కొద్ది నెలలుగా ఆశాజనకంగా ధరలు
ఏప్రిల్‌లో గరిష్టంగా కిలో రూ.90
ఏరువాకతో మారనున్న కౌలు ఒప్పందాలు
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్‌ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్‌కు వెళుతుంటారు.
తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్‌కతా, ఢిల్లీ, కాన్పూర్‌కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది.
నికరమైన ఆదాయం
నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి.
ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది.
ఈ ఏడాది భేషుగ్గా...
గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్‌లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్‌లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది.
ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు.
గతంలో తీవ్ర నష్టాలు
లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్‌లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్‌లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు.
మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.
కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం
కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.
మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు
నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి
Comments
Please login to add a commentAdd a comment