కులీకుతూబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా?
హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మీర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నివసించే ఆంధ్రులు కూడా తమ బిడ్డలేనని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామన్నారు. మాట్లాడితే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు డప్పు కొట్టుకుంటారని.. అలాయితే కులీకుతూబ్ షా ఏంచేయాలి, ఆత్మహత్య చేసుకోవాలా అని వ్యంగ్యంగా అన్నారు. వర్షం పడితే సీఎం క్యాంపు ఆఫీసు, గవర్నర్ కార్యాలయం, సచివాలయం ముందు మోకాళ్ల లోతు నీళ్లు నిలబడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇదేనా అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.
తాము రుణమాఫీ అమలు చేసి చూపించామని, చంద్రబాబు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు.