రూ.32కే టమోటా
‘మన కూరగాయల’ ద్వారా విక్రయం
రైతుబజార్లలో అందుబాటులో..
మందస్తు ప్రచారం చేయని మార్కెటింగ్ శాఖ
సిటీబ్యూరో: అననుకూల వాతావరణ పరిస్థితులు... పంట సీజన్ ముగింపు కారణంగా టమోటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే కేజీ ధర రూ.60-70కు చేరుకుంది. ఈ ధరలను అదుపులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ నేరుగా రంగంలోకి దిగింది. రైతుబ జార్లలోని ‘మన కూరగాయల’ కౌంటర్ వద్ద కిలో టమోటా రూ.32కు విక్రయిస్తోంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు అధికారులు ‘తక్కువ ధరపై టమోటా’ పథకాన్ని బుధవారం నుంచి నగరంలోని అన్ని రైతుబజార్లలో ప్రారంభించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70 ధర పలుకుతుండగా... రైతుబజార్‌లో రూ.43కు విక్రయిస్తున్నారు. మన కూరగాయల కౌంటర్‌లో కేజీ రూ.32కే లభిస్తుండటంతో బుధవారం కొనుగోలుదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వచ్చిన సరుకంతా 3 గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయింది.
ముందస్తు ప్రచారమేదీ?
రైతుబజార్లలో తక్కువ ధరకు టమోటాను విక్రయిస్తున్నట్లు అధికారులు ముందస్తు ప్రచారం చేయకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నిజానికి టమోటా ధరల అదుపునకు అధికారులు కృషి చేస్తుంటే... ఎక్కడ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగా తెలియజేయాలి. ఈ విషయాన్ని అధికారులు గాలికి వదిలేశారు. కేవలం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకే ఒక్కో రైతుబజార్‌కు స్వల్పంగా 5-10 క్వింటాళ్ల టమోటా సరఫరా చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనకూరగాయల స్టాళ్ల వద్ద టమోటా ధర తక్కువన్న విషయం తెలియక చాలామంది వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లించి రైతుబజార్లు, రిటైల్ మార్కెట్లలో కొనుగోలు చేసి నష్టపోయారు.