HMWS&SB
-
అందని ద్రాక్షగా వీడీఎస్
చింతల్: అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్ స్కీమ్) ప్రవేశపెట్టిన వీడీఎస్ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ డివిజన్ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో పనికి.. ఒక్కో రేటు.. వాలంటరీ డిస్పోజల్ స్కీమ్‌తో ప్రతి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెండు కనెక్షన్లు ఉన్న వారు సైతం వీడీఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. కాగా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బదలాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు తమ సిబ్బంది తెచ్చిన వాటినే స్వీకరిస్తూ మిగతా వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడపనిదే ఫైల్ ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఒక్కో రేటు చొప్పున ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫైల్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడీఎస్ దరఖాస్తులు అధికారుల వద్దకు చేరినా క్రమబద్ధీకరణకు గడువు ముంచుకొస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. చివరి నిమిషంలో ఫైల్ నాట్ సబ్మిటెడ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారని కొంతమంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు అప్లోడ్ చేసినా నేటికీ ఆర్డర్ కాపీ/ఫీజుబులిటీ కాపీలు రావడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. సిబ్బందే మీడియేటర్లు.. వీడీఎస్ స్కీమ్ దరఖాస్తులను సిబ్బందే మీడియేటర్లుగా మారినట్లు సమాచారం ఒక్కో కనెక్షన్‌కు రేట్లు మాట్లాడుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎటువంటి పనులు లేకపోయినా ఆ పని.. ఈç పని అంటూ ఉదయం రావడంతో పైరవీలు చేయడం వారి దినచర్యగా మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వసూళ్ల పేరుతో ఉద్యోగం చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొత్త కనెక్షన్ల విషయంలోనూ వారే అధికారులకు వెన్నుదన్నుగా ఉండి నూతన భవనానికి గోతులు తీయగానే గద్దల్లా వాలిపోయి కనెక్షన్ల పైరవీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు నేరుగా కార్యాలయానికి వచ్చే వారిని మధ్యవర్తుల వద్దకు పంపుతున్నట్లు కోడై కూస్తోంది. అధికారులు ఎక్కడా నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు జరుపకుండా మధ్యవర్తులనే ముందు నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా త్రిబుల్ టైమ్ బిల్లులు.. డివిజన్ పరిధిలోని వివిధ సెక్షన్లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
18 గంటలుగా సెల్ టవర్‌పైనే..
సాక్షి, నల్గొండ : జిల్లాలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్&ఎస్బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలంటూ నిన్నటినుంచి సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి మండలం మల్ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది. -
బల్దియా పంచాయితీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనం రోజు కోమలుపు తిరుగుతోంది. పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా జిల్లాలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పాలకవర్గం కూడా తాజా విలీన ప్రక్రియను తప్పుపడుతూ తీర్మానం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. కౌన్సిల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 35 శివారు పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన సమావేశంలో తేల్చిచెప్పిన కౌన్సిల్.. ఈ పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని రూలింగ్ ఇచ్చింది. శివారు ప్రాంతాల విలీనంపై మొదట్నుంచి పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2007లో ఎంసీహెచ్‌ను మహానగర పాలక సంస్థగా మారుస్తూ శివార్లలోని పది పురపాలక సంఘాలను విలీనం చేశారు. అప్పట్లో ఈ విలీన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయకపోవడంలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న గ్రేటర్‌కు కొత్త ప్రాంతాలు గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో 35 శివారు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆగ్రహాన్ని తెప్పించింది. పంచాయతీల విలీనం కుదరదని గతంలో కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాలకవర్గం.. విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టవద్దని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగరాభివృద్ధిని పర్యవేక్షించే యంత్రాంగం.. కౌన్సిల్ కనుసన్నల్లో పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకూడదని కౌన్సిల్ తేల్చిచెప్పడం అధికారులను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక.. కౌన్సిల్ తీర్మానానికి విరుద్ధంగా ముందుకు సాగలేక సంకటస్థితిని ఎదుర్కొంటోంది. విలీన గ్రామాలకు కొత్తచిక్కు.. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో కొత్త పనులు చేపట్టలేదు. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు మరింత దిగజారాయి. నల్లా బిల్లులు సహా చిన్న పనులకు సైతం కొర్రీలు పెట్టడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు పాలకవర్గాలు లేకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. అంతలోనే 35 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలు గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడంతో 15 పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నిక లు జరుగుతాయనుకుంటున్న తరుణంలో వీటిని గ్రేటర్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విలీనమైన 35పంచాయతీల అభివృద్ధి బాధ్యత తమది కాదని కౌన్సిల్ తెగేసి చెప్పడంతో కొత్త చిక్కు వచ్చింది. అటు పంచాయతీరాజ్.. ఇటు పురపాలక శాఖలు పట్టించుకోకపోతే మా గ్రామాల సంగతేంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్లో పంచాయతీల విలీనంలో ప్రభుత్వ నిర్ణయంపై బుధవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశముంది. నార్సింగ్ జంక్షన్లో ఆందోళన.. తెలుగుదేశం పార్టీ ఈ నెల 19 నుంచి జిల్లా పరిషత్ ఆవరణలో తలపెట్టిన నిరసన దీక్షలకు ప్రభుత్వం అనుమతించలేదు. హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, ఆందోళనలపై నిషేధం కొనసాగుతున్న దృష్ట్యా.. వేదికను మార్చుకోవాలని సూచించింది. దీంతో రాజేంద్రనగర్ మండలం నార్సింగ్ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో నిరాహారదీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. నిరవధిక దీక్షలో తనతోపాటు ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు.