Andhra Pradesh: Farmers Suffer Heavy Losses as Lemon Prices - Sakshi
Sakshi News home page

నిండా ముంచిన నిమ్మ

Published Fri, Nov 5 2021 10:19 AM | Last Updated on Fri, Nov 5 2021 12:07 PM

Andhra Farmers Suffer Heavy Losses as Lemon Prices - Sakshi

సాక్షి, టి.నరసాపురం(పశ్చిమగోదావరి): ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన నిమ్మ ఇప్పుడు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మూడేళ్లుగా నిమ్మ రైతులు నష్టాలతో విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందిన నిమ్మ రైతుకు నేడు సాగుఖర్చులు కూడా రాని పరిస్థితి.. కోత ఖర్చులు కూడా రావడం లేదని నిమ్మ రైతు వాపోతున్నాడు.  

కిలో కనీసం రూ. 25 ఉంటేనే లాభం 
కరోనా దెబ్బతో మూడేళ్లుగా నిమ్మ రైతుకు మార్కెట్‌లో సరైన ధర లభించడం లేదు. కిలో నిమ్మ ధర రూ. 4 నుంచి రూ. 5 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సగటున కిలో రూ. 25 నుంచి రూ. 30 ఉంటేనే రైతుకు లాభం. ఈ నేపథ్యంలో నిమ్మ పంటను కొనసాగించాలా.. తొలగించాలా అన్నది తేల్చుకోలేని సందిగ్ధంలో రైతులున్నారు. నిమ్మపై విసుగెత్తిన రైతు పామాయిల్‌ వైపు మొగ్గుతున్నాడు. నిమ్మ సేద్యానికి ఎకరానికి ఎరువులు, తీత, పాదులు చేయడం, ఎరువుల ఖర్చు, నీటి తడులు, కూలీల ఖర్చు వంటివి కలిపి ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. నాటురకం నిమ్మ, బాలాజీ నిమ్మ, పెట్లూరి నిమ్మలు సేద్యంలో ఉన్నాయి. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు కౌలు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో నిమ్మకు ధరలేక కౌలు చెల్లించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు.  

చదవండి: (పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’)


ఏటా 1.93 లక్షల టన్నుల పంట  
పశ్చిమ గోదావరి జిల్లాలో 9 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగుచేస్తున్నారు. ఏటా 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తవుతోంది. ఈ పంటంతా జిల్లాలోని ఏలూరు, గోపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, యాదవోలులోని నిమ్మ మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. నిమ్మకు ధరలేకపోతే చెట్టుకు కాయను అలాగే వదిలేసే పరిస్థితిలేదు. కాయ కోయకపోయినా రైతు నష్టపోతాడు. దీంతో విధిగా కాయను బయటకు చేర్చాల్సి వస్తోంది. నిమ్మపండును కోయకుండా వదిలేస్తే చెట్ల కిందే రాలి నిమ్మ అక్కడే కుళ్లిపోతుంది. అందులోని సిట్రిక్‌ యాసిడ్‌ ప్రభావంతో చెట్టు చనిపోతుంది. దాంతో చెట్టును కాపాడుకోవడానికి నిమ్మకాను కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది. నిమ్మ కిలో రూ. 7 నుంచి రూ. 10 ఉంటే కనీసం కాయ కోసిన ఖర్చు, ఎగుమతి, దిగుమతి ఖర్చు, రవాణా ఖర్చులు వస్తాయి. నిమ్మకు ఏటా రెండు నుంచి మూడు నెలలే డిమాండ్‌ ఉంటుంది. కరోనా దెబ్బకు ఆ డిమాండ్‌ కూడా పడిపోయింది.
  
సాగు ఖర్చులు రావడం లేదు 

గత మూడు సంవత్సరాలుగా నిమ్మ సాగు చేస్తున్న రైతులందరూ ధర లేక నష్టపోతున్నాం. సేద్యం ఖర్చులు కూడా రావడం లేదు. ఏడాదిలో ఎక్కువ కాలం కిలో నిమ్మ రూ.10 లోపే ఉంటోంది. రెండు రోజుల క్రితం నిమ్మ కిలో రూ.4 నుంచి రూ. 5 ధర పలికింది. 50 కిలోల బస్తా కోతకు, రవాణాకు, ఎగుమతి, దిగుమతులకు రూ.350 ఖర్చు అవుతోంది. ఎక్కువసార్లు ఆ ధర కూడా రావడం లేదు.  
– కాల్నీడి సత్యనారాయణ, నిమ్మరైతు, శ్రీరామవరం 

కూలీలతో పారబోయిస్తున్నాం 
నిమ్మకు మార్కెట్‌ ధర సరిగా లేకపోవడంతో ఏటా నష్టపోతున్నాం. ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పెట్టుబడి, కోత ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు. నిమ్మను చెట్ల కింద వదిలేస్తే చెట్లు చనిపోతాయని కూలీలతో ఏరించి బయట పారబోయాల్సి వస్తోంది.  
– జబ్బా నాగరాజు, నిమ్మ రైతు, శ్రీరామవరం 

అనుబంధ పరిశ్రమలతో డిమాండ్‌ పెంచొచ్చు 
నిమ్మ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా డిమాండ్‌ పెంచుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంఎన్‌సీ కంపెనీలకు సరఫరా చేయడం ద్వారా లాభాలు పొందవచ్చు.  
– ఎ.దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement