నగర ప్రజా రవాణా వ్యవస్థకు నగిషీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజా రవాణా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టడీ(సీటీఎస్) ప్లాన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం(ఐటీఎస్) మాస్టర్‌ప్లాన్‌లను అమలు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. 2041 నాటికి మెట్రోపాలిటన్ ప్రాంతంలో జనాభా 1.90 కోట్లకు చేరే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని.. మెట్రో, బీఆర్‌టీఎస్, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ల వంటివి ఏమేరకు అభివృద్ధి చేయాలన్నది ఇందులో ఉన్నాయన్నారు.
సమగ్ర రవాణా వ్యవస్థపై లీ అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ప్రణాళికను, ఐటీఎస్ మాస్టర్‌ప్లాన్‌లను తార్నాక హెచ్‌ఎండీఏ కార్యాలయంలో బుధవారం ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా నీరభ్‌కుమార్ మాట్లాడుతూ జనవరి 10 వరకు ఈ ప్రదర్శన ఉం టుందన్నారు. www.hmdagov.in, www.ctshm2011.comవెబ్‌సైట్ లలోనూ దీన్ని చూడవచ్చన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే వ్యక్తిగతంగా లేదాcts2041@ hmda.gov.in ఇ-మెయిల్ ద్వారాకూడా పంపవచ్చన్నారు. రానున్న 30 ఏళ్లలో రవాణా ప్రణాళిక అమలుకు రూ.1.25 లక్షల కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు.