రహదారులపై ‘రాహ్‌గిరి’
గుర్గావ్: రోడ్లపై ద్విచక్ర, మోటారుర హిత వాహనాలను ప్రోత్సాహించడానికి కొన్ని అంతర్జాతీయ నగరాల్లో నిర్వహిస్తున్న రాహ్‌గిరిని గుర్గావ్‌లో అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విధానంలో రోడ్డును విభజించి ద్విచక్ర, మోటారు రహిత వాహనాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తారు. ఏడు నెలల క్రితమే తొలిసారిగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్గావ్‌లో రాహ్‌గిరిని నిర్వహించాయి. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుర్గావ్ (ఎంసీజీ) కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 12 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్‌ను నిర్మిస్తామని ప్రకటించారు.
ఈ లేన్ నాలుగు మీటర్ల పొడవు ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు ఈ లేన్‌ను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఎరుపురంగుతో గీత గీస్తామన్నారు. చిన్న రోడ్లపై మొదట ప్రయోగాత్మకంగా ఈ లేన్లను ఏర్పాటు చేసి, తదనంతరం మిగతా వాటికి విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికను ఎంసీజీ పరిధిలోని రోడ్లపై మొదట అమలు చేస్తామని తెలిపారు. నగరవ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి ఇతర కార్పొరేషన్లతో చేతులు కలుపుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ గుర్గావ్‌లోని కొన్ని ప్రాంతాలు హుడా పరిధిలో ఉన్నాయి కాబట్టి దానితోనూ చర్చిస్తామని ప్రవీణ్ వివరించారు. పంజాబ్, హర్యానా ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంసీజీ, కొన్ని స్వచ్ఛందసంస్థలతో కలసి ఈ ఆదివారం రాహ్‌గిరి నిర్వహిస్తోంది.
అయితే ఎన్జీఓలు గతంలో సొంతంగా రాహ్‌గిరి నిర్వహించడంపై ప్రవీణ్ మాట్లాడుతూ ‘ఇటువంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం కాదు. రాహ్‌గిరిని మేము క్రమబద్ధీకరిస్తున్నాం. ప్రతీ దీ పద్ధతి ప్రకారం జరగాలన్నది మా ఉద్దేశం’ అని విశదీకరించారు. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సారికా పాండా ఈ విషయమై మాట్లాడుతూ ‘గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిండ చం వృథా. మేం భవిష్యత్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నాం. ఇక నుంచి రాహ్‌గిరిని సానుకూలంగా నిర్వహిస్తాం. ఇది స్వచ్ఛందసంస్థల కార్యక్రమం కాదు. గుర్గావ్‌వాసులంతా చురుగ్గా పాల్గొన్నారు కాబట్టే విజయవంతమయింది.
రోడ్డు భద్రత, మోటారు రహిత రవాణా, శారీరక దారుఢ్యం, చట్టపరమైన అంశాలు వంటివాటిపై అవగాహన కల్పించడమే మా ఎజెండా. రాహ్‌గిరి గురించి ఎంసీజీ వేసవినృత్య శిబిరం నిర్వహిస్తే మేం సంతకాల ఉద్యమం చేపడుతాం. గుర్గావ్ పోలీసులు ప్రత్యేకంగా క్విజ్ నిర్వహిస్తారు. నగర మెజిస్ట్రేట్ చట్టపరమైన అంశాల గురించి చెబుతారు’ అని ఆమె వివరించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ సందడి నడుస్తోంది కాబట్టి కొందరు స్వచ్ఛంద సభ్యులు వీధు ల్లో సాకర్ పోటీలు నిర్వహించి రాహ్‌గిరిపై అవగాహన కలిగించాలని కూడా భావిస్తున్నారు.