
పడకేసిన పాలన
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో గ్రేటర్‌లో పలు ప్రభుత్వ విభాగాల్లో నిస్తేజం ఆవహించింది. రోజువారీగా జరిగే విధులకు ఆటంకం కలగనప్పటికీ.. పలు కీలక నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. ప్రజాప్రయోజనార్థం తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన ఫైళ్లు, కొత్త పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పలు సర్కారు కార్యాలయాల్లో శాఖాధిపతులు, ముఖ్య అధికారుల హాజరు తగ్గింది. హోరెత్తిన పోటాపోటీ నిరసనలు.. ఎన్‌జీఓల సమ్మె.. అధికారులు, సిబ్బంది బదిలీలు.. డిప్యుటేషన్లు.. నిధులు, వనరుల పంపిణీ.. తదితర అంశాలపై పలు కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల్లో పాలనా పరిస్థితులిలా ఉన్నాయి.
మొక్కుబడిగా ‘మహా’ పాలన
మహానగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల బదిలీలేచర్చనీయాంశంగా మారాయి. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు, విస్తరణ, గృహనిర్మాణం, ప్రజారోగ్యం, దోమల నివారణ, టౌన్‌ప్లానింగ్ తదితర ప్రజాప్రాధాన్యమున్న విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి. పలు అంశాలపై అధికారులు మొక్కుబడిగానే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అటకెక్కిన జలమండలి పనులు
జలమండలిలో ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయాయి. పదోన్నతుల అంశంపై తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రోజువారీ పాలన, రెవెన్యూ ఆదాయంపై నామమాత్రంగా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు విభాగం పనులపై సమీక్షించే నాథుడే కరువయ్యారు. కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం, మూసీ ప్రక్షాళన రెండోదశ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం మాస్టర్ ప్లాన్ పనుల పురోగతిపై సమీక్షలు అటకెక్కాయి.
రవాణా ఆదాయానికి బ్రేకులు
గ్రేటర్ పరిధిలోని తొమ్మిది ఆర్టీఏ కార్యాల యాల పరిధిలో ట్రావెల్స్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు తదితర వాహనాలపై విస్తృత తనిఖీలు అటకెక్కాయి. జరిమానాల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గింది. నూతన లెసైన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. పలు కా ర్యాలయాల్లో సిబ్బంది హాజరు బాగా తగ్గింది.
అమ్మహస్తానికి స్పందన కరువు
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి జనం నుంచి స్పందన కరువైంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ పథకానికి ఆదరణ తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
హెచ్‌ఎండీఏలో స్తబ్దత
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో స్తబ్దత నెలకొంది. విభజన ప్రభావం రియల్ రంగంపై తీవ్రంగా ఉండడంతో కొత్త లేఅవుట్ అనుమతుల కోసం రియల్ వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. హెచ్‌ఎండీఏలో కీలక విభాగాల్లో అధికారుల హాజరు కూడా నామమాత్రం గానే ఉంది. ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు డెరైక్టర్ మినహా ఇతర అధికారులు సమావేశాలున్నాయంటూ ఆఫీసు వేళల్లోనే బయటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాల కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని.. కొంత మొత్తంలో డబ్బులు చెల్లించినవారు మిగతా మొత్తాన్ని చెల్లించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన తరవాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతోనే ఎవరూ ముం దుకు రావడం లేదు. భూ వినియోగమార్పిడి, భూ వినియోగ పత్రాల కోసం ఎవరూ హెచ్‌ఎండీఏ గడప తొక్కడం లేదు.
‘రెవెన్యూ’లో నిరసనలు
జిల్లా రెవెన్యూ విభాగంలోనూ విభజన అంశంపై వాడీవేడిగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణకు మద్దతుగా పెద్దపెట్టున నినదించారు.
మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు నిల్
సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం నగరంలో సామాన్యుల బతుకును భారంగా మార్చిం ది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రవాణా నిలిచిపోవడంతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు భగభగ మండుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.80, ఉల్లి రూ.70లకు చేరాయి. దాంతో పేద, సామాన్య వర్గాల ప్రజలు వాటిని కొని, తినలేని పరిస్థితి ఏర్పడింది. వీటి ప్రభావం మిగతా కూరగాయలపై కూడా పడింది. ఇప్పుడ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.30కి పైగా ధర పలుకుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూరగాయల కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన మార్కెటింగ్ శాఖ.. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణం. ఇదే అదనుగా భావించి వ్యాపారులు రెట్టింపు రేట్లతో వినియోగదారుడి జేబును పిండుకొంటున్నారు.
ఎంజీబీఎస్ వెలవెల
సీమాంధ్రలో ఏపీఎన్జీవోల సమ్మె నేపథ్యంలో మంగళవారం సీమాంధ్రకు వెళ్లాల్సిన సుమారు 1200 ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్‌లో సీమాంధ్ర ఫ్లాట్‌ఫారాలన్నీ ఖాళీగా కనిపించాయి. రోజువారీగా ఇక్కడి నుంచి ప్రయాణాలు సాగించే సుమారు 70 వేల మంది ప్రయాణికుల్లో కొందరు ప్రయాణాలను వాయిదా వేసుకోగా.. మరి కొందరు ప్రత్యామ్నాయ రవాణా సాధనాలను ఆశ్రయించారు. - న్యూస్‌లైన్, అఫ్జల్‌గంజ్
రైల్వేస్టేషన్లు కిటకిట
బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో మంగళవారం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్లాట్ ఫామ్‌లు, వెయిటింగ్ రూమ్‌లు, జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి కనిపించారు. వివిధ రైళ్లలో రోజువారీగా వెళ్లే ప్రయాణికుల సంఖ్య కన్నా అదనంగా 30వేల మంది నగరం నుంచి తరలి వెళ్లినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నర్సాపూర్ ప్రాంతాలకు రిజర్వేషన్ వెయింటింగ్ లిస్ట్ సైతం చాంతాడంత పెరిగింది.
- న్యూస్‌లైన్, సికింద్రాబాద్