సాక్షి, సిటీబ్యూరో: నగర శివారుల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లేఅవుట్ అనుమతుల మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు కావాలంటే వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాలని తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. గతంలో 2008, 2013లో విడుదల చేసిన జీవో ప్రకారం లేఅవుట్ అనుమతికి 30 ఫీట్ల రోడ్డు ఉంటే సరిపోతుందనే నియమాలను మార్చింది.
ఈ కొత్త నిబంధన ఇప్పటికే అనుమతులు కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకొని ప్రాసెస్‌లో ఉన్నవాటన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ ప్రస్తుత రోడ్డు 100 ఫీట్ల కన్నా తక్కువగా ఉంటే వారి లేఅవుట్ వరకు మిగిలిన రోడ్డును చూపిస్తేనే అనుమతులు ఇస్తామని హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా రోడ్డు చూపించినా వాటి అభివృద్ధి కోసం అదనపు చార్జీలు చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం మరింత రెట్టింపవుతుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతికూల ప్రభావం: రియల్ ఎస్టేట్ వ్యాపారులు
హెచ్‌ఎండీఏ తాజాగా తీసుకున్న వంద ఫీట్ల నిర్ణయం రియల్‌ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కరోనా దెబ్బతో విలవిలలాడుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రోడ్డు ఇంపాక్ట్ ఫీజు కింద అదనపు చార్జీలు వడ్డించడం ఎంతవరకు సమంజసం. గత రెండేళ్ల నుంచి చిన్నచిన్న లోపాలతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి కొత్త నిబంధనలు వర్తింపచేయడం కరెక్ట్ కాదు. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఊహించని దెబ్బ. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఏకంగా రియల్ వ్యాపారాన్ని కుదేలు చేయవద్దు. వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేనివారు ఇప్పుడు ఏం చేయాలి’అని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త నిబంధనలు ఇలా..
♦ ప్రస్తుత రోడ్డు వెడల్పు(ఫీట్లు): అదనంగా చెల్లించాల్సిన నగదు
♦ 80 నుంచి 100లోపు ఉంటే: 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు
♦ 60 నుంచి 80 లోపు ఉంటే : 66 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు
♦ 30 నుంచి 60లోపు ఉంటే : 100 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు
► 100 ఫ్లాట్ల కన్నా ఎక్కువగా ఉండి నాన్ హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతి కోసం 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాలి.
► ఇప్పటికే డ్రాఫ్ట్ లేఅవుట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, అలాగే లేఅవుట్ విత్ హౌసింగ్ (ఓపెన్, గేటెడ్)కు కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
► అమోదం పొందిన మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లు, అంతకన్నా ఎక్కువగా ఉండి ప్రస్తుత రోడ్డు వెడల్పు ఎంత తక్కువగా ఉన్నా (30 ఫీట్ల వరకు) రోడ్డు ఇంపాక్ట్ ఫీ కింద 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
► అయితే ఈ రోడ్డు ఇంపాక్ట్ ఫీజులను ‘స్పెషల్ ఎస్క్రో అకౌంట్’కింద ఉంచి లేఅవుట్‌లకు రోడ్ల అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ ఉపయోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment