City traffic
-
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్‌తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.భారీగా విస్తరణకు నిర్ణయించినా.. త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్‌కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్‌లే పూర్తి కాలేదు.ఫ్లైఓవర్ దాటితే అంతే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా.. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపుతిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు. ⇒ జంక్షన్లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు. ⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు. ⇒ పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్‌పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
రహదారులపై ‘రాహ్‌గిరి’
గుర్గావ్: రోడ్లపై ద్విచక్ర, మోటారుర హిత వాహనాలను ప్రోత్సాహించడానికి కొన్ని అంతర్జాతీయ నగరాల్లో నిర్వహిస్తున్న రాహ్గిరిని గుర్గావ్లో అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విధానంలో రోడ్డును విభజించి ద్విచక్ర, మోటారు రహిత వాహనాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తారు. ఏడు నెలల క్రితమే తొలిసారిగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్గావ్లో రాహ్గిరిని నిర్వహించాయి. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుర్గావ్ (ఎంసీజీ) కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 12 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ లేన్ నాలుగు మీటర్ల పొడవు ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు ఈ లేన్‌ను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఎరుపురంగుతో గీత గీస్తామన్నారు. చిన్న రోడ్లపై మొదట ప్రయోగాత్మకంగా ఈ లేన్లను ఏర్పాటు చేసి, తదనంతరం మిగతా వాటికి విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికను ఎంసీజీ పరిధిలోని రోడ్లపై మొదట అమలు చేస్తామని తెలిపారు. నగరవ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి ఇతర కార్పొరేషన్లతో చేతులు కలుపుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ గుర్గావ్లోని కొన్ని ప్రాంతాలు హుడా పరిధిలో ఉన్నాయి కాబట్టి దానితోనూ చర్చిస్తామని ప్రవీణ్ వివరించారు. పంజాబ్, హర్యానా ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంసీజీ, కొన్ని స్వచ్ఛందసంస్థలతో కలసి ఈ ఆదివారం రాహ్‌గిరి నిర్వహిస్తోంది. అయితే ఎన్జీఓలు గతంలో సొంతంగా రాహ్‌గిరి నిర్వహించడంపై ప్రవీణ్ మాట్లాడుతూ ‘ఇటువంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం కాదు. రాహ్గిరిని మేము క్రమబద్ధీకరిస్తున్నాం. ప్రతీ దీ పద్ధతి ప్రకారం జరగాలన్నది మా ఉద్దేశం’ అని విశదీకరించారు. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సారికా పాండా ఈ విషయమై మాట్లాడుతూ ‘గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిండ చం వృథా. మేం భవిష్యత్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నాం. ఇక నుంచి రాహ్గిరిని సానుకూలంగా నిర్వహిస్తాం. ఇది స్వచ్ఛందసంస్థల కార్యక్రమం కాదు. గుర్గావ్వాసులంతా చురుగ్గా పాల్గొన్నారు కాబట్టే విజయవంతమయింది. రోడ్డు భద్రత, మోటారు రహిత రవాణా, శారీరక దారుఢ్యం, చట్టపరమైన అంశాలు వంటివాటిపై అవగాహన కల్పించడమే మా ఎజెండా. రాహ్‌గిరి గురించి ఎంసీజీ వేసవినృత్య శిబిరం నిర్వహిస్తే మేం సంతకాల ఉద్యమం చేపడుతాం. గుర్గావ్ పోలీసులు ప్రత్యేకంగా క్విజ్ నిర్వహిస్తారు. నగర మెజిస్ట్రేట్ చట్టపరమైన అంశాల గురించి చెబుతారు’ అని ఆమె వివరించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ సందడి నడుస్తోంది కాబట్టి కొందరు స్వచ్ఛంద సభ్యులు వీధు ల్లో సాకర్ పోటీలు నిర్వహించి రాహ్గిరిపై అవగాహన కలిగించాలని కూడా భావిస్తున్నారు. -
ఫలితాలిస్తున్న పీడీఏ మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఏటా నగర ట్రాఫిక్ విభాగం జారీ చేస్తున్న ఈ-చలాన్లలో 25 శాతం తిరిగి వచ్చేస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న చిరునామాలో వాహనచోదకులు ఉండకపోవడమే దీనికి కారణం. ఫలితంగా ఈ ఏడాది మార్చి నాటికి ట్రాఫిక్ విభాగం వద్ద పాతిక లక్షలకు పైగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు కొనుగోలు చేసిన పీడీఏ మిషన్లు దీనికి పరిష్కారంగా మారాయి. సుదీర్ఘ కాలంగా ఉండిపోయిన భారీ మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. వాహన చోదకులు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య ఘర్షణలకు లేకుండా ఉండేందుకు కెమెరా లు, సర్వైలెన్స్ కెమెరాలు, రెడ్‌సిగ్నల్ వైలేషన్ సిస్టం వంటిని ఆధునిక పరికరాలను వినియోగించి నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ పెంచారు. వీటిలో రికార్డు అయ్యే ఉల్లంఘనలకు ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా ఈ-చలాన్స్ పంపిస్తా రు. ఇలా వెళ్తున్న ఈ-చలాన్లలో నిత్యం 25 శాతం తిరిగి ట్రాఫిక్ విభాగానికే తిరిగి వచ్చేస్తుండటంతో పెండెన్సీ పెరిగిపోయింది. చిరునామా చిక్కకపోవడానికి కారణాలెన్నో.. కొత్తవాహనం రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు స్థానిక చిరునామా ధ్రువీకరణను సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత గుర్తింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. చిరునామా దగ్గరకు వచ్చేసరికి సమస్య వస్తోంది. నగరంలో నివసిస్తున్న వారిలో దాదాపు 60 శాతం అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారే. వీరు తమ అవసరాలను బట్టి అనేక ప్రాంతాలకు మారుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ గుర్తింపు కార్డులో ఉన్న చిరునామా మరో దాంట్లోకి వచ్చేసరికి మారిపోతోంది. మరోపక్క సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసిన వారిలో చాలామంది వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరు, చిరునామాపై మార్చుకోవడం లేదు. ఫలితంగా వాహనాన్ని అమ్మేసి ఏళ్లు గడిచినా అవి పాత యజమానుల పేర్లతో ఉండిపోతున్నాయి. ఫలితంగా ఆ వాహనాలకు జారీ చేసిన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఆధునిక పీడీఏలతో వసూళ్లు.. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అత్యాధునిక పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ) మిషన్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చారు. గతంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారుల వద్ద చలాన్ పుస్తకాలతో పాటు పీడీఏలు ఉండేవి. జంక్షన్లు, ఇతర పాయింట్ డ్యూటీల్లో ఉండే సిబ్బంది ఉల్లంఘనులకు జరిమానాలు (స్పాట్ చలాన్) విధించడం కోసం చలాన్ పుస్తకాలను వాడేవారు. నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కెమెరాల్లో చిక్కిన ఉల్లంఘనులకు ఈ-చలాన్లు పంపుతున్నారు. ఓ వాహనంపై ఇవి పెండింగ్‌లో ఉన్నాయా? లేదా? అనేది సరిచూడటం కోసం పీడీఏ మిషన్లు వినియోగించే వారు. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పీడీఏ మిషన్ల ద్వారా కేవలం పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్స్‌ను మాత్రమే కాకుండా స్పాట్ చలాన్లను కూడా విధించవచ్చు. చెల్లింపులకు నగదునే ఇవ్వాల్సిన అవసరం లేకుండా డెబిడ్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. వీటిసాయంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనులతో పాటు పాత బకాయిలు ఉన్న వారినీ ఎప్పకప్పుడు పట్టుకుని వసూలు చేయడం ప్రారంభించారు. బకాయి చెల్లించకుంటే వాహనం స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులకు చిక్కిన వారు అప్పటికప్పుడే డబ్బు చెల్లించేస్తున్నారు.