేలా ఉంది. ఇతర విభాగాలకు వెళ్లేందుకు వీరు ఎంత ప్రయత్నించినా అధికారులు రిలీవ్‌ చేయకపోవడం విచిత్రం. సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా డిప్యూటేషన్‌పై వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతి పొందినా కూడా అక్కడే కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి రాజకీయ పరపతితో పోస్టింగ్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, అందుకు తగ్గట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పోస్టింగ్స్‌ అవసరం లేదని, ఇదే డిప్యూటేషన్‌లో కొనసాగడమే మంచిదని కొందరు ఇన్‌స్పెక్టర్లు భావిస్తున్నారు. 

మూలుగుతున్న వేలాది ఫైళ్లు.. 
జిల్లాలు, కమిషనరేట్లలో డిప్యూటేషన్‌ ఆఫర్‌ వచ్చి రిలీవ్‌ అయ్యేందుకు వేల మంది సిబ్బంది ఎదురు చూస్తున్నారు. రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలో వందలాది సిబ్బందికి సంబంధించి రిలీవింగ్‌ ఫైళ్లు వెయిటింగ్‌లో ఉన్నాయి. డిప్యూటేషన్‌కు ఆఫర్‌ వచ్చినా వాళ్లను రిలీవ్‌ చేయడంతో పాటు ఏళ్లుగా డిప్యూటేషన్‌ విభాగాల్లో తిష్టవేసిన సిబ్బంది, అధికారులను మాతృ సంస్థల్లోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. కమిషనరేట్ల పరిధిలో ఇంటెలిజెన్స్, ఏసీబీ, సీఐడీతో పాటు ఇతర విభాగాలకు రిలీవింగ్‌ ఆదేశాలివ్వాలని కాళ్లరిగేలా తిరిగినా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement