బల్దియా పంచాయితీ! | GHMC shoots down merger of 35 villages | Sakshi
Sakshi News home page

బల్దియా పంచాయితీ!

Published Wed, Sep 18 2013 3:39 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

GHMC shoots down merger of 35 villages

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనం రోజు కోమలుపు తిరుగుతోంది. పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా జిల్లాలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పాలకవర్గం కూడా తాజా విలీన ప్రక్రియను తప్పుపడుతూ తీర్మానం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. కౌన్సిల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 35 శివారు పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన సమావేశంలో తేల్చిచెప్పిన కౌన్సిల్.. ఈ పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని రూలింగ్ ఇచ్చింది. శివారు ప్రాంతాల విలీనంపై మొదట్నుంచి పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2007లో ఎంసీహెచ్‌ను మహానగర పాలక సంస్థగా మారుస్తూ శివార్లలోని పది పురపాలక  సంఘాలను విలీనం చేశారు. అప్పట్లో ఈ విలీన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ప్రభుత్వం   హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయకపోవడంలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న గ్రేటర్‌కు కొత్త ప్రాంతాలు గుదిబండగా మారాయి. 
 
 ఈ నేపథ్యంలో 35 శివారు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆగ్రహాన్ని తెప్పించింది. పంచాయతీల విలీనం కుదరదని గతంలో కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాలకవర్గం.. విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టవద్దని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగరాభివృద్ధిని పర్యవేక్షించే యంత్రాంగం.. కౌన్సిల్ కనుసన్నల్లో పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకూడదని కౌన్సిల్ తేల్చిచెప్పడం అధికారులను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక.. కౌన్సిల్ తీర్మానానికి విరుద్ధంగా ముందుకు సాగలేక సంకటస్థితిని ఎదుర్కొంటోంది.
 
 విలీన గ్రామాలకు కొత్తచిక్కు..
 రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో కొత్త పనులు చేపట్టలేదు. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు మరింత దిగజారాయి. నల్లా బిల్లులు సహా చిన్న పనులకు సైతం కొర్రీలు పెట్టడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు పాలకవర్గాలు లేకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. అంతలోనే  35 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలు గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడంతో 15 పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నిక లు జరుగుతాయనుకుంటున్న తరుణంలో వీటిని గ్రేటర్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విలీనమైన 35పంచాయతీల అభివృద్ధి బాధ్యత తమది కాదని కౌన్సిల్ తెగేసి చెప్పడంతో కొత్త చిక్కు వచ్చింది. అటు పంచాయతీరాజ్.. ఇటు పురపాలక శాఖలు పట్టించుకోకపోతే మా గ్రామాల సంగతేంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్‌లో పంచాయతీల విలీనంలో ప్రభుత్వ నిర్ణయంపై బుధవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశముంది. 
 
 నార్సింగ్ జంక్షన్‌లో ఆందోళన..
 తెలుగుదేశం పార్టీ ఈ నెల 19 నుంచి జిల్లా పరిషత్ ఆవరణలో తలపెట్టిన నిరసన దీక్షలకు ప్రభుత్వం అనుమతించలేదు. హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, ఆందోళనలపై నిషేధం కొనసాగుతున్న దృష్ట్యా.. వేదికను మార్చుకోవాలని సూచించింది. దీంతో రాజేంద్రనగర్ మండలం నార్సింగ్ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. నిరవధిక దీక్షలో తనతోపాటు ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement