
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిమ్మకాయల ధర అమాంతం పెరిగింది. గతంలో రిటైల్ మార్కెట్లలో రెండు రూపాయలకు ఒకటి చొప్పున లభించగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ ఏకంగా 7 రూపాయల ధర పలుకుతోంది. వేసవికితోడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిమ్మకాయల వాడకం అనూహ్యంగా పెరగ్గా డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా జరగట్లేదు. దీంతో నిమ్మ ధరలు పెరిగాయి.
కరోనాతో పెరిగిన వాడకం...
సీ విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయ వాడకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందని వైద్యులు పేర్కొనడంతో ప్రజలు నిమ్మకాయలకు విరివిగా వినియోగిస్తున్నారు. నిత్యం నీటిలో కలిపిన నిమ్మరసం తాగడం లేదా తేనె, పసుపుతో కలిపి నిమ్మరసం తాగుతున్నారు. దీంతో గతేడాది నుంచి నిమ్మకాయల వినియోగం పెరిగింది.
అయితే ఈ నెలలోనే నిమ్మ ధర దాదాపు రూ.7 పలుకుతుండగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులంటున్నారు. మేలో వేసవి తీవ్రత పెరగనుండటం, వివాహాల వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో నిమ్మకాయల ధరలు మరింత పెరగొచ్చని వారు చెబుతున్నారు.
ఇక్కడ చదవండి:
3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే
Comments
Please login to add a commentAdd a comment