నగరంలో జంక్షన్ల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య
ఇరుకుగా ఉండటం, ఫ్రీలెఫ్ట్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు
127 జంక్షన్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నా ముందుకు సాగని పనులు
చాలా చోట్ల ఫ్లైఓవర్లు కట్టినా తప్పని తిప్పలు
వాటికి ముందు, వెనక వాహనాల రద్దీతో సమస్య
ఫుట్‌పాత్‌లు సరిగా లేక పాదచారులకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్‌తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.
భారీగా విస్తరణకు నిర్ణయించినా..
త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్‌కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు.
మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్‌లే పూర్తి కాలేదు.
ఫ్లైఓవర్ దాటితే అంతే..
కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.
⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.
జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా..
ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపు
తిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.
⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు.
⇒ జంక్షన్‌లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు.
⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు.
⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు.
⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు.
⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు.
⇒ పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.
విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్‌పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.
శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి
కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్‌ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్‌లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment